ముందుగా ఆరోపణలు.. ఆపై సమాచార హక్కు చట్టం కింద సమాచారానికి దరఖాస్తులు!
posted on Jul 8, 2022 7:00AM
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు చిత్ర విచిత్రమైన రాజకీయ క్రీడకు తెరలేపాయి. ఇందుకు అవినీతి ఆరోపణలనే ఆస్త్రాలుగా వాడుకుంటున్నాయి. ముందుగా ఆరోపణలు గుప్పించేయడం, ఆధారాలున్నాయి, త్వరలో బయటపెడతామంటూ హడావుడి చేయడం.. ఆ తరువాత తీరిగ్గా సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తులు చేయడం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇరువురూ కూడా ఈ క్రీడలో ఒకరికి మించి మరొకరు అన్న రీతిలో పోటీ పడుతున్నారు.
ముందు ఈ క్రీడను ఎవరు మొదలు పెట్టారన్నది పక్కన పెడితే.. కేసీఆర్, బండిలు మాత్రం ఆరోపణలు, ప్రత్యారోపణలతో దీనిని రక్తి కట్టించారు. టీఆర్ఎస్, కేసీఆర్ అవినీతి చిట్టా జేబులో పెట్టుకు తిరుగుతున్నానని బండి చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. ఆ చిట్టా బయట పెడతామనీ, కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని దాదాపు ప్రతి సందర్భంలోనూ బండి చెబుతూనే వచ్చారు. ప్రతి సభలో ఆయన తొలుత చెప్పే విషయం సీఎం కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమనే. అయితే ఇంత వరకూ ఆయన చిట్టా బయటపెట్టినదీ లేదు.
కేసీఆర్ అవినీతిపై చిన్నపాటి విచారణా జరిగింది లేదు. మరో వైపు కేసీఆర్ కేంద్రం అవినీతి బాగోతం అంతా సక్ష్యాధారాలతో తన వద్ద ఉందని.. ఆ లెక్కలన్నీ బయటపెడతాననీ చెబుతూ వస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులన్నీ మోడీ అవినీతి లెక్కల పద్దులన్నీ ప్రగతి భవన్ లో ఉన్నాయని కేసీఆర్ స్వయంగా ఇటీవల ప్రకటించారు. ఈ ఆరోపణలన్నీ సరే..వాటి ఆధారాలు బయటపెడతామన్న హెచ్చరికలే తప్ప అటు బీజేపీ టీఆర్ఎస్, కేసీఆర్ అవినీతిని బయట పెట్టడం లేదు.. ఇటు కేసీఆర్ కూడా ఆరోపణలకే పరిమితమై విమర్శలతో సరిపెట్టేస్తున్నారు.
కేసీఆర్, బండి ఇరువురూ కూడా తమ ఆరోపణలకు సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే సమాచారంపైనే ఆధారపడుతున్నారు. బండి అయితే సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ శాఖల నుంచి ఇన్ఫర్మేషన్ కోసం ఏకంగా 80కి పైగా దరఖాస్తులు చేశారు. ఇక టీఆర్ఎస్ బండారం బయటపడిపోయిందని హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడి రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేందుకు ఉపయోగిస్తుందే తప్ప.. సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి కొండలను బద్దలు కొట్టేస్తున్నామంటూ చేసుకుంటున్న ప్రచారం వల్ల అంతకు మించి ప్రయోజనం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు.
ఆ విషయం ఇటు టీఆర్ఎస్ కూ, అటు బీజేపీకి కూడా తెలుసు. తెలియదనుకోలేం. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే.. రాష్ట్రంలో మూడో పార్టీ పోటీలో లేదని చాటడానికి. కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్న అంశం నుంచి జనం దృష్టి మరల్చడానికి. టీఆర్ఎస్, బీజేపీలు ఎంతగా ప్రచారాలు చేసుకుంటున్నా... పోటీ మా మధ్యే అని చెప్పుకోవడానికి ఎంతగా తాపత్రేయ పడుతున్నా.. ఇటీవలి కాలంలో వలసలు కాంగ్రెస్ లోకి పెరుగుతున్నాయే తప్ప.. బీజేపీ, టీఆర్ఎస్ ల వైపు కాదు. జారిపోతున్న వారిని ఆపడం కోసం టీఆర్ఎస్, పార్టీలలోకి వలసలను ప్రోత్సహించడానికి బీజేపీలు పడుతున్న ఆత్రమే ఈ ఆరోపణల పర్వం వెనుక కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.
బీజేపీ అయితే ఏకంగా చేరికల సమన్వయ కమిటీ అంటే ఓ కమిటీని వేసి ఆ బాధ్యతలను మాజీ మంత్రి ఈటలకు అప్పగించింది. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఒకరిపై ఒకరు పోరాడుతూ ఈ అవినీతి ఆరోపణలు చేసుకుంటూ చేస్తున్న హడావుడిని జనం వింతగా చూస్తున్నారే తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదనడానికి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ను ఫేడౌట్ చేయడమే లక్ష్యంగా బీజేపీ, కేసీఆర్ లు ఒక రహస్య అవగాహనతో ముందుకు వెళుతున్నాయనడానికి ఈ ప్రచారార్భాటమే నిదర్శనమని కాంగ్రెస్ విమర్శిస్తోంది.