ఆదాయం కావాలి కాని....
posted on Oct 5, 2012 8:57AM
మంత్రిగారింట్లో పెరటిగోడ గేటు పిల్లల ఆటల్లో ఊడిపోయిందంటే ఆ వార్త ముద్రణ అయ్యేలోపే ఆ గేటు, ఆ గోటున్న గోడను కూడా వెంటనే బాగుచేసేస్తారు. కాని... కోట్లల్లో... లక్షల్లో... ఆదాయాలను దండుకుంటూ... ఎక్కువ ఆదాయం వస్తూ దేవాదాయశాఖలో కలవని దేవాలయాలను కలుపుకుంటూ.. కనీసం రక్షణచర్యలు కూడా తీసుకోకుండా ఆర్జనపైనే అంతా దృష్టిపెట్టే దేవాదాయశాఖకు నిర్లక్ష్యానికి భక్తుల నమ్మికకు విఘాతం కలిగించేలా శ్రీశైల మహాక్షేత్రం మహా ప్రాకార కుడ్యం ఉత్తరం వైపు వున్న శివాజీ గోపురం కుప్పకూలి కలశాలు సైతం మట్టిలో కూరుకుపోయాయి. రెండు సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తిలోని ఆలయ రాజగోపురం కుప్పకూలిపోయింది. దాని నిర్మాణానికి ఎంతోమంది దాతలు ముందుకువచ్చినా... దేవాదాయశాఖ, పురావస్తుశాఖల వ్యవహరశైలి వల్ల ఇంకా నిర్మాణానికి నోచుకోనేలేదు. ఇప్పుడు ఈ శ్రీశైలం ఆలయం శివాజీ గోపురం. రాష్ట్రంలోని పలు దేవాలయాల నుండి ప్రతి ఏడాది వచ్చే సొమ్మును దేవాదాయశాఖకు తరలించుకుని దాన్ని వివిధ రకాలుగా ఖర్చుచేసే ప్రభుత్వ అధికారులు ఆలయాలను, అందలి ఉద్యోగులను, అర్చకులను మాత్రం పట్టించుకోరు. చివరకు తమ రాజకీయాలను సైతం దేవాలయాలకు సైతం విస్తరించారు. మిగిలిన మతాలకు వాటికి సంబంధించి ప్రత్యేక శాఖ ప్రభుత్వ ఆధీనంలో లేనప్పుడు.. మరి హిందు దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శాఖ ఎందుకు? దాని వల్ల దేవాలయాలకు ఫలితం ఏముంది? రాజకీయ నాయకుల పునరావాస పదవులకు, ప్రభుత్వానికి ఆదాయం కోసం తప్ప. ప్రభుత్వం నుండి దేవాదాయశాఖను విడదీసి.. దాన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పాటుచేసి ఆయా ఆలయాలకు చెందిన పూర్వీకులను (ఉన్నవారిలో) కొందరిని ఆయా ప్రాంతాలకు ఎన్నుకుంటే ...అది స్వతంత్రంగా... ఆయా ఆలయాల పర్యవేక్షణ, భద్రత, భక్తుల సేవలు తదితరాలు వారే చూసుకుంటారు. .. ఇందులో మాత్రం రాజకీయ నాయకులకు చోటు వుండకూడదు! ఆదాయానికి తీసుకనేందుకు ముందుంటారు కాని....మరమ్మతులకు వస్తే మాత్రం వారికి వినపడదు, కనపడదు. నే ఎక్కేబండి జీవితకాలం లేటు అన్నట్లుగా కాకుండా ఇప్పటికైనా నేతలు, అధికారులు మేల్కొని.. రాష్ట్రంలో శిథిలావస్థలో వున్న ఆదాయంతో పనిలేకుండా అన్నిటికి మరమ్మతులు చేయించాలని.. లేదంటే.. ఇది కోట్లాదిమంది భక్తుల నమ్మికను మోసంచేసినట్లవుతుందని... భక్తులు అభిప్రాయపడుతున్నారు.