సర్కారీ బడుల్లో మౌళికవసతుల లోపం వెనుక పాపం ఎవరిదీ?
posted on Oct 5, 2012 8:43AM
నిన్న కాక మొన్న కట్టిన ప్రైవేటు స్కూలు మౌళికవసతుల్లో ముందుంటోంది. మరి అరవైఏళ్ల క్రితం ప్రారంభమైన సర్కారీ బళ్లలో మాత్రం మౌళికవసతుల లేమి కొట్టచ్చినట్లు కనబడుతోంది. ఈ లోపం వెనుక పాపం ఎవరిదీ? అని ఒక్కసారి పరిశీలిస్తే నిజాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఈ బళ్లలో చదువుకునే నేతలుగా ఎదిగిన వారు సైతం గతాన్ని మరిచిపోతున్నారన్నది వాస్తవం. భారతరాష్ట్రపతులు కూడా సర్కారీబళ్లలో చదువుకున్న వారే. గతంలో సర్కారీబళ్లే తప్ప ప్రైవేటు విద్యాలయాలు ఉండేవి కావు. అటువంటి కీలకమైన ఈ బళ్లలో మౌళిక వసతులు కల్పించాలని సీరియస్‌గా అరవైఏళ్ల క్రితం నిర్ణయం తీసుకున్న వారే లేరు. అలాగని అప్పట్లో అవకాశాలు లేవా? అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నిధుల నుంచి స్కూలుభవనాలకు కేటాయింపులు జరిగేవి. కానీ, నిర్మాణంలో నాణ్యతాలోపాలు ఎక్కువ. అయితే మరుగుదొడ్లు, మంచినీరు వంటి వసతుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవానికి విద్యార్థినులు, స్కూలు టీచర్లు(మహిళలు) బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం గమనించినా ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. కానీ, ఒక్కసారి తలుచుకుంటే ఈ సమస్యలు పరిష్కరించటం ఏమంత కష్టం కాదు. తాజాగా సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బళ్లలో మౌళికవసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించింది. దీని కోసం తాము ఇచ్చిన మార్గదర్శకాలను కూడా అనుసరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్21`ఏ ప్రకారం బాలికల మరుగుదొడ్ల వంటి మౌళికవసతుల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు ప్రభుత్వ పనితీరును పరిగణించాల్సి వస్తుందని సుప్రీం హెచ్చరించింది. ప్రస్తుతం రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఎంత వరకూ అమలు చేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ తీర్పు అమలు కోసం మరోసారి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు కావాల్సి ఉంటుందేమో కూడా.