ముందస్తే.. మరో మాటే లేదు.. సంకేతాలిచ్చిన మంత్రి
posted on Dec 1, 2022 @ 10:52AM
ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలు తధ్యమన్న మాట గట్టిగా వినిపిస్తోంది.. తెలంగాణలో కేసీఆర్ గతంలో మాదిరి ఈసారి కూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు జై కొడతారంటున్నారు? . తెలంగాణలో ముందస్తుకు ఛాన్స్ లేదంటూనే.. కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయికి వెళ్ళబోతున్నాం కనుక ముందుగా ప్రచారం తెలంగాణ నుండే మొదలు పెట్టనున్నామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు.
మరోవైపు డిసెంబర్ లో ప్రణాళికలు మొదలు పెట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు వెళ్లనున్నారని ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక, ఏపీ విషయానికి వస్తే సీఎం జగన్ ముందస్తుకు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి స్పష్టతా లేకున్నా.. జగన్ సర్కార్ పై వ్యతిరేకత భావన మొదలైందన్న సర్వేల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనిపార్టీ శ్రేణుల్లోనే గట్టిగా వినిపిస్తోంది. గడప గడపకు కార్యక్రమంలో వ్యతిరేకత చూసిన నేతలు కూడా అధిష్టానానికి ముందస్తే బెటరని చెప్పారని అంటున్నారు. వ్యతిరేకత మరింత ముదరక ముందే ముందస్తుకు వెళ్లాలని అధిష్టానం సిద్దమైపోయిందని అంటున్నారు.
ఇప్పటికే ఒకరిద్దరు కీలక నేతలు ఇదే విషయంపై మాట్లాడినా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు మాట్లాడారు.. తప్ప ముందస్తు కు వెళతామని కానీ, వెళ్లేది లేదని కానీ చెప్పలేదు. కానీ మంత్రి అప్పలరాజు మాత్రం ముందస్తు తథ్యం అనే స్థాయిలో మాట్లాడారు. పలాసలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని చెప్పారు. అంటే గడప గడపకూ మన ప్రభుత్వం ఎన్నికల ప్రచారమేనని ఆయన కుండ బద్దలు కొట్టేశారు.
ఆయన మాటలను బట్టి ఏపీలో ముందస్తు తధ్యమనే పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. నిజానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. పెరిగిన అప్పులకు తోడు వడ్డీలు భారమైపోతున్నాయి. పోనీ.. పరిశ్రమలు, ఇండస్ట్రీలు, కార్పొరేట్ ఆఫీసులు వస్తే ఆదాయం పెరుగుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. ఏ నెలకు ఆ నెల బొటాబొటీ ఆదాయం.. అప్పులతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని ఆర్ధిక విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మరో ఏడాది పాటు ఇలాగే ప్రభుత్వాన్ని నడపడం అంటే అప్పటి పరిస్థితులలో ఏదైనా జరగొచ్చు. అందుకే ముందొస్తే ముద్దని వైసీపీ ఫిక్స్ అయిపోయిందని బలంగా వినిపిస్తుంది.