జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తుకు రంగం సిద్దం?
posted on Oct 1, 2014 @ 1:26PM
ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తదితరులకు చెందిన రూ.1500 కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేయగా, వాటిలోరూ. 863 కోట్ల ఆస్తుల జప్తును కోర్టు ద్రువీకరించింది. ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ మళ్ళీ మరోమారు ఆస్తుల జప్తుకు రంగం సిద్దం చేసుకొంటోంది. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడయిన ఒక పారిశ్రామికవేత్తను విచారించి ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసుకొన్న తరువాత నిజాం పట్నం, వాడరేవు వద్దగల వాన్ పిక్ పారిశ్రామిక సెజ్ లలో ఆయనకు సంబంధించిన ఆస్తుల జప్తుకు సిద్దమవుతోంది.
అదేవిధంగా ఇండియా సిమెంట్స్ సంస్థ అధినేత యన్. శ్రీనివాసన్ కు సమన్లు జారీ చేసింది. ఆయన జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో రూ.140కోట్లు పెట్టుబడులు పెట్టి అందుకు ప్రతిగా తన సిమెంట్ ప్లాంటుకు అవసరమయిన నీటిని పక్కనున్న నదిలో నుండి యదేచ్చగా వాడుకొన్నందున, ఆయనకు సంబందించిన ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బీ.సి.సి.పి.యల్.సంస్థ డైరెక్టర్ జీ.బాలాజీ కడప జిల్లాలో ఎర్రగుంట్ల మరియు కమలాపురం వద్ద గనుల త్రవ్వకాలకు అక్రమంగా అనుమతులు పొంది వెనకేసుకొన్న మొత్తం రూ.142 కోట్లుగా తేల్చిన ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్, ఆ మొత్తానికి సరిపడే ఆస్తుల జప్తుకు సిద్దమవుతోంది.
అదేవిధంగా దాల్ మియా సిమెంట్స్ సంస్థకు 1000 ఎకరాలలో సున్నపురాయి గనుల తవ్వకానికి అనుమతులు మంజూరు చేసినందుకు గాను ఆ సంస్థ నుండి రఘురాం సిమెంట్స్ సంస్థ రెండు దఫాలుగా తీసుకొన్న రూ.95+55 కోట్లకు సరిపోఏ ఆస్తుల జప్తుకు ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ సిద్దం అవుతోంది. ప్రస్తుతం ఈ క్విడ్ ప్రో కేసులలో లబ్ది పొందినవారిని విచారించి, వారికి ఎక్కడెక్కడ ఆస్తులున్నవీ గుర్తించే పనిలో పడింది ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్. బహుశః త్వరలోనే ఆస్తుల జప్తు కార్యక్రమం మొదలవవచ్చును.