దసరాకు విశాఖకుజగన్ నిజమేనా? డిసెంబర్ అంటారేంటి?
posted on Oct 13, 2023 @ 10:11AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహమో, అలవాటో తెలియదు కానీ ఆయన చెప్పినదేదీ చేయరు. అన్న మాట నిలబెట్టుకోరు. నాలుగేళ్లుగా ఆయన పాలన తీరు ఇలాగే ఉంది. ప్రజలకు అరచేతిలో వైకుఠం చూపించి.. వాస్తవంలో నరకయాతన పెడుతున్నారు. బటన్ నొక్కి డబ్బులు పందేరం చేస్తున్నామంటారు కానీ.. ఆయన నొక్కిన బటన్ బాపతు సోమ్ములు ఎప్పుడు ఖాతాల్లో పడతాయా అని లబ్ధిదారులు నెలల తరబడి వేచి చూడాల్సిందే. ఇక ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన పెన్షన్లు ఏ నెలకాల సకాలంలో పడి చాలా చాలా కాలమే అయ్యింది. ఒకే సారి జీతాల పంపిణీ అన్నది అసలు లేనే లేదు.
ఇక ఆయన మూడు రాజధానుల ముచ్చట అన్నది అంతం లేని కథలా నాలుగున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. కోర్టులు కూడదంటున్నా.. ఆయన ఆ పాట పాడుతూనే ఉన్నారు. తాజాగా దసరా నుంచి తన మకాంను విశాఖకు మార్చేస్తామని గట్టిగా చెప్పారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లూ కూడా జరిగిపోతున్నాయి.
జగన్ విశాఖ మకాం గురించిన వార్తలు గత నాలుగేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మార్చి పోతే సెప్టెంబర్ ఉందిగా అన్నట్లు ముహూర్తాలు ఖరారు అవుతూనే ఉన్నాయి. వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికల గడువు వచ్చేసింది. ఈ దసరాకు కాకపోతే సంక్రాంతికి అనే చాన్స్ లేదు. ఇక తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలడమంటూ జరిగితే.. అధికారాన్ని వదులుకుని ఇంటికి వెళ్లిపోవడమే. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచే చాన్స్ అస్సలు లేదన్న విశ్లేషణలు, సర్వేలను బట్టి అలాగే అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.
అందుకే ఇప్పుడు దసరా నుంచి విశాఖలోనే జగన్ అంటూ గట్టిగానే చెబుతున్నారు వైసీపీ నాయకులు. ఇక దసరా రోజుల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ ఓ జీవో విడుదల చేసింది. అదీ జగన్ రెడ్డి విశాఖకు మకాం మార్చే విషయంలోనే. విశాఖలో సీఎంకు వసతి చూసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లుగా జీవో జారీ అయ్యింది. వైసీపీ నేతలు, శ్రేణులూ ఇప్పటికే జగన్ వసతికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని చెప్పేశారు. మరి తాజాగా ఈ జీవో ఎందుకని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడీ జీవో జారీ చేసి.. దసరా నాటికి అంటే రోజుల వ్యవధిలోనే విశాఖలో జగన్ కోసం నివాస భవనం, క్యాంప్ కార్యాలయం ఇలా అన్నీ ఏర్పాటు చేసేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మరీ రుషి కొండపై భారీ వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆయనకు కేటాయిస్తూ సిఫారసు చేయించుకునేందుకే జీవో జారీ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే జగన్ విశాఖకు మకాం మార్చేందుకు ముహూర్తం వాయిదా పడిందంటూ పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. దసరా నాటికి జగన్ విశాఖకు మకాం మార్చే అవకాశం లేదనీ, అయితే డిసెంబర్ లో మాత్రం పక్కాగా ఆయన అక్కడి నుంచే పాలన సాగిస్తారని అంటున్నారు.
అయితే ఆయన విశాఖ నుంచి పాలన సాగించేందుకు దసరా ముహూర్తం వాయిదా పడటానికి అమరావతి కేసులే కారణమని అంటున్నారు. డిసెంబర్ లో సుప్రీం కోర్టులో ఈ కేసుల విచారణ జరుగుతుంది కనుక కోర్టు తీర్పు కోసం అప్పటి వరకూ వేచి చూడటమే మంచిదని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిజంగా కోర్టుల తీర్పులను గౌరవించి, ఆ ప్రకారం నడుచుకునే పరిస్థితే ఉంటే ఊరికి ముందే విశాఖ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాలను నిర్ణయించడమెందుకు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు విశాఖ నుంచి పాలన కోసం సీఎం నివాసం, క్యాంపు ఆఫీసు కార్యాలయాలను ఎంపిక చేయడానికి కమిటీని నియమిస్తూ జీవో జారీ చేయడం, విశాఖ పాలన ముహూర్తం మారిందంటూ ప్రకటనలు చేయడం వెనుక ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు కారణంగా ప్రజలలో వ్యక్తమౌతున్న ఆందోళన, ఆగ్రహాలను చల్లార్చి అందరి దృష్టీ జగన్ విశాఖకు మకాం మార్చే విషయంపైకి డైవర్ట్ చేయాలన్న వ్యూహం ఉందని అంటున్నారు. అసలు రాష్ట్రంలో పాలనే లేదనీ, అలాంటి లేని పాలన ఎక్కడ నుంచి సాగితే ఏముంది.. పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమిటి? అని జనం అనుకుంటున్నారు. అసలు జగన్ అమరావతి నుంచైనా, విశాఖ నుంచైనా చేసిది ఏముంది..విపక్షాలను వేధించడం, ప్రజలను పీడించడం తప్ప అని జనం భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.