జగన్, విజయమ్మల రాజీనామాతో కొత్తగా ఒరిగేదేమిటి
posted on Aug 10, 2013 @ 4:10PM
ఈ రోజు వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద వైఖరిని నిరసిస్తూ తమ యంపీ, శాసనసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసారు. అయితే వారు తమ రాజీనామాలకు చెపుతున్న కారణాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ పార్టీ తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన తరువాత కూడా, నేటికీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పకుండా, ఇటువంటి కుంటి సాకులు చెపుతూ రాజీనామాలు చేయడం ఆ పార్టీ రాజకీయ దౌర్భాల్యాన్ని సూచిస్తోంది.
తమ పార్టీ శాసనసభ్యుల చేత సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయించినప్పుడు కూడా ఆ పార్టీ దైర్యంగా ఆమాట చెప్పలేకపోయింది. అందువల్ల ఆ పార్టీకి చెందిన కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలను కోల్పోయింది. వైకాపా తెలంగాణాలో తన దుఖాణం బంద్ చేసుకొన్న తరువాత కూడా, ఇప్పటికీ దైర్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి తాము వ్యతిరేఖమని చెప్పకపోవడం చూస్తే, మళ్ళీ ఎప్పటికయినా ఆ ప్రాంతంలో తమ పార్టీ బ్రతికిబట్ట కట్టకపోతుందా అనే ఒక చిన్న ఆశ వారిలో ఇంకా మిగిలి ఉన్నట్లు అర్ధం అవుతోంది.
ఇక వారు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించి, తమ చేతిలోంచి జారిపోయిన ఉద్యమంపై పట్టు సాధించడానికే. తాము మొదలుపెట్టిన సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు హైజాక్ చేసుకుపోయి, తెలంగాణా నేతలతో తీవ్ర వాగ్వాదాలు చేస్తూ మంచి ఆసక్తికరమయిన డ్రామా నడిపిస్తు, సమైక్యాంధ్ర కోసం తామే చాలా కష్టపడుతున్నట్లు ప్రజలందరిని నమ్మించ గలుగుతున్నారు.ప్రజలు కూడా కాంగ్రెస్ ఆడుతున్న ఈ డ్రామా పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు.
ముఖ్యమంత్రి మొదలుకొని ఉండవల్లి, లగడపాటి, కావూరి, ఘంటా, టీజీ, శైలజానాథ్ ఇలా చెప్పుకొంటూ పోతే సీమంధ్రకోసం పోరాడుతున్న కాంగ్రెస్ నేతలలిస్టు చేంతాడంత ఉంది. కానీ వైకాపా నేతల పేర్లు ఎక్కడా వినబడవు. అందువల్ల ప్రజలందరి దృష్టి కూడా కాంగ్రెస్ మీదనే ఉంది. ఇక సీమంధ్ర ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కూడా ఎవరి దారిన వారు స్వతంత్రంగా ఉద్యమాలు చేసుకు పోతుండటంతో ఇప్పుడు వైకాపా పని పులుసులో కరివేపాకులా తయారయింది. ఒక్క కాంగ్రెస్, తెదేపా నేతలు, సాక్షి మీడియా తప్ప వైకాపా ఊసెత్తేవారే లేరిప్పుడు.
తెలంగాణాలో తమ పార్టీని బలిపెట్టుకొని మరీ మొదలుపెట్టిన సమైక్య ఉద్యమంలో తమకు ఇటువంటి పరిస్థితి రావడాన్నివారు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ప్రజల దృష్టిని తమవైపు ఆకర్షించాలంటే ఇటువంటి మంచి కార్డులు వేయవలసిందే. అందుకే జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మలు రాజీనామాలు చేసి గేమ్ లో ‘షో’ చెప్పేశారు.
అయితే నిజానికి అది షో కాదు ‘డ్రాప్’ అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ రాజకీయ చదరంగంలో వారు తెలంగాణాలో గేమ్ ఓడిపోయిన తరువాత మళ్ళీ సీమంద్రాలో కూడా మరో మారు ఓడిపోయారు.