ప్రవీణ్ కుమార్ పయనం ఎవరి కోసం? ఎంపీ సంతోష్ తో ఎందుకు మంత్రాంగం?
posted on Jul 31, 2021 @ 4:03PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ చుట్టే రాజకీయాలన్ని సాగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉపఎన్నికే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంతలోనే ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి మరో సంచలనానికి తెర తీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంతేకాదు రాజకీయపరమైన అడుగులు వేస్తూ ఆయన కాక రేపుతున్నారు. బహుజునుల రాజ్యం స్థాపనే లక్ష్యమంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..జిల్లాల వారీగా స్వేరోస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు8న ఆయన రాజకీయ నిర్ణయం ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత ఏడేండ్లుగా తెలంగాణ గురుకులాల కార్యదర్శగా ఉన్నారు. ఏడేండ్లుగా ఆయన ఒకే పోస్టులో కొనసాగారు. దీనిపై చాలా విమర్శలు వచ్చినా కేసీఆర్ సర్కార్ ఆయన్ను బదిలీ చేయలేదు. అంతేకాదు గురుకులాల్లో ఆయన ఏర్పాటు చేసిన స్వేరోస్ పై కొన్ని సంస్థలు బహిరంగంగానే ఆరోపణలు చేశాయి. ప్రవీణ్ కుమార్ కార్యక్రమాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయినా సీఎం కేసీఆర్ మాత్రం ఆయన జోలికి వెళ్లలేదు. అయితే ప్రవీణ్ కుమార్ పై కేంద్రానికి కూడా పిర్యాదులు వెళ్లాయి. అటు నుంచి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. కేంద్రం సీరియస్ గా ఉండటంతో.. ముందే స్వచ్ఛంధ విరమణ చేశారని తెలుస్తోంది. అయితే ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించగానే... ఆయన కేసీఆర్ కనుసన్నల్లోనే ముందుకు వెళ్లనున్నారనే ప్రచారం జరిగింది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే చర్చ కూడా వచ్చింది. అయితే తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు ప్రవీణ్ కుమార్. తాను ఎవరి ప్రయోజనాల కోసమే బయటికి రాలేదని స్పష్టం చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ప్రవీణ్ కుమార్ వేస్తున్న అడుగులపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోలేదు.. ఫాంహౌజులు కట్టుకోలేదని కామెంట్ చేశారు. దీంతో కేసీఆర్ టార్గెట్ గానే ప్రవీణ్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కాని ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే సాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ డైరెక్షన్ లోనే ప్రవీణ్ కుమార్ నడుస్తున్నారని, ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకే కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లుగా ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ప్రవీణ్ కుమార్ తో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం టచ్ లో ఉన్నారని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో దళితులను ఏకం చేసి.. వాళ్లందరిని బీజేపీకి వ్యతిరేకంగా ఉండేలా స్కెచ్ వేశారని అంటున్నారు.
హుజురాబాద్ తో పాటు రాష్ట్రమంతా దళితులను ఏకం చేసి... అంతిమంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు లాభించేలా ప్రవీణ్ కుమార్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీఎస్పీలోకి చేరవచ్చని చెబుతున్నారు. బీఎస్పీ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ తో కూడా ప్రస్తుతం అంటిముట్టనట్లుగానే ఉంటోంది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి వస్తే అందులో బీఎస్పీ భాగమయ్యే అవకాశం ఉంటుంది. ఆ కూటమిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కీ రోల్ పోషించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరినా.. చివరకు కేసీఆర్ కు అనుకూలంగానే వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. దళితులు ఇప్పటివరకు ఎక్కువగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఆ ఓట్లను కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ వాడుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ అండదండలు ఉన్నాయని చెప్పటానికి మరికొన్ని కారణాలు కూడా కొందరు చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కు అప్లయ్ చేసిన 24 గంట్లోనే కేసీఆర్ సర్కార్ ఆయనను రిలీవ్ చేసింది. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. తెలంగాణ సర్కార్ తో విభేదించి స్వచ్ఛంద పదవి విరణమకు సిద్ధమైన సీనియర్ ఐపీఎస్ వీకే సింగ్ ధరఖాస్తును ఏడాదికి పైగా పెండింగులో పెట్టింది ప్రభుత్వం. అంతేకాదు ఐఏఎస్ ఆకునూరి మురళీ అప్లికేషన్ ను రెండున్నర నెలల తర్వాత క్లియర్ చేసింది. కాని ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం కొన్ని గంటల్లోనే రిలీవ్ ఆర్డర్లు ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా వెళ్తారని భావిస్తే.. ప్రవీణ్ కుమార్ విషయంలో కేసీఆర్ సర్కార్ అంత వేగంగా స్పందించదని అంటున్నారు. టీఆర్ఎస్ కు లబ్ది కలిగే అవకాశం ఉంది కాబట్టే.. వెంటనే రిలీవ్ చేశారని చెబుతున్నారు.
మొత్తంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ఎంత గట్టిగా మాట్లాడినా.. ఆయన అంతిమంగా పని చేసేది టీఆర్ఎస్ ప్రయోజనం కోసమేనని కొన్ని వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. అందుకే ఇతర పార్టీల కార్యక్రమాలకు కొవిడ్ మార్గదర్శకాల పేరుతో అడ్డంకులు స్పష్టిస్తున్న ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ సమావేశాలను మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. నల్గొండలో లక్షన్నర మందితో ప్రవీణ్ కుమార్ సభ నిర్వహించినా అన్ని అనుమతులు వచ్చేస్తాయని చెబుతున్నారు.