ఆక్.. పాక్.. ఐప్యాక్.. కరేపాక్!
posted on May 21, 2024 @ 10:59AM
మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్‌కి వెళ్ళే ముందురోజు తాను 2019లో అధికారంలోకి రావడానికి సహకరించి, ఈ ఐదేళ్ళు జగన్ కోసం భారీ స్థాయిలో జనానికి అబద్ధాలు చెప్పి తరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఆ ఎన్నికలలో, ఈ ఎన్నికలలో తనకు సహకరించిన ఐప్యాక్ ఉద్యోగులకు థాంక్స్ చెప్పడానికి జగన్ అక్కడకి వెళ్ళారు. తమ కార్యాలయానికి వచ్చిన జగన్ని చూసి ఐపాక్ ఉద్యోగులు మందుకొట్టిన మంకీల్లా అరిచారు. కాలుగాలిన పిల్లుల్లా గంతులు వేశారు. తోక తెగిన బల్లుల్లా హడావిడి చేశారు. ‘సీఎం... సీఎం’ అని పూనకం వచ్చినట్టు కేకలు వేశారు. ఆడలేదు, మగలేదు.. అందరూ జగన్‌తో రాసుకుని పూసుకోవడానికి ఉత్సాహపడిపోయారు. లండన్‌కి వెళ్ళిన జగన్ తిరిగి వస్తాడో రాడో అనుకున్నారోగానీ, ఆయనని చివరిసారి చూస్తున్నట్టుగా తెగ ఆత్రపడిపోయారు. ఈ సందర్భంగా జగన్ ‘ఈసారి మనం 156 ఎమ్మెల్యే సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం’ అనగానే అందరూ అమ్మవారు పూనినట్టు ఆనందంతో ఊగిపోయారు. చివరాకరికి జగన్ ఈ ఐపాక్ గుంపుతో జగన్ సెల్ఫీలు దిగడం, కొన్ని సెల్ఫీలు అయితే జగనే స్వయంగా తీయడం చూసి ఐప్యాక్ ఉద్యోగులు నక్కతోక తొక్కినంతగాఆనందపడిపోయారు. మొత్తమ్మీద ఆ సీన్ ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.
పైన చెప్పుకున్న కామెడీ సీన్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ట్రాజెడీ సీన్ మొదలైంది. ఐప్యాక్ సంస్థ తమ ఉద్యోగులు 150 మందిని తీసి అవతల పారేసింది. జగన్ వచ్చినప్పుడు చెప్పిన గెలిచే సీట్ల సంఖ్యలు విని ఇంకో ఐదేళ్ళు ఐప్యాక్ నీడలో అబద్ధాలు ప్రచారం చేస్తూ బతకొచ్చు అని కలలు కన్న ఆ 150 మందికి పెద్ద షాక్ తగిలింది. జగన్ పైకి అయితే అంకెలు చెప్పారుగానీ, లోపల గెలుస్తాననే నమ్మకం ఎంతమాత్రం లేదు. అందుకే ఐప్యాక్ సేవలు ఇక చాలు అని చెప్పేసినట్టున్నారు. అందుకే జగన్ వచ్చి వెళ్ళిన రెండ్రోజులకే ఐప్యాక్ బాస్‌లు 150 మంది ఉద్యోగుల బొచ్చెలో రాళ్ళు వేశారు. పాపం ఈ 150 మంది ఇంతకాలం అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టపోసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో కదా! జగన్, ఐప్యాక్ ఇద్దరూ కలసి ఉద్యోగులను కరేపాకులా వాడుకుని విసిరేశారు.
జగన్ భజన చేయడం కోసం ఐప్యాక్ ఉద్యోగులు జూనియర్ ఆర్టిస్టుల రేంజ్‌లో యాక్టింగ్ ఇరగదీసేశారు. పథకాలు అందుకుంటూ పులకరిచి పోతున్న పాపగా, జగనన్న నుంచి ఇల్లు అందుకుని, ఆనందబాష్పాలు వర్షిస్తున్న ఆడపడుచుగా, జగన్ పాలన అదిరిపోతోందని చెబుతున్న పొరుగురాష్ట్రం కుర్రాడిగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలుగా... ఇలా రకరకాల సందర్భాల్లో తగిన పాత్రలను అద్భుతంగా పోషించిన ఐప్యాక్ ఉద్యోగుల చేతుల్లో ఇప్పుడు ముష్టిపాత్ర వచ్చిపడింది. వీళ్ళకి ఇలాగే జరగాలి... ఇన్నాళ్ళూ అబద్ధాలు ప్రచారం చేసి జనం బుర్రలు పాడుచేశారు!