టి.జి. జగన్మోహనగానం!
posted on Apr 19, 2012 @ 10:47AM
చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ కు వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై నమ్మకం తగ్గినట్టుంది. అంతేకాక జగన్ కు లభిస్తున్న జనాదరణపట్ల కూడా ఆయన తన మనసులో మాట దాచుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం తప్పదని మంత్రి జోస్యం చెప్పారు. దీనికి తోడు మెజారిటీ స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రను చూస్తుంటే ఆ పార్టీకి మంచి స్పందన లభించేటట్టుగా ఉందని అన్నారు.
తెలంగాణా కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది ఎన్నికల తర్వాత జగన్ గూటికి చేరడం ఖాయమంటూ చేసిన ప్రకటన వివాదాన్ని సృష్టించింది. ఈ ప్రకటనపై తెలంగాణా ప్రాంతంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ ప్రజలు కోరుతున్నందునే తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ తెలంగాణా ఆందోళనకారులకు ఆగ్రహాన్ని మరింత పెంచారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి నీతివంతమైన పాలన అందిస్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే కాంగ్రెస్ కు నష్టం జరుగుతోందని తేల్చేశారు.