కొవిడ్ కొత్త వేరియంట్ 'ఈటా' .. ఇండియాలో తొలికేసుతో అలర్ట్..
posted on Aug 6, 2021 @ 6:32PM
కప్పా.. ఆల్ఫా.. బీటా.. డెల్టా.. గామా. రకరకాల వేరియంట్స్‌తో కొవిడ్-19 ఓ రేంజ్‌లో కుమ్మేస్తోంది. ప్రపంచంతో ఆటాడుకుంటోంది. ఆ దేశం ఈ దేశమనే తేడా లేకుండా.. కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మందులేవీ పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. వ్యాక్సిన్ ఒక్కటే కాస్త సురక్షితం. కరోనా కట్టడికి మానవ ప్రయత్నాలు ఎంత ముమ్మరంగా సాగుతుంటే.. వైరస్ సైతం మనుషులతో పోటీనా అన్నట్టు అంతగా రూపాంతరం చెందుతోంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ.. కొత్త వేరియంట్లతో మరింత వ్యాపిస్తోంది. ఆ వేరియంట్లనే శాస్త్రజ్ఞులు ఆల్ఫా, బీటా, గామా, డెల్టాగా పిలుస్తున్నారు. డెల్టా ప్లస్ అనేది లేటెస్ట్ వేరియంట్. డెల్టా వేరియంట్ పుట్టుక భారత్‌లోనే జరిగింది.
ఇన్ని వేరియంట్లు ఉన్నవి చాలవన్నట్టు.. తాజాగా వైరస్ మరోసారి రూపాంతరం చెంది మరింత బలపడిందని గుర్తించారు. ఆ కొత్త వేరియంట్‌ను 'ఈటా' అని పిలుస్తున్నారు. 'ఈటా' ఉనికి ఇలా బయటపడింతో లేదో అలా ఇండియాకు వచ్చేసింది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన 'ఈటా' వేరియంట్ భారత్‌లో ప్రవేశించడం ఆందోళన రేపుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
కర్ణాటకలోని మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకం వేరియంట్ కనిపించింది. జన్యు పరీక్షల్లో ఆ మేరకు నిర్ధారణ జరిగింది. 4 నెలల కిందట బాధితుడు దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించగా.. కొవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. చికిత్స అనంతరం అతడు కరోనా నుంచి కొద్ది రోజుల తర్వాత కోలుకున్నాడు. అతడితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు. జన్యు విశ్లేషణ పరిశోధనలో భాగంగా అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపగా.. ఆ వ్యక్తిలో కొత్త రకం 'ఈటా' వేరియంట్ బయటపడినట్టు వైద్యులు తెలిపారు.
కర్ణాటకలో 77 శాతం కొవిడ్ కేసులకు డెల్టా వేరియంటే కారణమంటున్నారు. 1,413 కేసులకు గానూ 1,089 కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. 159 కప్పా, 155 ఆల్ఫా, 7 బీటా, 3 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. తాజాగా, ఈటా వేరియంట్ కర్ణాటకలో వెలుగుచూసింది. ఈటా లక్షణాలు, వ్యాప్తి వేగంపై పరిశోధనలు జరగాల్సి ఉంది.