వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన అంతా స్వోత్కర్ష.. పరనిందే!
posted on Jul 27, 2022 @ 11:06PM
సీఎం జగన్ రెండు రోజుల వరద బాధిత ప్రాంతాల లో రెండు రోజుల పర్యటన ముగిసింది. అయితే ఈ పర్యటనలో ఆయన బాధితులకు ఒక్కటంటే ఒక్క హామీ ఇవ్వలేదు. బాధితులకు ఊరట ఒక్కటంటే ఒక్క ప్రకటన లేదు. వరద నష్టం ఊసే లేదు. ఏదో ఒక వంతెనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు చేసిన ప్రకటన తప్ప ఎవరికీ పైసా ప్రకటించింది లేదు. అయితే తానేం చేయలేననీ, చేయగలిగింది ఏమీ లేదని చెప్పడానికి మాత్రం ఆయన ఒక్క నిముషం కూడా ఆలోచించలేదు. జగన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగమంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే మోహరించింది.
కానీ వరద బాధితుల కన్నీరు తుడిచేందుకు ఒక్క చేయి ప్రయత్నించిన దాఖలాలు లేవు. వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన అంతా తనను తాను పొగుడుకోవడానికీ విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికేనా అన్నట్లుగా సాగంది. ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల రూపాయల ఆర్థిక సాయం బాధితులందరికీ అందిందని ఘనంగా ప్రకటించేశారు. పశువుల కోసం గ్రాసం కూడా అందించామనీ, వాటికే కనుక నోరుంటే ఇంతటి విపత్తులోనూ తమను అంత శ్రద్ధగా పట్టించుకున్నందుకు అవి కూడా తనను ప్రశంసించి ఉండేవని చెప్పుకున్నారు. ఆయన పర్యటన మొత్తం స్వోత్కర్ష పర నింద లక్ష్యంగానే సాగింది. వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటిస్తే ఏదో ఒక సాయం, ఎంతో కొంత పరిహారం ఇస్తామని ప్రకటిస్తారు. జగన్ ఆ పని కూడా చేయలేదు. వరద ముంపు బాధితులను పరామర్శించలేదనీ, ఆయా ప్రాంతాలలో పర్యటించలేదనీ విపక్షాల విమర్శల కారణంగానే ఏదో పర్యటించేశానని చెప్పుకోవడానికే ఆయన పర్యటన సాగింది.
పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి తమ ప్రభుత్వం ఇచ్చిన రూ. రెండు వేలు.. ఉల్లిపాయలు, టమాటాలే చాలా ఎక్కువ అన్న చందంగా వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన సాగింది. వాస్తవానికి ఈ పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసిన వారంతా ఎంపిక చేసిన వారే. మొత్తం పర్యటన అంతా చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం సాగింది. విలేకరులను అనుమతించలేదు. ఇక పోలవరం నిర్వాసితుల విషయంలో ఈ పర్యటనలో జగన్ మరీ దారుణంగా వ్యవహరించారు. కేంద్రం నిధులిస్తే తప్ప పోలవరం నిర్వాసితులకు తాను చేయగలిగిన సాయం ఏమీ లేదని నిస్సిగ్గుగా ప్రకటించేశారు. పునరావాసం బాధ్యత రాష్ట్రానిదేనని కేంద్రం విస్పష్టంగా చెబుతున్నా జగన్ కేంద్రం నిధులిస్తేనే పునరావాసం అని చెప్పారంటే.. వారికి శూన్య హస్తం చూపించినట్లు.
మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ జరిపిన రెండు రోజుల పర్యటన బాధితుల్లో జగన్ ప్రతిష్టను మరింత దిగజార్చడానికే ఉపయోగపడింది. పరిశీలకులు కూడా జగన్ పర్యటనను చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలలో జరిపిన పర్యటనతో పోల్చి చూస్తున్నారు. వరద ముంపు సమయంలోనే విపక్ష నేత చంద్రబాబు బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబుకు వరద బాధితులు ఆయనకు తమ బాధలు చెప్పుకోవడానికి గోదావరి వరద మళ్లీ వచ్చిందా అన్నట్లుగా పోటెత్తారు. బాధితులను కలుసుకోవడానికి ఆయన బురదలో నడిచారు. ట్రాక్టర్ ఎక్కి డ్రైవర్ పక్కనే కూర్చున్నారు. స్వయంగా ట్రాక్టర్ దిగి బాధితుల వద్దకు వెళ్లారు. అదే జగన్ పర్యటనలో జనం జాడ లేదు. పార్టీ నేతలు ఎంపిక చేసిన వారు వినా ఆయనను చూడడానికి వచ్చిన వారే కనిపించలేదు. ఖాళీ వీధుల్లో ఆయన నమస్కారాలు పెట్టుకుంటూ తిరిగారు. ఇవన్నీ బయటకు పొక్కకూడదన్నట్లు మీడియాను ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలలోకి అనుమతించలేదు. విపక్ష నేతగా చంద్రబాబు వరద ప్రాంతాలలో పర్యటించి చేయగలిగింది బాధితుల్లో భరోసా నింపడమే. వరద నష్టానికి సాయంఆయన ప్రకటించలేరు. అయినా జనం ఆయన ఇచ్చే భరోసాయే చాలు అన్నట్లుగా ఆయన పర్యటన ఆసాంతం ఆయన వెంటనే ఉన్నారు. అదే ముఖ్యమంత్రి జగన్ తన పర్యటనలో బాధితులకు సాయం ప్రకటించే అవకాశం ఉంది. అధికారం ఉంది. ప్రభుత్వాధినేతగా అది చేయాలి కూడా. అయినా సరే ఆయన పర్యటన పట్ల జనం ఆసక్తి చూపలేదు.