పరమసాధువుగా మారిపోయిన మోదీ... కన్యాకుమారిలో మూడురోజులపాటు ధ్యాన ముద్రలోకి
posted on May 31, 2024 @ 3:42PM
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక యాత్ర కోసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మోదీ పరమసాధువుగా మారిపోయారు. కాషాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శామియానాపై ప్రశాంత వాతావరణంలో ధ్యానంలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాగా, మోదీ కన్యాకుమారిలో 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా కన్యాకుమారి చేరుకున్నారు.మొదట ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శించిన ప్రధాని... ఆ తర్వాత శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు. ఆపై, కాషాయ వస్త్రాలు ధరించి ఇక్కడి ధ్యానమందిరంలో కూర్చున్నారు.
నిన్న సాయంత్రం నుంచి మోదీ ధ్యానం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని ధ్యానంలోనే కూర్చోనున్నారు. రేపు దేశంలో చివరిదైన ఏడో విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రేపటితో మొత్తం ఏడు దశల పోలింగ్ పూర్తవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది