తల్లిని గెలిపించుకోవడానికి జగన్ తంటాలు
posted on Apr 3, 2011 @ 2:03PM
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ సీటును గెలుచుకోవడానికి వ్యూహాలు చేస్తున్నారు. గత ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబం వైపే నిలబడిన కడప, పులివెందుల ప్రజలు ఇప్పుడు వైయస్ మరణం తర్వాత నిలువునా కుటుంబం చీలడంతో ఎటువైపు ఉంటారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వివేకానందరెడ్డికి స్థానికంగా ఉన్న పట్టు దృష్ట్యా ఆయన వైపే ప్రజలు ఉంటారని కొందరు చెబుతుండగా, వైయస్ ఇమేజ్ దృష్ట్యా జగన్ వైపే ఉంటారని మరికొందరి వాదన. ఈ ఎన్నికల ద్వారా జగన్ కాంగ్రెసు వైపు కాకుండా వైయస్ వైపు ఉన్నారని చెప్పడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు కడప పార్లమెంటు స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన వర్గం నేతలతో శనివారం భేటీ అయ్యారు. ఎన్నికలలో వ్యూహాలపై వారితో చర్చించారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక తన వంతుగా తల్లిని పులివెందుల స్థానం నుండి గెలిపించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా చేయించుకున్న ప్రచార రథంలో మంగళవారం నుండి ప్రచారం ప్రారంభించనున్నారు. 25 రోజుల పాటు సాగే ఈ ప్రచార పర్యటనలో జగన్ కడప నుండి తాను గెలవడానికి ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఇక తల్లి విజయమ్మ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి ఆమెను గెలిపించడానికి ఏకంగా 7 రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా జిల్లా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పడమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించుకోనున్నారు.
కాగా, యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయలక్ష్మి ఈ నెల 16న నామినేషన్ వేయనున్నారు. కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయమ్మ పులివెందుల శాసనసభ స్థానానికి, జగన్ కడప లోక్‌సభ స్థానానికి గత నవంబర్‌లో రాజీనామా చేయటంతో ఆ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఉగాది పండుగ తర్వాత ప్రకటించనున్నారు.