సకల శాఖల మంత్రే సీఐడీ సూపర్ బాస్!
posted on Sep 9, 2023 @ 10:45AM
సీఐడీకి సూపర్ బాస్ గా ప్రభుత్వ ముఖ్య సలహాదారు మారిపోయారా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుని ఈ ఉదయం సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా ఏ కేసులో ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పడానికి వెనుకాడారు. అన్ని అరెస్టు చేసిన తరువాత రిమాండ్ రిపోర్టులో చూపిస్తామంటూ దాటవేశారు. ఈ విషయంపై గట్టిగా అడిగిన చంద్రబాబు తరఫు న్యాయవాదులకు స్టఫ్ లేదంటూ పోలీసు అధికారి అనుచిత వ్యాఖ్యలు సైతం చేశారు. ఆ తరువాత ఉపసంహరించుకున్నారు అది వేరే సంగతి.
అరెస్టు చేస్తున్నామని చెబుతూ పోలీసులు చూపిన ఎఫ్ఐఆర్ లో అసలు చంద్రబాబు పేరే లేదు. దీంతో ఈ విషయంపై గట్టిగా నిలదీసిన న్యాయవాదులకు సమాధానం చెప్పలేక పోలీసులు అన్నీ రిమాండ్ రిపోర్టులు ఉంటాయష అంటే దాటేశారు. అసలింతకీ ఈ చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు రెండేళ్ల కిందటిది. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఈ విషయాన్ని సీఐడీ పోలీసులు నేరుగా చెప్పడానికి జంకారు. అయితే సకల శాఖల మంత్రిగానే ఇప్పటి వరకూ పాపులర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సీఐడీ బాస్ అవతారమెత్తి మరీ వక్కాణిస్తున్నారు. ఇలా చంద్రబాబు అరెస్టయ్యారో లేదో అలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలందరినీ అరెస్టులు, గృహ నిర్బంధాలూ చేస్తూ సీఐడీ మొత్తం రాష్ట్రాన్నే ఒక పెద్ద జైలుగా మార్చేస్తుంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి సీఐడి పలు కడిగిన ముత్యమనీ, ఇప్పటి వరకూ సీఐడీ చేసిన అరెస్టులు, నమోదు చేసిన కేసులూ అన్నిటికీ పూర్తి సాక్ష్యాధారాలున్నాయని చెప్పుకొచ్చారు.
అయితే అసలు వాస్తవమేమింటే.. ఏపీ సీఐడీ ఇప్పటి వరకూ పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసింది. వారిలో అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఉన్నారు. అయితే ఒక్క కేసులోనూ ఆధారాలు చూపించి చార్జిషీటు దాఖలు చేసిన దాఖలాలు కనిపించవు. పోలీసులు ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ వస్తున్న సజ్జల .. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ తరఫున వకాల్తా పుచ్చుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు రాత్రికి రాత్రి జరిగిందని కాదని నమ్మబలికే ప్రయత్నం చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి అవసరమైన అన్ని సాక్ష్యలూ, ఆధారాలు ఉన్నాయన్నారే కానీ అవేమిటో మాత్రం సజ్జల వెల్లడించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడం, ప్రశ్నించడం సాధారణమేనన్న సజ్జల తన అరెస్టు గురించి చంద్రబాబుకు కూడా తెలుసుననీ, అందుకే మూడు రోజుల ముందట నుంచీ తాను అరెస్టయ్యే అవకాశాలున్నాయంటూ సెంటిమెంటును, సానుభూతిని పొందేందుకు ప్రయత్నాలు మొదలెట్టారని సజ్జల చెప్పుకొచ్చారు. అయినా చంద్రబాబును అరెస్టు చేసిన నిముషాల వ్యవధిలోనే.. సజ్జల మీడియా ముందుకు వచ్చి సీఐడీ వద్ద అన్ని సాక్ష్యాధారాలూ ఉన్నందునే అరెస్టయ్యారని చెప్పడానికి ఎందుకు అంత ఉత్సాహపడ్డారన్న సందేహం వైసీపీ శ్రేణుల్లోనే కాదు, పోలీసు వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. అసలు చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సీఐడీ మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ వారికా అవకాశం ఇవ్వకుండా సజ్జల వచ్చి తాను చెప్పాల్సింది చెప్పేశారు. కాదు కాదు.. సీఐడీ అధికారులు ఏం చెప్పాలో సజ్జల తన ప్రెస్ మీట్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .
నిజంగా స్కల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబుపై పక్కా ఆధారాలు ఉంటే.. ఇలా అర్థరాత్రి హడావుడి అరెస్టు చేయకుండా.. ఆయన ప్రమేయంపై ఉన్న ఆధారాలను సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం చేసి మరీ అరెస్టు చేసేవారు. నాలిక గీసుకోవడానికి కూడా పనికి రాని ఐటీ షోకాజ్ నోటీసుకే విస్తృత ప్రచారం కల్పించిన వైసీపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబుపై నిజంగా ఆధారాలు ఉంటే.. మరింత ప్రచారం చేసేవారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో సీఐడీ పెట్టిన కేసులు, చేసిన అరెస్టులు ఏవీ కోర్టులో నిలవలేదనీ.. ఇప్పుడు ఇది కూడా అంతేననీ అంటున్నారు.