తుస్సుమన్న డోర్ డెలివరీ స్కీం ! జగన్ సర్కార్ పై జనాల ఫైర్
posted on Feb 3, 2021 @ 3:32PM
ప్రతి గవర్నమెంట్ పథకం ప్రతి ఇంటికి వచ్చి డోర్ డెలివరి జరగాలి.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట... ఇందులో భాగంగానే ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణికి శ్రీకారం చుట్టింది జగన్ రెడ్డి సర్కార్. ఇందుకోసం దాదాపు 4 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 9 వేల 260 వాహనాలను కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. అయితే పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో వాయిదా పడి.. పట్టణాల్లో ప్రారంభమైంది. సీఎం పదేపదే చెబుతున్న మాటలతో ఇంటికే రేషన్ వస్తుందని లబ్దిదారులు సంబర పడ్డారు. కాని రేషన్ పంపిణి ప్రారంభమైన తొలి రోజే వాళ్లకు అసలు సంగతి తెలిసొచ్చింది.
ఇంటింటికి రేషన్ పంపిణి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పగా... సిబ్బంది మాత్రం అదేమి లేదంటున్నారు. రేషన్ పంపిణి చేసే వాహనాన్ని గ్రామంలోని ఒక ప్రాంతంలో ఆపేసి అక్కడే తిష్టవేస్తున్నారు. జనాలంతా అక్కడికే వచ్చి రేషన్ సరుకులు తీసుకుపోవాలని చెబుతున్నారు. దీంతో లబ్దిదారులు కూడా చేసేది లేక వాహనం ఉన్న దగ్గరకే వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు. దీంతో రేషన్ పంపిణి చేసే వాహనాల దగ్గర చాంతాండంతా క్యూలు కనిపిస్తున్నాయి. కోవిడ్ భయం ఉన్నందున రేషన్ షాపుల దగ్గర క్యూలు ఉండకుండా ఉండటానికే ఇలా ప్లాన్ చేశామని సర్కార్ చెబుతుండగా.. ఇప్పుడు అంతకంటే సమస్య తీవ్రంగా పెరిగిందని తెలుస్తోంది.
రేషన్ షాపులో ఖాళీగా ఉన్నప్పుడే వెళ్లి సరుకులు తీసుకునేవాళ్లమని, ఇప్పుడు వాహనం రావడంతో ఖచ్చితంగా వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తుందని జనాలు ఆరోపిస్తున్నారు. వాహనం దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉండటంతో కరోనా భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వం చెప్పింది ఏంటో, ఇక్కడ జరుగుతున్నది ఏంటో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. జగన్ రెడ్డి చెప్పిన ఇంటింటికి రేషన్ పంపిణి అంటే ఇలాగే ఉంటుందా అని కొందరు లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. అందరిని ఒక చోటకు రప్పించి ఇవ్వడానికి కొత్తగా వాహనాలు కొనాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు కొనసాగిన రేషన్ షాపుల్లోనే ఇస్తే సరిపోతుందిగా అని చెబుతున్నారు.
జగన్ సర్కార్ రేషన్ డెలివరీపై టీడీపీ, తెలుగు తమ్ముళ్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా డోర్ డెలివరీ అన్నారు వైఎస్ జగన్ గారు.. మరి జనాలు రేషన్ బండి డోర్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు ఏంటి ముఖ్యమంత్రి గారు అని ఎద్దేవా చేశారు. రేషన్ డోర్ డెలివరీ బండి కంటే రేషన్ షాపు మేలని, పేరు గొప్ప ఊరి దిబ్బ అంటే ఇదే అంటున్నారని గోరంట్ల ట్వీట్ చేశారు.
ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం సమకూర్చిన తూనికల మిషన్లు సరిగా పని చేయడం లేదు. పని చేసినా పది మంది కార్డుదారులతోనే దాని చార్జింగ్ అయిపోతోంది. దీంతో రోజుకు 10 మందికి మించి రేషన్ అందించలేకపోతున్నారు. ఇంకా తమకు వద్దంటున్నా కందిపప్పును అంటగడుతున్నారని కొందరు లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. సరుకులు ఇవ్వని వారికీ కూడా ఇచ్చినట్లు డీలర్లు నమోదు చేయాలంటున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఇన్ని సమస్యలకు తోడయ్యారు డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లు. ఈ పని తమ వల్ల కాదంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. ఓవైపు డ్రైవింగ్, మరో వైపు రేషన్ మూటలు మోయడం మా వాళ్ళ కాదని తెగేసి చెబుతున్నారు. రేషన్ కొలతలు వేయడం, డబ్బులు వసూలు చేసి తిరిగి డీలర్లకు చెల్లించడం వంటి పనులన్నింటినీ.. ఒక్కరమే ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని రూ.10 వేల జీతానికి వచ్చి. ఈ చాకిరీ చేయడం కంటే కూలికి వెళితే రోజుకు 500 చొప్పున నెలకి 15000 వస్తాయని అంటున్నారు రేషన్ పంపిణి వాహనాల డ్రైవర్లు. బియ్యం మూటలు మోసేందుకు హెల్పర్ ని ఇవ్వాలని, పనిచేయని తూనికల మిషన్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.