భారత్ గెలవాలని పూజలు, ర్యాలీలు
posted on Apr 2, 2011 @ 2:53PM
హైదరాబాద్: భారత్ ప్రపంచకప్ గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కోసం వరల్డ్ టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా కప్ కొట్టాలని రాష్టవ్య్రాప్తంగా అభిమానులు పూజలు, హోమాలు, ర్యాలీలు నిర్వహించారు. భారత విజయాన్ని కాంక్షిస్తూ విజయవాడ దుర్గగుడిలో మాజీ మేయర్ బిందు మాధవి పూజలు చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో 250 అడుగుల జెండాతో ర్యాలీ తీశారు. గట్టాయలో 72 అడుగుల జెండాతో విద్యార్థుల ర్యాలీ చేపట్టారు. కరీంనగర్‌లోని రాజరాజేశ్వరి ఆలయంలో ఆటో యూనియన్ సభ్యులు పూజలు చేశారు.
టీమిండియా కప్ గెలవాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గ ఆలయంలో అభిమానులు పూజలు చేశారు. విశాఖపట్టణంలోని సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.చీరాల విజ్జేశ్వరస్వామి ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదారిమాతకు మహిళలు కలశపూజ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్‌లో పూలతో తయారు చేసిన 5 అడుగుల ప్రపంచకప్ నమూనాను ప్రదర్శించారు. అభిమానులు మ్యాచ్ చూసేందుకు వీలుగా జంగారెడ్డిగూడెంలో రెండు టీవీ తెరలను ఏర్పాటు చేశారు.