అరెస్టు చేసుకుంటారా చేసుకోండి.. భయపడేదే లే.. కవిత
posted on Dec 1, 2022 @ 12:00PM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. తొలి నుంచీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ సీబీఐ, ఈడీ విచారణ్లలోనూ ఇప్పటి వరకూ కవిత పేరు బయటకు రాలేదు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయంగా కేసీఆర్ కుటుంబాన్ని అప్పతిష్టపాలు చేయడానికే నంటూ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు వాస్తవమేనా అని అనుమానాలు సైతం రాజకీయ వర్గాలలో వ్యక్తం అయ్యాయి.
అయితే ఈడీ దర్యాప్తులో భాగంగా కవితకు సన్నిహితులుగా పేరొందిన అభిషేక్ రావు అరెస్టుతో మళ్లీ కవిత లక్ష్యంగా విమర్శలు గుప్పుమన్నాయి. ఆ తరువాత మళ్లీ చల్లబడ్డాయి. తొలుత ఈ స్కాంలో తనపై ఆరోపణలు చేయకుండా కవిత కోర్టుకు వెళ్లారు కూడా. అయితే ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి అందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ప్రస్తావించింది. . సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని, ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది..
ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవితలు ప్రధానంగా సూత్రధారులు కాగా.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కో ఆర్డినేట్ చేశారనీ ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు మార్చేశారనీ ఈడీ ఆరోపించింది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. అనంతరం వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఓ చార్జిషీటు.., ఈడీ ఓ చార్జిషీటు దాఖలు చేసింది. ఆ రెండు చార్జిషీట్లలోనూ కూడా కవిత పేరు లేదు. ఇప్పుడు.. దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇహనో ఇప్పుడో కవితకు నోటీసులు వస్తాయని పరిశీలకులు అంటున్నారు.
కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానిగా మోదీ అధికారంలో వచ్చాకా ఇప్పటి వరకూ తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి, అడ్డదారిలో ఆయా రాష్ట్రాలలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని కవిత అన్నారు.
దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు ఎన్నికల సంవత్సరంలో ఈడీ వెళుతుండటం ఈ ఎనిమిదేళ్ల కాలంలో మామూలైపోయిందన్నారు. మోడీ దేశంలోని బీజేపీ యేతర ప్రభుత్వాల కూల్చివేతలకు కుట్రలు పన్నడమే పాలన అనుకుంటున్నారని కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రానికి ఈడీ వచ్చిందని కవిత అన్నారు.
తన మీద కానీ, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కానీ ఈడీ దాడులు జరగడం సహజమేనని... వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని అన్నారు. జైల్లో పెడతామంటే ఇక చేసేదేముందని... పెట్టుకో అని కవిత అన్నారు. ఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు.