చీరాల, దర్శిలో కూటమి విజయంపైనే భారీగా పందేలు.. వైసీపీ ఆశలొదిలేసుకున్నట్లేనా?
posted on May 24, 2024 @ 10:07AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో పందెం రాయుళ్ల దృష్టంతా రెండు నియోజకవర్గాలపైనే ఉంది. దర్శి, చీరాల నియోజకవర్గాలలో వైసీపీదే పై చేయి అని ముందు నుంచీ ఒక భావన ఉంది. పోలింగ్ పూర్తి అయిన తరువాత నుంచీ ఈ నియోజవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని మిగిలిన పది నియోజకవర్గాలపై కంటే ఈ రెండు నియోజకవర్గాలలోనే గెలుపు గుర్రం ఏదన్నదానిపై పందెంరాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు.
ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని ముందు నుంచి పరిశీలకులు విశ్లేషణలు చేస్తూ వచ్చారు. దర్శి నియోజవర్గం విషయానికి వస్తే.. వైసీపీ ఇక్కడ చాలా ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసేసింది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డిని ప్రకటించింది. నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్న శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించేనాటికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ చార్జ్ కూడా లేడు. అంతే కాదు ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో దర్శిలో వైసీపీ విజయం నల్లేరు మీద బండి నడకేనని అంతా భావించారు. అయితే అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి.
జనసేనకు కేటాయించిన దర్శి నియోజకవర్గంలో అనూహ్యంగా తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మి పోటీలోకి దిగారు. ఈ మార్పు టీడీపీకి నియోజకవర్గంలో సానుకూల వాతావరణం ఏర్పడడానికి దోహదపడింది. అంతే కాకుండా తెలుగుదేశం, జనసేన శ్రేణులు సమైక్యంగా లక్ష్మి విజయం కోసం పని చేశారు. దీంతో దర్శి నియోజకవర్గ సీన్ ఒక్క సారిగా మారిపోయింది. పోలింగ్ రోజుల తెలుగుదేశం కూటమి అభ్యర్థి జోరు స్పష్టంగా కనిపించింది.
అది నియోజకవర్గంలో గెలుపు ఓటములపై పందేలు ఒడ్డే పందెం రాయుళ్లు తొలుత భారీగా వైసీపీ విజయంపై బెట్టింగులు వేశారు. అయితే పోలింగ్ తరువాత నుంచి ట్రెండ్ మారింది. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గెలుస్తారంటూ పందెం ఒడ్డే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి విజయం సాధిస్తారంటూ పందెం రాయుళ్లు పెద్ద మొత్తంలో పందేలు కాస్తున్నారు. ఆరంభంలో వైసీపీ గెలుపుపై రూపాయికి రూపాయన్నర వరకూ పందేలు కాసిన వారు ఇప్పుడు రూపాయికి రూపాయి అని కాయడానికి కూడా వెనుకాడుతున్నారు. అదే విధంగా ఆరంభంలో వైసీపీ అభ్యర్థి పదివేల మెజారిటీ సాధిస్తారంటూ పందేం ఒడ్డడానికి సిద్ధపడిన వారు ఇప్పుడు కలికానిక్కూడా కనిపించడం లేదు.
మరో వైపు తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పందెం రాయుళ్లు బెట్టింగులకు రెడీ అవుతున్నారు. అంతే కాదు మండలాలవారీగా ఆధిక్యతలపై కూడా పందేలు ఒడ్డుతున్నారు. ఇక చీరాల విషయానికి వస్తే.. పోలింగ్ కు ముందు వరకూ కూడా ఈ నియోజకవర్గం వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయం ఉండేది.
అయితే ఎప్పుడైతే సీనియర్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారో అప్పటి నుంచీ చిరాలలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పెద్ద ఎత్తున పందెం ఒడ్డేందుకు పందెం రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఆమంచి పోటీలో ఉండటంతో వైసీపీ ఓట్లు భారీగా చీలిపోయాయని అంటున్నారు. అంతే కాకుండా ఇక్కడ నుంచి తెలుగుదేశం బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం, అదే సమయంలో వైసీపీలో గ్రూపు తగాదాలు కూటమికి మొగ్గు రావడానికి దోహదపడిందని చెబుతున్నారు.