జగన్ మెజారిటీని తగ్గించే పనిలో కాంగ్రెస్
posted on Apr 5, 2011 @ 2:12PM
కడప: కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం పక్కా వ్యూహ రచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని మానసికంగా ఒక నిర్ధారణకు వచ్చిన అధిష్టానం.. జగన్ మెజారిటీని తగ్గించే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి అనే పేరుతో ఉండే పలువురు అభ్యర్థులను డమ్మీ అభ్యర్థులుగా బరిలోకి దించాలని భావిసోంది. ఇలా చేయడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురై తాము అనుకున్న చోటు ఓటు వేయలేక పోవచ్చన్నది ఆ పార్టీ భావనగా ఉంది. ఈ రెండు స్థానాలకు మే నెల 8వ తేదీన జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి (కడప లోక్‌సభ), వైఎస్.విజయలక్ష్మి (పులివెందుల) స్థానాల్లో పోటీ చేయనున్నారు. అయితే, అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమై తెలుగుదేశం పార్టీలు మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అభ్యర్థుల ఎంపికపై మాత్రం జిల్లా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, తెదేపాలు గెలుపు కంటే జగన్ మెజారిటీని తగ్గించేందుకు ఎక్కువ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.