బాబు వద్దే తేల్చుకుంటా
posted on Apr 2, 2011 @ 3:31PM
హైదరాబాద్: తనపై విమర్శలు చేస్తున్నవారిపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే తేల్చుకుంటానని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) చైర్మన్‌గా నాగం జనార్దన్ రెడ్డి కొనసాగడానికి అనర్హుడని సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పూర్తి సమయం వెచ్చించేందుకే తాను పిఎసి చైర్మన్ పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. పిఎసి చైర్మన్‌గా తాను ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తానని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతంతో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి రాయలసీమను పోల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణవాసులు దురభిప్రాయంతో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తుంటే గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిర్లక్ష్యం వహించారని, ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తారేమోనని ఆయన అన్నారు.