వైఎస్ సీఎం కావడం వల్లే కాంగ్రెస్ కు నష్టం! కేంద్ర మాజీ మంత్రి సంచలనం
posted on Oct 6, 2021 @ 12:07PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలహీనపడింది. 2004 తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే వైఎస్సార్ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెబుతారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన మరింత బలపడ్డారు. పార్టీ పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్లింది. జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అధినేత స్థాయిలో ఏపీ కాంగ్రెస్ ను శాసించారు వైఎస్సార్. 2009లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
వైఎస్సార్ వల్లే ఏపీలో కాంగ్రెస్ బలపడిందనే టాక్ ఉండగా.. ఆ పార్టీ సీనియర్ నేత మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనసులోని మాటను నిర్భయంగా చెబుతురనే పేరున్నకేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.. వైఎస్ కుటుంబంపై హాట్ కామెంట్స్ చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ సీఎం చేయడమే వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నారు. వైఎస్ సీఎం కాకపోతే...నేడు జగన్ సీఎం కాలేరన్నారు. వైసీపీ వలన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగిందని తెలిపారు చింతా మోహన్. ఆ ప్రభావం ఇప్పటికి కనిపిస్తుందని చెప్పారు.
విశాఖ, గుంటూరుకు త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని.. స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారన్నారు చింతా మోహన్. మూడు రాజధానులపై జగన్ ది తొందర పాటు చర్య అన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకోవాల్సిందని అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని కేంద్ర మాజీ మంత్రి స్పష్టం చేశారు. త్వరలో ఏపీ పీసీసీలో మార్పులు ఉంటాయని.. తాను పీసీసీ అధ్యక్ష రేసులో లేనని చింతా మోహన్ తెలిపారు. వైఎస్ కుటుంబంపై చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.