జగన్ అంటే దుల్కర్ సల్మాన్ కీ దడే!
posted on Sep 8, 2023 @ 6:05PM
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన కెరీర్‌లో చేయని పాత్ర లేదు. మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఆయనకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా విభిన్నమైన క్యారెక్టర్లు, విభిన్నమైన సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. మలయాళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దుల్కర్ డబ్బింగ్ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇప్పుడు దుల్కర్ చేస్తున్న సినిమాల కంటే ముందే ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అదే ‘యాత్ర2’. 2019లో వై.యస్.రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన ‘యాత్ర’ చిత్రంలో వైఎస్‌ఆర్‌గా మమ్ముటి నటించారు. వైఎస్‌ఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించారు. ఈ సినిమా 2019 ఎన్నికలలో వై.ఎస్.జగన్ విజయానికి ఎంతగానో దోహదపడిందనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వి.రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్‌ఆర్, జగన్ మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించనున్నారు.
మొదట ఈ సినిమాలో వై.ఎస్.జగన్ పాత్రకు దుల్కర్ సల్మాన్‌ని అనుకున్నారట. తండ్రి మమ్ముట్టి వైఎస్‌ఆర్‌గా నటించారు కాబట్టి తనయుడు దుల్కర్ అయితే జగన్ పాత్రకు అతికినట్లు సరిపోతాడని భావించిన దర్శకుడు దుల్కర్‌కు ‘యాత్ర 2’ గురించి చెప్పి ఆ సినిమీలో జగన్ పాత్ర పోషించాలని కోరారట. అయితే ఇందుకు దుల్కర్ విముఖత చూపారు.
తాను వై.ఎస్.జగన్ పాత్ర పోషించడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, అది తన సినిమా కెరీర్‌ని దెబ్బ తీస్తుందని దుల్కర్ భావించి ఆ ఆఫర్‌ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడని చెబుతున్నారు. దీంతో జగన్ పాత్ర కోసం జీవాని ఫిక్స్ చేసుకున్నారు. మొత్తం మీద జగన్ రాజకీయ ప్రత్యర్థులకే కాదు.. సినీ జీవులకూ దడే అంటే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.