పెళ్లిపీటల మీదకి ..లాహిరి..లాహిరి!
posted on Jul 15, 2022 @ 12:14PM
గోదారి కన్నెర్రజేసింది. ఉప్పొండి పొర్లి ప్రవహిస్తోంది. కోనసీమ ఓ గ్రామంలో మాత్రం ఓ అమ్మాయిని పెళ్లికి తరలించడంలో ఆనందోత్సాహంలో వున్నారు. బాజాబజంత్రీలతో పెళ్లింటికి వెళ్లడం ఆనవాయితీ. కానీ ప్రశాంతి అనే అమ్మాయి మాత్రం చక్కగా నవ్వుతూ పడవలో ప్రయాణమైంది.
వర్షాలు ముంచెత్తుతున్న ఈ సమయంలో మరి ముహూర్తాన్ని కాదనుకోలేరుగదా. అంతా సిద్ధమైన తర్వాత ప్రకృతీ సహకరిస్తుందనే ధైర్యం పెళ్లింటా వుంది. ముహూర్తబలం బలమైనది.. ప్రశాంతి చక్కగా పెళ్లి చేసుకోవడానికి పడవ ప్రయాణం చేసింది. పూలతో చూడముచ్చటగా అలంకరించిన కారులో వెళ్లడం కంటే ఇలా వెళ్లడంలో ఆమెకీ ఎంతో సరదాగా వుంది. అయితే ఇది తప్పని పరిస్థితి. భారీ వర్షా లతో జిల్లా అంతా తడిసి ముద్దవుతున్న సమయంలో కాస్తంత తెరిపివ్వగానే ఇలా పెళ్లికూతు బయలు దేరింది. ఇది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో దృశ్యం.
ప్రశాంతి, అశోక్‌ల పెళ్లి నిజానికి ఈపాటికే జరగాల్సింది. కానీ జిల్లాలో, రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ముహూర్తం మార్చుకోవలసి వచ్చింది. ఆగస్టులో సాధారణంగా వర్షాలు పడతాయనుకుని జూలైకి తేదీని మార్చుకున్నారు. కానీ ఈ అకాల వర్షం రెండు కుటుంబాలను కాస్తంత ఖంగారుపెట్టింది. ముహూర్తాలు పెట్టుకున్నాం గనుక ఎలాగయినా చేసేద్దామని అంతా పట్టుబట్టారు. అంతకుమించి అందరూ సహాయం చేశారు. జిల్లాలో వర్షం కాస్తంత తెరిపివ్వడంతో ఇలా పడవలోనే అమ్మాయిని తీసికెళుతున్నారు.
అబ్బాయి గ్రామం దగ్గరే కావడంతో ఇలా పడవలో వెళ్లడంలో అదో ఆనందం, సరదా. మామూలుగా అయితే కారులోనో, ప్రత్యేకించి బస్సు ఏర్పాటుచేసుకునో బంధువులందరూ కలిసి వెళ్లేవారు. ఇప్పుడు పడవలో అందరూ తరలివెళుతున్నారు. ఇది ఊహించని ఆనందం. కానీ ఒక్కింత భయమూ వారికి లేకపోలేదు. బోటు షికారు వేరు, ఇలా వెళ్లడం వేరు గదా. మొత్తానికి అంతా శుభంగానే జరిగింది. అందరూ ఈ ప్రయాణం గురించి చెప్పుకుంటారు. పెళ్లి జంట కూడా ఆనక పిల్లలకీ ఈ సంగతి చెప్పి నవ్వుకుంటారేమో.