బాపుగారి పుట్టినరోజు
posted on Dec 16, 2013 9:16AM
బొమ్మ చూడగానే.. తెలుగుతనం పరవళ్ళు తొక్కగానే..గీతలు అందాలు దిద్దుకోగానే…మాటలు బిడియం ఒలికించగానే..రాతలు వినయం తొణికించగానే..రమణ స్నేహంలో రూపం మూర్తి కట్టగానే…బుడుగు అల్లరి స్పురణకు రాగానే…రాముని దయ స్మరణకు రాగానే మన కళ్లముందు కనిపించే నిలువెత్తు తెలుగుదనం బాపు. వెండితెరకు వయ్యారాన్ని నేర్పిన బాపు పుట్టిన రోజు నేడు ఆ సందర్భంగా ఆ మహానుభావుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం.
ఆయన సినిమాలు చూస్తుంటే.. వేసవికాలంలో మల్లెతోటల్లో విహరించినట్టూ.. ఆరుబైట వెన్నెల్లో చందామామను చూస్తూ హాయిగా నిదురించినట్టూ.. మధురంగా ఉంటుంది. ఊహకు ఊపిరిపోస్తే.. దానిపేరు బాపుబొమ్మ, సౌందర్యాన్ని దృశ్యీకరిస్తే.. అది బాపు సినిమా.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అరుదైన దర్శకుడు బాపు. ఆయన సెట్ చేసిన ఒక్కో ఫ్రేమ్.. ఒక్కో చిత్రపటమే. ఆయన గీసిన బొమ్మలేకాదు.. ఆ కెమెరా కన్నుల్లో చిక్కిన ప్రతి హీరోయిన్ ఓ బాపూబొమ్మే. అందుకే బాపు సినిమాల్లో నటించడమంటే.. వారి అందానికి దక్కిన గొప్పగౌరవంగా భావిస్తారు. బాపు ఫ్రేమ్ లో ఒక్కసారైనా కనిపించాలని పరితపిస్తారు.
బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 సంవత్సరం డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆంద్రపత్రికలో కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన బాపు తరువాత దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.
రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి తెరకెక్కించారు బాపు. ఆ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆకోణంనుంచే చూశారు.. తీశారు.. బాపు.. అందుకే రామాయణంలోని ప్రతిఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించిన బాపు. ఆయన తెరకెక్కించిన సాంఘిక చిత్రాల్లోనూ రామయణ సారాన్నే చూపించారు. తనని తాను రాముని బంటుగా చిత్రీకరించుకున్నారు కూడా. అది బాపు భక్తి.
క్రియోటివ్ జీనియస్ బాపుని ఎన్నో అవార్డ్స్ వరించాయి. మదర్ థెరీసా చేతులమీదుగా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. ఆరు నందీ అవార్డ్స్ తోపాటు, ఎన్నో గౌరవ సత్కారాల్ని పొందారు. సినిమాలోనే కాదు, భక్తిరసం తొణికిసలాడే అనేక బొమ్మలు బాపు చేతిలో ఊపిరిపోసుకున్నాయి.
స్క్రిప్ట్ తోపాటే అన్ని ఫ్రేముల్నీ బొమ్మలుగా గీసుకుంటారు బాపు. అందుకే ప్రతి షాట్ సెల్యులాయిడ్ పై బొమ్మగీసినట్టు బహు ముద్దుగా ఉంటుంది. ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీస్తున్న బాపుగారికి గురువంటూ ఎవరూ లేరు. స్త్రిప్ట్ బాగుంటే చాలు డైరెక్టర్ ఐపొవచ్చు అని బాపు గారిని చూసి నేర్చుకోవచ్చు.
బాపు గురించి మాట్లాడుకునేట్టపుడు రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వారిద్దరు ఒకే ఆత్మకు రెండు రూపాలు, ఒకే భావాన్ని పలికే రెండు పదాలు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమేకాదు. జీవనం ప్రయాణం కూడా కలిసి కట్టుగానే సాగింది. కాని విధి అన్ని సార్లు అనుకూలంగా ఉండదుకదా. అందుకే వారిద్దరిని విడదీసింది. బాపు అందాల దృష్యానికి పలుకును దూరం చేసింది. రమణ తన సాహితీ సంపదను మనకు వదిలేసి బాపును ఒంటరిని చేసి వెళ్లిపోయాడు.
భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు బాపు. కళాత్మకత, భావుకత, స్వచ్ఛత.. వెరసి బాపు సినిమాలుగా రూపుదాల్చాయి. బాపు సినిమాలకోసం ప్రేక్షకుల ఎదురుచూపు సాగుతూనే ఉంటుంది.. కొనసాగుతూనే ఉంటుంది. బాపు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.