మళ్లీ మద్యం ధరలకు రెక్కలు?
posted on Sep 21, 2012 @ 6:11PM
రాష్ట్రప్రభుత్వం ఎన్నిసార్లు కళ్లెలు బిగించినా మద్యం ధరలకు మాత్రం రెక్కలు వస్తూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చేతులు కలిపి క్విడ్‌ప్రోకో ద్వారా ధర మార్చేందుకు రంగం సిద్ధం చేశారని సమాచారం వెల్లడైంది. రాజకీయంలో ఉన్నప్పుడే నాలుగుచేతులా సంపాదించేయాలన్న ప్రతినిధులు ఉబలాటం తాగుబోతుకు అదనపుభారంగా మారనుంది. ఇప్పటికే మద్యంలో కల్తీ ఎక్కువై ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్న తాగుబోతులు మరోసారి అధికధరలకు మద్యం కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ మేరకు చురుకుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ 40శాతం దుకాణాల్లో రహస్యంగా రేట్లు పెరిగాయి. ప్రభుత్వం కొత్తగా ఎక్సయిజ్‌పాలసీ తీసుకువచ్చి నష్టాలను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడితే ప్రతినిధులు, అధికారులు మాత్రం వాటాలు వేసుకుని రేట్లు పెంచేయటం పట్ల తాగుబోతులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల్లో లొసుగులను పాతపాలసీలోని యజమానులు ఉపయోగించుకున్నారని చెప్పటానికి కొత్తగా పెరిగిన ధరలే నిదర్శనంగా చూపవచ్చు.
ఇప్పటికే క్విడ్‌ప్రోకో ద్వారా వందల కోట్ల రూపాయలు పంచుకున్నారని విశ్వసనీయంగా తేలింది. తాజాగా ఎపీబీసిఎల్ తయారు చేసే ఉత్పత్తుల ధరలను పెంచాలని ఒత్తిడి కూడా వస్తోంది. మద్యంతయారీదార్లయిన 7డిస్టలరీల యజమానులు 12శాతం ధర పెంచి ఉత్పత్తిని సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మిగిలిన 28 చిన్న డిస్టలరీలను కూడా ఓ ప్రభుత్వసలహాదారు స్వయంగా బెదిరించారని సమాచారం. ప్రభుత్వపెద్దలకు, తయారీదార్లకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే ఈ ధరలు పెరిగాయని మాత్రం పరిశీలనలో తేలింది. లేకపోతే 400శాతం ఎక్సయిజ్‌డ్యూటీ పెరగటానికి అవకాశమే లేదని కూడా స్పష్టమైంది. ఏమైనా కొత్తగా రంగంలో నిలిచిన డిస్టలరీలు మార్కెట్టును శాసిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని డిస్టలరీలు తమ ఉత్పాదన అమ్మకాలు పెంచుకునేందుకు వ్యాపారులకు డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఇలా డిస్కౌంట్లు ప్రకటించటం నేరమైనా ఆ కంపెనీలు దాన్ని పట్టించుకోవటం లేదు. అలానే వేరే కంపెనీ ఖాళీబాటిల్స్ సేకరించి తమ మద్యంతో నింపుతూ అక్రమవ్యాపారానికి కూడా కంపెనీలు తెరలేపుతున్నాయి. మద్యం వ్యాపారంలో జరుగుతున్న అక్రమాలు గురించి తెలిసినా తాగుబోతులు అలవాటును మానుకోలేక కొనసాగుతున్నారని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ధరలు పెరుగుతున్న విషయం తెలిసినా పాలకులు దీన్ని పట్టించుకోకపోవటం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది.