జగన్ మాటే జీఎన్‌రావు కమిటీ మాట!!
posted on Dec 20, 2019 @ 5:42PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జీఎన్‌రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ తన తుది నివేదికను ఈరోజు సీఎం వైఎస్ జగన్ కు అందజేసింది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై కమిటీ అధ్యయనం చేసి తుది నివేదిక సమర్పించింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేశామని కమిటీ పేర్కొంది. జీఎన్‌రావు మాట్లాడుతూ.. గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని చెప్పారు. ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వెల్లడించారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి అని సూచించామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్లుగా విభజించాలని సూచించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్త, రాయలసీమ రీజియన్లుగా విభజించాలని తెలిపారు. వరదముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించారు. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సెక్రటేరియట్, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉండాలని పేర్కొన్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలని.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు బెంచ్ ఉండాలని కమిటీ సూచించింది.