షర్మిల దీక్షకు కోమటిరెడ్డి సపోర్ట్.. రేవంత్‌కు వార్నింగా? వాట్ నెక్ట్స్?
posted on Jul 27, 2021 @ 4:42PM
రాజశేఖర్‌రెడ్డి అంటే మాకు ప్రాణం.. మిమ్మల్ని చూస్తుంటే మాకు వైఎస్సార్‌ను చూసినట్టే ఉంది. మీకు మా సంపూర్ణ మద్దతు. మా ప్రాంతంలో వైఎస్సార్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. స్వయంగా ఆయనే వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం పుల్లెంలలో నిరుద్యోగ దీక్ష చేస్తున్న షర్మిలకు పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఉంటూ కాంగ్రెస్‌కు పోటీగా పార్టీని పెట్టిన షర్మిలకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓపెన్‌గా సపోర్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
ఇటీవల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం ఇలానే షర్మిల పార్టీకి మద్దతు తెలిపారు. వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం సందర్భంగా ఆ ఈవెంట్ జరిగే కన్వెన్షన్ సెంటర్ ముందు ఆగి మరి.. అక్కడి పార్టీ కార్యకర్తలతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. షర్మిల పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పడం అప్పట్లో దుమారం రేపింది.
అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు.. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ షర్మిలకు బహిరంగంగానే మద్దతు తెలుపుతూ పరోక్షంగా కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కాంగ్రెస్ అసంతృప్తులుగా ముద్ర పడ్డారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తన అన్నకు పీసీసీ చీఫ్ పదవి వస్తుందేమోననే ఆశతో ఆగిపోయారని అంటారు. అయితే, ఎంతో ఆశపడిన అధ్యక్ష పదవి వెంకట్‌రెడ్డికి దక్కకపోవడంతో.. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీపై నారాజ్‌గా ఉన్నారని తెలుస్తోంది. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనంటూనే.. పార్టీతో టచ్‌లో లేకుండా పోయారు. రేవంత్‌రెడ్డికి ముఖం చాటేస్తున్నారు. రేవంత్ సైతం సీనియర్లు అందరినీ కలుస్తున్నారు కానీ, వెంకట్‌రెడ్డిని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో.. ఢిల్లీలో మకాం వేసిన వెంకట్‌రెడ్డి తన భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
మరోవైపు తన సోదరుడికి పీసీసీ పీఠం దక్కకపోవడం.. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ను వీడాలని చూస్తున్న రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడిక మరింత దూకుడు పెంచారు. ఎలాగూ టీఆర్ఎస్‌లో చేరేది లేదు కాబట్టి తాజాగా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఓ ఆటాడుకున్నారు. తన నియోజకవర్గానికి 2వేల కోట్లు ఇస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానంటూ సవాల్ కూడా విసిరారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. తమకిక కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేదని, ఉండదని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. అయితే, బీజేపీలో చేరుదామని అనుకున్నా.. ఇటీవల కాలంలో ఆ పార్టీ దూకుడు బాగా తగ్గిపోవడంతో ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో రాజన్న రాజ్యమంటూ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో రాజకీయం రంజుగా మారింది. పార్టీ ఆవిర్భావం రోజే షర్మిలకు వెంకట్‌రెడ్డి ఆల్ ది బెస్ట్ చెబితే.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి షర్మిలకు ఫోన్ చేసి సంఘీభావం పలకడం ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్.. షర్మిల పార్టీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. వైఎస్సార్ హయాంలో ఈ సోదరులు ఓ వెలుగు వెలిగారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితులుగా మెదిలారు. అదే అభిమానంతో షర్మిలను బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మద్దతు పార్టీ లైన్‌కు వ్యతిరేకమని తెలిసే.. షర్మిల ఎంత బలపడితే కాంగ్రెస్ అంతగా దెబ్బతింటుందని తెలిసే.. ఆ ఇద్దరు ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారని అంటున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారని కూడా అనుమానిస్తున్నారు. తమకు పార్టీలో ప్రయారిటీ దక్కకపోతే తమ దారి తాము చూసుకుంటామనే మెసేజ్ ఇస్తున్నారని అంటున్నారు. తమకు షర్మిల పార్టీ రూపంలో మరో ఆప్షన్ రెడీగా ఉందని.. ఇక్కడ కాకపోతే అక్కడ అన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆ.. ఏముందిలో పోతేపోనీ అని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను లైట్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. రాజకీయంగా, ఆర్థికంగా ఫుల్ స్ట్రాంగ్. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తాన్ని శాసించగల సత్తాది. అంతటి బలమైన లీడర్లను కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వదులుకోదు. ఆ విషయం తెలిసే.. వాళ్లు కూడా పార్టీని కేర్ చేయకుండా రెబెల్‌గా ఉంటారని అంటారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఏరికోరి మరీ రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేశాక కూడా.. పదవి అమ్ముకున్నారంటూ.. రేవంత్‌కు చంద్రబాబే పదవి ఇప్పించారంటూ.. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేశారు వెంకట్‌రెడ్డి. అధిష్టానం నుంచి గట్టి షంటింగ్స్ పడటంతో ఆ తర్వాత నోరు మూసుకున్నారు. అలిగి ఢిల్లీ వెళ్లిపోయారు. ఇలా, కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌లో తాము ఇండిపెండెంట్‌గా ఉంటామని.. తాము ఏమి చేసినా, ఏమి మాట్లాడినా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనే విషయం పదే పదే చాటడానికే ఇలా గడబిడ చేస్తుంటారని అంటారు. కాంగ్రెస్‌కు పోటీగా పార్టీ పెట్టిన షర్మిలను కోమటిరెడ్డి సోదరులు ఇలా బహిరంగంగా సపోర్ట్ చేస్తుండటాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటుందా? లేక, వెయిట్ అండ్ సీ అంటూ సరైన సమయం కోసం వేచి చూస్తుందా? చూడాలి...