కెటీఆర్ ఇంట్లో ఎసిబి సోదాలు 

Publish Date:Jan 6, 2025

ఫార్ములా ఈ రేసు కేసులో ఎసిబి విచారణకు  కెటీఆర్ హజరైవెనుదిరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఉదయం  ఎసిబి ఆఫీసు గేటు ముందు వరకు వెళ్లిన కెటీఆర్ ఎసిబి ఆఫీసులోకి ఎంటర్ కాలేదు. తన న్యాయవాదులను వెంట బెట్టుకుని లోపలికి వస్తానని మొరాయించడంతో ఎసిబి అధికారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కెటీఆర్ చేసిన ప్రకటన సాయంత్రం వరకు నిజమైంది. కెటీఆర్ కు స్పష్టమైన సమాచారం ఉండడంతో నా ఇంట్లో ఎసిబి సోదా చేస్తుందని ప్రకటన చేశారు. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కెటీఆర్ ఎ వన్ నిందితుడు. ఇదే కేసులో ఐఏఎస్ అధికారులైన బిఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లు కూడా  నిందితులుగా ఉన్నారు. 

రాజ‌కీయాల్లో క‌విత మ‌ళ్లీ యాక్టివ్‌.. హ‌రీశ్‌కు చెక్ పెట్టేందుకేనా?

Publish Date:Nov 24, 2024

బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు,  సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా  ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ బాధ్య‌త‌ల‌న్నీ కేటీఆర్ త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. అధికార పార్టీకి కౌంట‌ర్ ఇస్తూ పార్టీలో అన్నీతానే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో కేటీఆర్ జైలుకెళ్తే పార్టీని ముందుకు న‌డిపించే వారు ఎవ‌ర‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో మొదలైంది. పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు   రాబోయే రోజుల్లో హ‌రీశ్‌రావు పార్టీలో కీల‌కంగా మార‌బోతున్నాడ‌ని, ఆయ‌నే పార్టీని ముందుకు న‌డిపించే వ్య‌క్తి అంటూ  ప్ర‌చారం చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే క‌విత రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్ర‌జా క్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవ‌ల అదానీ కేసు విష‌యంలో క‌విత కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌ గురుకులలో ఫుడ్ పాయిజ‌న్ కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ప‌రామ‌ర్శించి కాంగ్రెస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు చేశారు. దీనికితోడు చాలారోజుల త‌రువాత త‌న నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఏ), బీసీ కుల సంఘాల సమావేశం నిర్వ‌హించారు. దీంతో క‌విత ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్ల‌క‌ముందు క‌విత అసెంబ్లీలో పూలే విగ్ర‌హం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. బీసీ హ‌క్కుల సాధ‌న ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఏ), భార‌త జాగృతి సంస్థ‌ల త‌ర‌పున జిల్లాల్లో రౌండ్ టేబుల్ స‌మావేశాలు నిర్వ‌హించారు. మ‌న‌మెంతో మ‌న‌కంత నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తూ బీసీ ఉద్య‌మాన్ని తలకెత్తుకున్నారు.   కుల‌గ‌ణ‌న చ‌ట్ట‌బ‌ద్ధంగా చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. అయితే  అరెస్ట‌యి జైలుకెళ్లి,  బెయిల్ పై  విడుద‌లైన అనంత‌రం  సైలెంట్ అయిపోయారు.  పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అటువంటి క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.  క‌విత ఉన్న‌ట్లుండి ఇప్పుడు రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అంద‌రూ ఊహించిన‌ట్లు కేటీఆర్ నిజంగా జైలుకెళితే పార్టీని న‌డిపించే బాధ్య‌త‌ను క‌విత తీసుకోబోతున్నార‌ని, అందుకే ఆమె ఉన్న‌ట్లుంటి రాజ‌కీయాల్లో యాక్టీవ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. క‌విత పొలిటిక‌ల్ గా మైలేజ్ సంపాదించుకున్నా కేటీఆర్ కు వ‌చ్చే ఇబ్బంది ఏమీలేదు. ఎందుకంటే.. క‌విత జైల్లో ఉన్న స‌మ‌యంలో త‌న చెల్లికి బెయిల్ కోసం కేటీఆర్‌ ఢిల్లీలోనే మ‌కాం వేసి తీవ్రంగా శ్ర‌మించారు. జైలు నుంచి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత క‌విత‌ సైతం   అన్న‌ను హ‌త్తుకొని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క్ర‌మంలో అన్నాచెల్లెలు మ‌ధ్య ఒక‌రిపైఒక‌రికి ఉన్న ప్రేమ బ‌హిర్గ‌తం చేశారు. దీంతో రాజ‌కీయాల్లో తాను ఎంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ప్ప‌టికీ.. త‌న అన్న త‌రువాత‌నే ఉంటాన‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పారు. ఈ క్ర‌మంలో ఒక‌వేళ కేటీఆర్ ఏదైనా కేసులో జైలుకెళ్లిన‌ప్ప‌టికీ పార్టీ బాధ్య‌త‌లను క‌విత త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుంటార‌ని, కేటీఆర్ జైలు నుంచి తిరిగిరాగానే ఆయ‌న సార‌థ్యంలో రాజ‌కీయాల్లో కొన‌సాగుతార‌ని బీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇలా అన్నాచెల్లెలు బీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం కృషి చేస్తూనే.. మ‌రో వ్య‌క్తి చేతికి పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారని, త‌ద్వారా కేసీఆర్ వార‌సుడు కేటీఆర్ అనే విష‌యాన్ని క్యాడ‌ర్ లోకి క‌విత‌  బ‌లంగా తీసుకెళ్తున్నార‌ని బీఆర్ఎస్‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓట‌మి త‌రువాత కేసీఆర్ పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌టం లేదు. అడ‌పాద‌డ‌పా పార్టీ నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ.. కేటీఆరే పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నారు. జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నాడు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. హ‌రీశ్ రావు లాంటి సీనియ‌ర్ నేత‌కు బీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని పార్టీలోని ఓ వ‌ర్గం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేటీఆర్ జైలుకెళితే పార్టీ ప‌గ్గాలు హ‌రీశ్ రావు చేతికి అప్ప‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని భావించిన కేసీఆర్‌.. త‌న కుమార్తె క‌విత‌ను రంగంలోకి దింపిన‌ట్లు బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.   జైలు నుంచి బెయిల్‌పై వ‌చ్చిన త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న క‌విత త‌న తండ్రి సూచ‌న‌తోనే ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా హ‌రీశ్ రావుకు చేతికి మాత్రం పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లో భాగంగానే క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యార‌ని తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టిచూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

నోస్ట్రాడమస్ జోస్యం నిజం కానుందా?

Publish Date:Nov 26, 2024

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? 2025లో ప్రపంచ వినాశనానికి నాంది ఏర్పడుతుందని ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ చెప్పిందే నిజమౌతుందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే జవాబు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్ర వినియోగానికి సై అంటూ చేస్తున్న హెచ్చరికలు, అమెరికా, నాటో దేశాలపై ఆయన వెల్లగక్కుతున్న విద్వేషం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మానవాళి ముంగిట్లోకి వచ్చేసిందనే అనిపిస్తున్నది. ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు నష్టాలు, అపజయాలే కాదు అవమానాలనూ తెచ్చి పెట్టింది. ఉక్రెయిన్  నోటో దేశం కాకపోయినా, రష్యా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తున్న నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. ఆయుధాలు సరఫరా చేశాయి. అమెరికా కూడా ఉక్రెయిన్ కు ఆర్థికంగా, ఆయుధాల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించింది. దీంతో రోజులలో పూర్తైపోతుందని రష్యా భావించిన యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ కంటే అన్ని విధాలుగా రష్యాకే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ స్థితిలోనే పుతిన్ ఇటీవల ఆర్మీ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో కీలక ఆదేశాలు జారీ చేశారు.  అవసరమైతే అణ్వస్త్రాలను వినియోగించడానికి అనుమతించే ఫైల్ పై సంతకం కూడా చేసేశారు.  దీంతోనే ప్రపంచ వినాశనం గురించి నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యం నిజం కానుందన్న భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా,నాటో దేశాలపై రష్యా బ్లాస్టిక్ మిస్సైల్స్ గురిపెట్టి సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక వేళ రష్యా నేరుగా నాటో దేశంపై దాడి చేస్తే మూడో ప్రపంచయుద్ధం ప్రారంభమైనట్లే. అసలు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆరంభం అయినప్పుడే ప్రపంచ దేశాలకు చెందిన ప్రసిద్ధ విశ్లేషకులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఊహించారు. ఇప్పుడు రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఊహలు.. ఊహాగానాలు కాదనీ, వాస్తవ రూపం దాల్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అర్ధమౌతోంది.  అణు దాడులు చేస్తామని పుతిన్ ఎలాంటి బేషజాలూ లేకుండా ప్రపంచ దేశాలను హెచ్చరించారు.  త్తగా రూపోందించిన ఓరెప్నిక్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఈ యుద్ధంలో పరీక్షించాలని నిర్ణయం తీసుకున్న పుతిన్ ఈ మేరకు ఇప్పటికే తన సైన్యాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు.  ఇప్పటివరకూ ఈ మిస్సైల్స్ ను అడ్డుకునే వ్వవస్థ లేదు కాబట్టి ప్రపంచ దేశాల లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యా పరీక్షించాలనుకుంటున్న బాలిస్టిక్ మిస్సైల్స్ 5000  కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులువుగా ఛేదించేయగలవు. నాటో దేశాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందుకే రష్యా ఆ మిస్సైల్ ను ప్రయోగిస్తే.. నాటో దేశాలు అనివార్యంగా రష్యాపై దాడులకు ఉపక్రమిస్తాయి. అదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అయితే రష్యా కూడా అందుకు సిద్ధంగానే ఉంది. ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై యుద్ధానికి వస్తే తనకు మద్దతుగా నిలిచే దేశాలను కూడగడుతోంది. ఇప్పటికే   ఉత్తర కొరియా,చైనా రష్యాకు మద్దతు ప్రకటించాయి.  ఆ ధైర్యంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు సహాయం చేసిన దేశాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.  ఈ తరుణంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు ఉక్రెయిన్, రష్యాలకు మధ్యవర్తిత్వం చేయగలిగే ప్రపంచ నేత ఎవరన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది. ప్రధాని మోడీ ఆ పని చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. యుద్ధాన్ని ఆపడమే తక్షణ కర్తవ్యంగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నోస్ట్రాడమస్ జోస్యం ఎట్టిపరిస్థితుల్లోనూ నిజం కాకూడదు.  

జీవితం సంతోషంగా సాగాలంటే ఇవి ముఖ్యం..!

Publish Date:Jan 6, 2025

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు.  సంతోషంగా ఉంటే జీవితంలో చాలా సమస్యలు జయించవచ్చు. కానీ సంతోషంగా ఉండనీయకుండా చేసే సందర్బాలు,  సమస్యలు చాలా ఉంటాయి. మరీ  ముఖ్యంగా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఆలోచనతో, తెలివిగా ఎదుర్కోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉంటే సంతోషం అనే మాట దూరంలోనే ఉండిపోతుంది.  జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే.. శ్వాస.. శ్వాస అనేది ప్రతి క్షణం, ప్రతి మనిషిలో జరిగే అసంకల్పిత చర్య.  అయితే శ్వాస వ్యాయామాలు మనిషిని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తుంటే.. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది.  మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం.. ఆహారం శరీరానికి శక్తి వనరు. అయితే ఆహారం తినే విధానం మనసును ప్రభావితం చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. అంటే మనసు పెట్టి ఆహారాన్ని శ్రద్దగా తినడం.  తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం.  ఆహారం వాసన,  ఆహారం ఎలా ఉంది అని దాన్ని మనసుతో పరిశీలించి తినడం.  ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా తృప్తిని ఇస్తుంది. నడక.. నడక చాలామంది చేసే వ్యాయామంలో భాగం. అయితే నడిచేటప్పుడు నడకను కూడా పరిశీలించాలి. నడిచేటప్పుడు పాదాల కదలిక, అడుగులలో లయ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాకింగ్ చేయడంలో లవ్ లో పడతారు. ఇది మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది. శ్రద్ద.. శ్రద్దగా ఏ పనిని అయినా చేస్తే ఎంత పరిపూర్ణ ఫలితాలు వస్తాయో.. ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు అంతే శ్రద్దగా వెంటే వ్యక్తులతో బంధాలు బాగుంటాయి.  శత్రుత్వం లేకుండా స్నేహభావంతో కూడిన బంధాలు ఉంటే మనసుకు ప్రశాంతత, జీవితంలో సంతోషం లభిస్తాయి. పని.. నేటి కాలంలో చాలామంది మల్టీ టాస్కర్లే.. ఇది మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది.  జీవితంలో సంతోషం కావాలంటే మల్టీ టాస్కింగ్ ను పక్కన పెట్టి సింగిల్ టాస్క్ లను చేస్తూ ఉండాలి. పైగా మల్టీ టాస్క్ చేసేటప్పటితో పోలిస్తే.. సింగిల్ టాస్క్ చేసేటప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం, పనిని చాలా బాధ్యతగా ఆసక్తిగా పూర్తీ చేయడం దాని ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటం గమనించవచ్చు.  ఇవి జీవితంలో సంతోషాన్ని మెరుగు పరుస్తాయి. కమ్యూనికేషన్.. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటే  చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు.  వ్యక్తిగతంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కమ్యునికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తులతో బంధాలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. అలసట.. అలసట మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఒకే పని చేయకూడదు.  పని నుండి అప్పుడప్పుడు కాస్త దృష్టి మరల్చడం,  రిలాక్స్ అవ్వడం మనిషిని అలసటకు లోను కానీయవు.                                                *రూపశ్రీ.  
[

Health

]

జబ్బులు ఎందుకొస్తాయంటే...

Publish Date:Jan 6, 2025

అనారోగ్యం రావడానికి కారణం ఏంటి?? ఆలోచిస్తే.. సరియైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానము లేనివారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయాల్లో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంటుంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలే అనే అపోహతో కొందరు, పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అనే అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు.  కొన్ని జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా ఆ జబ్బు మాత్రం వేరేగా ఉంటుంది. ఇలాంటి సమస్యను దృవీకరించాల్సింది వైద్యులు తప్ప మనం కాదు కదా.. కానీ చాలామంది ఇదిగో ఇదే నాకు వచ్చిన సమస్య అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు.  ఏ వ్యాధి అనే విషయం తెలుసుకోకుండా పైన కనుపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవటం వల్ల వ్యాధి తగ్గకపోగా కొన్ని సమయాలలో వాడబడిన మందులవల్ల శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులల్లో ఇలాంటి దుష్పరిణామాలను నివారించటం వైద్యులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మందులనేవి స్వయంగా వాడుకోవటం చాలా చెడ్డ అలవాటు. ప్రస్తుతకాలంలో అందరూ ఓ అలవాటుగా సేవించే కాఫీ,టీ, లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవే..  వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహము కలుగవచ్చు కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభకరమైందికాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునేవారికి కొంతకాలమైన తరువాత  అవి తీసుకోకపోతే నిస్సత్తువ, చిరాకు, పనులమీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల నాడీ బలహీనత సమస్య ఎదురై, నిత్యం తలనొప్పితో బాధ పడటం జరుగుతుంది. ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వ్యాదులకు లోనయ్యే ప్రమాదముంది. గుండెవ్యాధులు, కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు రావడానికి ధూమపానం వాడకాలు ముఖ్యమని చెప్పాలి. సిగరేట్, చుట్ట, బీడీ లాంటివి త్రాగటంవల్ల ఆ పొగను కొంత బైటికి వదలటం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. పొగాకు పొగత్రాగే వారికెంత హానికరమో, బైటగాలిలో వదలిన పొగను వారికి తెలియకుండా పీల్చే వారికి కూడా అంతే హానికరంగా పరిణమిస్తుంది. పొగాకు నమలటం, జరదా కిళ్ళీలు వేయటం వల్ల కూడా హృద్రోగాలు, కాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని దాని కారణంగా కాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటివి సంభవిస్తుంటాయి. పొగాకు నమిలేవారికి నోరు, పళ్ళు, గొంతు, స్వరపేటికలకు సంబంధించిన తీవ్రవ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువ. మన శరీరానికి జబ్బు తెచ్చిపెట్టే కొన్ని అలవాట్లు గమనిస్తే… ప్రతిరోజు స్నానం చెయ్యకుండా ఉండటం మొదటి అలవాటు. శరీర శుభ్రత లేకపోతే జబ్బులు రావడానికి మొదటి మార్గం మనమే ఇచ్చినట్టు. క్రమబద్దము లేని భోజనము చేయడం. రోజుకొక వేళలో భోజనం చేయడం వల్ల శరీరం ఏ సమయానికి శక్తిని తయారు చేసుకోవాలో నిర్ణయించుకోలేదు.   అధికంగా ఉపవాసములు చేయడం పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. నిజానికి ఉపవాసం అనేది కూడా ఆరోగ్య ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిందే అయినా దాన్ని అతిగా పాటిస్తే శరీరానికి నష్టం చేకూరుతుంది.  బయట తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. అలాగే శీతల పానీయాలు, చల్లని పదార్థాలు తినడం కూడా నష్టమే.   ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఫుడ్ చెడిపోకుండా వాయువులు నింపుతారు కాబట్టి వాటిని తిన్నా అనారోగ్యం వెంట వస్తున్నట్టే.. చాలామంది శారీరక సమస్యల విషయంలో సంకోచం చెందుతారు. కానీ అతిగా శృంగారంలో పాల్గొనడం ఎంత చేటు చేస్తుందో.. అసలు శృంగారం జోలికి పోకుండా సన్యాసిలా బ్రతకడం ఈకాలంలో అంతే చేటు చేస్తుంది.   ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు నోరు శుభ్రంగా లేకపోతే జబ్బులు వస్తాయి.  సౌకర్యవంతమైన దుస్తులు కాకుండా ఫ్యాషన్ పేరుతో బిగుతుగా ఉన్నవి ధరించడం. శరీరంలో అవయవాల ఒత్తిడికి కారణమై తద్వారా వాటి క్రమబద్ధత తప్పేలా చేస్తుంది. ఆకుకూరలు–పౌష్టికాహారములు వాడకుండా ఉండటం కూడా అనారోగ్యానికి మూలకారణమే. మన శరీరానికి అనారోగ్యం దాపురించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి చూడండి.                                     ◆నిశ్శబ్ద.