గాలి కేసులో అలా.. జగన్ కేసులో ఇలా! సీబీఐ ఎందుకిలా?
posted on Aug 14, 2021 @ 9:40AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న రఘురామ.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయన వేసిన పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు ఇవ్వబోతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో ఏం జరగబోతుందన్న టెన్షన్ వైసీపీలో నెలకొంది. అంతేకాదు ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా మరో పిటిషన్ వేశారు ఎంపీ రఘురామ రాజు. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. విజయసాయికి కౌంటర్ కు గడవు కావాలని కోరవడంతో విచారణను ఆనెల 16కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
జగన్, విజయసాయి రెడ్డి కేసుల సమయంలోనే గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసులోనూ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సీబీఐ తీరుపై కొన్ని అనుమానాలకు కారణమవుతున్నాయి. మైనింగ్ అక్రమాల కేసు వెంటాడుతున్న గాలి జనార్దన్ రెడ్డి కేసులో సీబీఐ వాదనకు... జగన్ , విజయసాయి కేసుల్లో సీబీఐ వినిపిస్తున్న వాదనకు పొంతన లేకుండా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వీరిద్దరి విషయంలో సీబీఐ కాస్త భిన్నంగా వ్యవహరిస్తోందని అభిప్రాయ పడుతున్నారు.
విజయసాయి బెయిల్ రద్దు చేయాలని ఈ నెల 7వ తేదీన రఘురామ పిటిషన్ వేయగా.. ఆ రోజునే కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని విజయసాయిని, సీబీఐని ఆదేశిస్తూ.. ఇందుకోసం మూడు రోజుల గడువు విధించింది. కేసు విచారణ ఈ నెల 10కి వాయిదావేసింది. ఆ రోజు విచారణ సందర్భంగా.. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని సీబీఐ కోరింది. దీంతో.. మరో మూడు రోజుల గడువు ఇస్తూ.. కేసును 13వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. శుక్రవారం జరిగిన విచారణలో సీబీఐ తనదైన వాదన ఏమీ వినిపించలేదు. కోర్టు మెరిట్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని అఫిడ విట్ లో కోరింది. దాని ప్రకారమే బెయిల్ రద్దు చేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. సీబీఐ అఫిడ విట్ స్వీకరించిన కోర్టు.. విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణలోనూ సీబీఐ ఇదేవిధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు మెరిట్ ప్రకారమే బెయిల్ రద్దు చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
అయితే గాలి జనార్దన్ రెడ్డి విషయంలో సీబీఐ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు బెయిల్ ఇచ్చినప్పటికీ.. అందులో పలు షరతులు ఉన్నాయి. అందులో బళ్లారికి వెళ్లకూడదనే రూల్ కూడా ఉంది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. కోర్టు అనుమతి తీసుకుని మాత్రమే వెళ్లాలి. ఈ విషయంలో తనకు సడలింపు ఇవ్వాలని పలుమార్లు ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ.. ఫలితం రాలేదు. ఇప్పుడు మరోసారి కూడా సుప్రీం కోర్టులో ఈ మేరకు ప్రయత్నం చేయబోతున్నారు. బెయిల్ షరతులను సడలించాలని కోరేందుకు చూస్తున్నారు. అయితే.. సీబీఐ మాత్రం ససేమిరా అని వాదిస్తోంది. ఆయన బళ్లారి వెళ్లడం జరిగితే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ చెబుతోంది. అందువల్ల ఆయన బెయిల్ షరతులను సడలించొద్దని బలంగా కోరుతోంది సీబీఐ.
విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్లో.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కోర్టు దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయాలో అందులో వివరించారు. ఎంపీ విజయసాయిరెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. ఏ2గా ఉన్న విజయసాయి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారు. సరిగ్గా.. ఈ విషయం దగ్గరనే జగన్ మోహన్ రెడ్డికి, గాలి జనార్ధన్ రెడ్డికి మధ్య పోలిక తెస్తున్నారు కొందరు. జగన్, విజయసాయి విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న సీబీఐ.. మరి, గాలి విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తోందా? అని చర్చించుకుంటున్నారు.