ఏపీని గ్రీన్ వ్యాలీగా తయారు చేస్తాం : సీఎం చంద్రబాబు

 

కాకినాడలో రూ. 18 వేల కోట్లుతో ఏర్పాటు చేయనున్న  ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతు గ్రీన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తామని అన్నారు.ఈ ఏడాది సంక్రాంతి పండుగకు 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు వచ్చారని సీఎం తెలిపారు. హైదరాబాద్ నుంచి మాత్రమే సుమారు 3 లక్షల వాహనాలు ఏపీకి చేరాయని వెల్లడించారు. పండుగ వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు కావడం గర్వకారణమని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. గత ఏడాదే గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని, 2027 జూన్ నాటికి సంవత్సరానికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం కానుందని వెల్లడించారు. చరిత్రను తిరగరాయగల సామర్థ్యం తెలుగువాళ్లకే ఉందని మరోసారి నిరూపితమవుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కాకినాడ నుంచి గ్రీన్ అమోనియాను నేరుగా జర్మనీకి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో నాగార్జునా ఫెర్టిలైజర్స్ గ్రే అమోనియా తయారు చేసేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారీ జరగడం ద్వారా పర్యావరణ హిత ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు.ప్రస్తుతం పర్యావరణ సమతుల్యత సాధించడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందుతున్నాయని సీఎం తెలిపారు. ప్రకృతి విపత్తులు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల భూమి కోతకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తు చేస్తూ, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీలతో ఏపీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారబోతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే తొలి ప్రాధాన్యత : సీఎం రేవంత్‌రెడ్డి

  దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తానూ కూడ ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే పెద్దపీట వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, చిట్టబోయినపల్లిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.  బూర్గుల రామకృష్ణా రావు తరవాత మహబూబ్ నగర్ జిల్లాకు 75 ఏళ్లకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని..అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాలమూరు జిల్లాకు విద్యా, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు  ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం తెలిపారు.  విద్యా మన సమస్యలకు పరిష్కారం చూపుతుంది...భాషను మెరుగు పరుచు కోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రి కాకపోయినాఅందరి సహకారంతో సీఎం అయ్యాని తెలిపారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఇప్పటికీ ప్రజలకు జీవనాధారమై ఉన్నాయని తెలిపారు. గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేవని, భూగరిష్ఠ పరిమితి చట్టం తీసుకువచ్చి మిగులు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిందని గుర్తుచేశారు.  కానీ ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వానికి భూమి లేదని, అందుకే మంచి విద్య ఇవ్వడమే తమ ముందున్న ప్రధాన బాధ్యత అని సీఎం చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని, నిబద్ధత లేని చదువుతో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహా, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బ తీస్తోంది: కేటీఆర్

  సికింద్రాబాద్ మున్సిపల్ సాధన కోసం బీఆర్‌ఎస్  చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ర్యాలీని అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. అటు నల్ల జెండాలు, కండువాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వరకు లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకొని ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తునన్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ర్యాలీ చేస్తామని తాము ఎప్పుడో దరఖాస్తు చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  నిన్న ఓకే చెప్పి రాత్రే అనుమతి లేదని పోలీసులు చెప్పారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని తలసాని ప్రశ్నించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లేమో ఇస్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారని.. ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ర్యాలీకి నిన్న ఓకే చెప్పి.. రాత్రికి రాత్రే అనుమతి లేదన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.  టీఎస్‌ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ర్యాలీకి సిద్ధమయ్యారని తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు. శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీని కూడా ఆహ్వానించారని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం తెలుపుదామని సిద్ధమయ్యామని పేర్కొన్నారు. కానీ వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని తెలిపారు. తమను కూడా తెలంగాణ భవన్‌లో నిర్బంధించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

నోబుల్ బ‌హుమ‌తి బ‌దిలీ చేయొచ్చా?

  ఇటీవ‌ల నోబెల్ శాంతి బ‌హుమ‌తి  గ్ర‌హీత కొరినా మ‌చాడో.. వైట్ హౌస్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి వెళ్లి.. అక్క‌డ త‌న‌కొచ్చిన  బహుమ‌తిని అధ్య‌క్షుడు ట్రంప్ కి అందించి.. త‌న‌దైన ఉదార‌త చాటుకున్నారు. దీంతో ఎట్ట‌కేల‌కు నోబెల్ బ‌హుమ‌తి నాకే.. అంటూ ట్రంప్ పేరిట ప‌లు కామెంట్లు సెటైర్లు వెలువ‌డుతున్నాయ్. ఇంత‌కీ నోబెల్ నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయో చూస్తే బ‌హుమ‌తి ఒక్క‌సారి క‌మిటీ ప్ర‌ధానం చేస్తే.. అందులో మ‌రోమార్పు ఉండ‌దు. అవి ఆయా వ్య‌క్తుల పేరిట మాత్ర‌మే లిఖించ‌బ‌డ‌తాయి. వారు మాత్ర‌మే ఆయా విభాగాల విజేత‌లుగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు. ఇది ఇవాళ్టి నియ‌మ- నిబంధ‌న కాదు.. అల్ ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ అవార్డులు ఇవ్వ‌డం  నుంచీ మొద‌లైన ఒకానొక ఆచారం. అయితే ఆయా విజేత‌ల‌కు త‌మ‌కొచ్చిన బ‌హుమ‌తి ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని.. ఎవ‌రికైనా ఇవ్వొచ్చు. మ‌రేదైనా  చారిటీకి స‌మ‌ర్పించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం మ‌చాడోకి 11 మిలియ‌న్ల స్వీడిష్ క్రోనార్లు బ‌హుమ‌తితో పాటు ఇచ్చారు. ఇది భార‌తీయ  క‌రెన్సీలో చెబితే సుమారు 10 కోట్ల మేర ఉంటుంది. ఈ మొత్తం  ఆమె ఏదైనా చారిటీ సంస్థ‌ల‌కు దానం చేసుకోవ‌చ్చు. అది ఆమె ఇష్టం. అయితే  ఆ అవార్డు భౌతికంగా  ఎవ‌రి చెంత ఉన్నా  కూడా విజేత మాత్రం మ‌చాడోనే. ఆ బ‌హుమ‌తిని క‌మిటీ ఫ‌లానా వారి పేరిట రాసి వారికిస్తే ఇక వారికే సొంతం. దాని బ‌దిలీ చేయ‌డానికి ఎంత మాత్రం వీలు కాదు. ఈ లెక్క‌న ఈ బ‌హుమ‌తిని గ్ర‌హీత నుంచి తీసుకున్నంత మాత్రాన దాని విలువ పెర‌గ‌దు- త‌ర‌గ‌దు, బ‌దిలీ అంత‌క‌న్నా కాద‌ని చెబుతున్నాయ్ నార్వేజియ‌న్ నోబెల్ క‌మిటీ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్. దానికి తోడు దేశాల‌కు దేశాలు ఆక్ర‌మించే కుయుక్తులు వేస్తున్న  ట్రంప్ న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తికాదు క‌దా.. ఆ పేరు ఎత్త‌డానికే అన‌ర్హుడిగా  భావిస్తున్నారు చాలా మంది. ప్ర‌స్తుతం ఇరాన్ అట్టుడుకుతోందంటే అందుకు ప్ర‌ధాన కార‌కుడు ట్రంపే. ఇక వెనుజువెలా  సంగ‌తి  స‌రే స‌రి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఇంత‌టి విచ్చిత్తికి కార‌కుడ‌వుతోన్న ట్రంప్ చేతికి నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వ‌డం కూడా నేర‌మే అన్న మాట వినిపిస్తోంది.  వెనుజువెలా  ప్ర‌తిప‌క్ష  నేత  మ‌చాడో ఈ ప‌ని ఎందుకు చేశారో అన్న చ‌ర్చ‌కు సైతం తెర‌లేచింది. బ‌హుశా ట్రంప్ త‌న‌కు మ‌చాడో నోబెల్ బ‌హుమ‌తి ఇచ్చినందుకు ఆమెనే ఆ దేశ త‌ర్వాతి అధ్య‌క్షురాలిగా నియ‌మిస్తారా? అలాగైతే మ‌చాడోకి ఇచ్చిన శాంతి బ‌హుమానం కూడా క‌ళంకితం  అవుతుంది క‌దా? అన్న మాట కూడా వినిపిస్తోంది.

తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని

  భారత తొలి వందే భారత్ స్లీపర్ రైలును  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌‌లోని మాల్దాలో ప్రారంభించారు. హౌరా-గువాహటి మధ్య ఈ రైలు నడవనుంది. 16 బోగీలు, 823 మంది ప్రయాణికులతో సుమారు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వేగం, సురక్షితం, మరిన్ని సదుపాయాలతో సుదూర ప్రయాణాలను సాగించనుంది.  టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులను.. ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మాల్దాలో జరుగనున్న బహిరంగ సభలో రూ.3,250 కోట్ల విలువ చేసే రైల్, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. కాగా.. మోడ్రన్ ఇండియాలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలును డిజైన్ చేశారు. మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లోనే వీటి డిజైన్, తయారీ చేపడుతున్నారు. జనవరి 18న హుగ్లీ జిల్లాలోని సింగూరు వద్ద రూ.830 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు. 

పురుషులకు ఫ్రీ బస్...ఏఐడీఎంకే మేనిఫెస్టోలో ప్రకటన

  రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకే పార్టీ  తొలి విడత  మేనిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతినెలా రూ. 2 వేలు, సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం..ఇళ్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ. 25 వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించారు.  తమిళనాడు ఇప్పటికే అప్పుల్లో ఉండగా ఇన్ని ఉచిత పథకాలు ఎలా సాధ్యమని మీడియా ప్రశ్నించగా.. పళనిస్వామి అందుకు ధీటుగా స్పందించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వానికి పరిపాలనా దక్షత లేదని. తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపినట్లు తెలిపారు. సరైన ప్రణాళిక, పరిపాలనా సామర్థ్యం ఉంటే ఇవన్నీ సాధ్యమేనని అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము రూ. 1,500 ఇస్తామని చెబితే, డీఎంకే దాన్ని కాపీ కొట్టిందని, కానీ ఇప్పుడు తాము మరింత మెరుగైన పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నామని పళనిస్వామి వెల్లడించారు.  

మేడారం మహాజాతర ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఇందు కోసం కోసం ఏర్పాటైన మహాజాతర ట్రస్ట్ బోర్డు శనివారం (జనవరి 17) ప్రమాణ స్వీకారం చేసింది. మహాజాతర ట్రస్ట్ బోర్డు  చైర్మన్ గా  నియమితులైన ఇర్ప సుకన్య సునీల్ దోర. 15 మండి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఇక పోతే మేడారం మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)  విస్తృత స్థాయిలో సన్నాహాలు   చేస్తోంది. లక్షల మంది భక్తులు వన దేవత లైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి రానున్న నేపథ్యంలో.. వారికి ఎటువంటి ప్రయాణ ఇబ్బందులూ తలెత్తకుండా  టీఎస్ఆర్టీసీ  రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది. మహాజాతర కోసం టీఎస్ఆర్టీసీ   రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్రత్యేక బస్సులను  అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 42,810 ప్రత్యేక ట్రిప్పులు నిర్వహించి దాదాపు 20 లక్షల మంది భక్తులకు మేడారం జాతరకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు అందుబాటులో ఉంచనుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ, అలాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడప నుంది. ఇక మేడారం మహాజాతరకు స్వయంగా వెళ్లలేని భక్తులకు కూడా ఆర్టీసీ సేవలందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ సమన్వయంతో  భక్తుల ఇంటి వద్దకే సమ్మక్క–సారలమ్మ ప్రసాదాన్ని అందించడానికి కూడా ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం  299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన భక్తులకు వారి ఇంటి వద్దకే ఇంటి  సమ్మక్క, సారలక్క బంగారం ప్రసాదం ప్యాకెట్ ను అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రసాద ప్యాకెట్‌లో అమ్మవార్ల ఫొటోతో పాటు బెల్లం, పసుపు, కుంకుమ ఉంటాయి.  ఇక తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా మౌలిక సదుపాయల కల్పన చేసింది.  భక్తుల రాకపోకల ను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత వంటి అంశాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల  28 నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత పాపారావు హతం

ఛత్తీస్‌గఢ్ లోని  బీజాపూర్ జిల్లాలో  జరిగిన ఎన్ కౌంటర్ లో  మావోయిస్టు పార్టీ అగ్రనేత  పాపారావు హతమయ్యాడు. ఈ ఘటనతో   బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది.  అత్యంత విశ్వసనీయంగా అందిన  సమాచారం మేరకు, గత కొన్ని రోజులుగా పాపారావు నేషనల్ పార్క్ పరిసర అటవీ ప్రాంతంలో దాక్కుని ఉన్నాడని తెలుసుకున్న భద్రతాదళాలు కూంబింగ్ చేపట్టాయి.   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరియు కోబ్రా ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కూబింగ్ లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో  ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత పాపారావు అక్కడికక్కడే  మరణించాడు.   సంఘటనా స్థలం నుంచి  రెండు ఏకే–47 తుపాకులు,  మందుగుండు సామగ్ర, మావోయిస్టు సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  పాపారావు మావోయిస్టు పార్టీలో  కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, భద్రతా బలగాలపై దాడులు, ఆయుధాల సరఫరా, కొత్త క్యాడర్ నియామకం వంటి కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎఇంకా మావోయిస్టులు అనుమానంతో  భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.  

గ్రీన్ లాండ్ ను ఆక్రమిస్తాం.. వ్యతిరేకించే వారిపై అదనపు సుంకాలు విధిస్తాం!

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి టారిఫ్ వార్ ప్రకటించారు. తమ ఆక్రమణలను అడ్డుకుంటే అదనపు సంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.  ఔను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోసారి టారిఫ్  హెచ్చరికలు చేశారు. గ్రీన్ లాండ్   విషయంలో తమతో విభేదించే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని హుంకరించారు.   అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ అత్యంత కీలకమన్న ట్రంప్  ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని, ఈ విషయంలో తమను వ్యతిరేకించేవారెవరైనా సరే సహించేది లేదని ప్రపంచ దేశాలకు ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చారు.  అయితే టంప్ చేసిన ఈ వార్నింగ్ డెన్మార్క్ కు మాతర్మేనని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ను ఆక్రిమించుకుంటామన్న ట్రంప్  తీరును డెన్మార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  డెన్మార్క్ ఎప్పటికీ తమ అధీనంలోని స్వతంత్రదేశాంగానే ఉంటుందని  డెన్మార్క్ అధ్యక్షుడు మెట్టె ఫ్రెడెరిక్సన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వార్నింగ్ డెన్మార్క్ కేనని అంటున్నారు. 

స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్డీఆర్ జీవన సాఫ్యల పురస్కారం దక్కింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో  ఈ పురస్కారాన్ని శుక్రవారం (జనవరి 16) ప్రదానం చేశారు. అంతకు ముందు  నర్సీపట్నంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో    మకర జ్యోతి ఉత్సవాలు  శుక్రవారం (జనవరి 16) ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రారంభమైన స్వామివారి రథోత్సవం కృష్ణ బజార్ , వేంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా సాగింది.  ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభావేదికపై  స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి  ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం  ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. పరిషత్తు అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఈ అవార్డును అందజేశారు.   

పోక్సో కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడలోని పోక్సో కోర్టు  నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గోరంట్ల మాధవ్ పై గతంలో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బహిర్గతం చేశారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా గోరంట్ల మాధవ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇలా ఉండగా తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలని కోరుతూ గోరంట్ల మాధవ్ సోమవారం (జనవరి 19) కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.