తెరాస మరో కొత్త నాటకం షురూ

 

ఈ రోజు తెరాస మరో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టింది. “కేసీఆర్ ని హతమార్చడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని, అందుకు సుపారీ కూడా ఇచ్చినట్లు తమకు తెలుసని, ఆ కుట్రలు ఎవరు ఎందుకు పన్నుతున్నారో కూడా తమకు బాగా తెలుసునని, కానీ సమయం వచ్చినప్పుడు అది బయటపెడతామని, కేసీఆర్ పై ఈగ వాలినా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని ” ఆయన మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కు ప్రభుత్వం వెంటనే జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేసారు.

 

కాంగ్రెస్ తెరాసను, కేసీఆర్ ను పక్కనబెట్టి తెలంగాణా ప్రకటించేసినప్పటి నుండి ఆయన పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి కూడా కుడితిలో పడిన ఎలుకవలే ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు కాంగ్రెస్ తెలంగాణా సెంటిమెంట్ ఎత్తుకుపోవడమే కాకుండా తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పని పరిస్థితి కల్పించింది. తెరాస బెట్టు చేస్తుంటే, మరో వైపు ఆ పార్టీ నేతలు ఒకరొకరుగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు. విలీనం చేస్తే అసలు తన ఉనికినే కోల్పోయే ప్రమాదం. చేయకపోతే పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం.

 

ఇటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తప్ప తమ రాజకీయ మనుగడ ఉండదని వారు భావిస్తున్నారు. అందుకే మొన్న ఆంధ్రా ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవలసిందే అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దాని పరిణామాలు రోజూ అందరూ చూస్తూనే ఉన్నారు.ఈ రోజు “కేసీఆర్ హత్యకి కుట్ర’ అంటూ ఆ అగ్నికి మరింత ఆజ్యం జోడించారు. దీని విపరీత పరిణామాలు రేపటి నుండి బయటపడినా ఆశ్చర్యంలేదు. ఈవిధంగా విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం వలన అంతిమంగా నష్టపోయేది వారే తప్ప వేరేవరూ కాదు. అయితే ఈవిధంగా ఎంత కాలం నెట్టుకు రాగలమని వారే ఆలోచించాలి.

 

కేసీఆర్ హత్యకు నిజంగా ఎవరో కుట్ర పన్నుతున్నారని తెలిస్తే ముందుగా ఆయనకి ఏ ప్రమాదం జరుగకుండా మరింత భద్రత పెంచి జాగ్రత్త పడాలి. ఆయన హత్యకు ఎవరు కుట్ర పన్నుతున్నారో కూడా వారికి తెలిసినపుడు ముందుగా ఆ విషయం మీడియాకు కాకుండా పోలీసులకి చెప్పి రక్షణ కోరి ఉండాలి. ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నసంగతి తెలిసినప్పటికీ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాని ఏదో శుభకార్యం జరగబోతున్నటు మీడియాలో ప్రకటించుకోవడం నీచ రాజకీయమే.

 

ఆయన హత్యకు ఎవరు కుట్ర పన్నుతున్నారో తెలుసినపుడు సదరు కుట్రదారులపై పోలీసులకి పిర్యాదు చేయాలి. కానీ అలాచేయకుండా సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయట పెడతామని చెప్పడం చూస్తే దానివెనుక దాగిన వారి చవకబారు ఆలోచనలకి కనపడుతాయి. తమ రాజకీయ మనుగడకోసం ఇటువంటి కపట ఆలోచనలు, ఎత్తులు వేస్తే అది బెడిసికొట్టడం ఖాయం. అబద్దాల పునాదుల మీద పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తే అది వారికే నష్టం.

 

అసలు ముందు కేసిఆర్ కి ఆయన స్వంత పార్టీ నేతల నుండే ఏమయినా ప్రమాదం పొంచి ఉందేమో పోలీసులు విచారించాలి.