హైకోర్టులో దేవినేని బెయిల్ పిటిషన్.. కడిగిన ముత్యంలా వస్తారన్న చంద్రబాబు
posted on Jul 29, 2021 @ 7:19PM
మాజీమంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే ఉమాను కక్షపూరితంగా అరెస్ట్ చేశారని అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన ఉమా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చంద్రబాబు అన్నారు.
కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్ చూసివస్తున్న దేవినేని కారుపై వైసీపీ కార్యకర్తలు మంగళవారం దాడి చేయగా.. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు ఆయన్నే నిందితుడిగా చేర్చారు. పైగా హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఉమ సహా 18 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఆయన్ను మాత్రమే అరెస్టు చేశారు. వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పుతూ.. చివరకు బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మైలవరం సివిల్ జూనియర్ జడ్జి కోర్టు ముందు హాజరుపరిచారు. నూజివీడు, గన్నవరం సబ్‌జైళ్లు ఖైదీలతో నిండిపోవడంతో చివరకు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని కోర్టు ఆదేశించింది.
హైకోర్టులో మాజీమంత్రి దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులను పోలీసులు మోపారు. ఈ సెక్షన్లకు ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు. ఉమాపైనే దాడి చేసి ఆయనపైనే కేసులు నమోదుచేయటంపై అభ్యంతరం తెలిపారు. పలు సాంకేతిక ఆధారాలను న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం అడ్మిట్ చేసుకుంది. రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు
గుంటుపల్లి వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ దాసరి సురేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు ఉమా, మరో 17 మందిపై 18 సెక్షన్లు.. ఐపీసీ 109, 120బి, 147, 148, 149, 188, 307, 323, 324, 332, 341, 353, 427, 506 ఐపీసీ 3(1)(ఆర్), 3(1)(ఎస్), 3(2)(వి), ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్, 3 ఈడీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీకి చెందిన ఆరుగురిపైనా కేసులు పెట్టామని చెబుతున్నప్పటికీ.. వారి పేర్లను వెల్లడించలేదు.