చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం
posted on Jun 8, 2014 @ 9:04PM
ప్రమాణ స్వీకారోత్సవ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘‘నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దకొడుకుగా వుంటాను. కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టాన్ని పూడ్చుకోవలసిన అవసరం వుంది. కాంగ్రెస్ పార్టీ మనకి నష్టం చేసి అది కూడా నాశనమైపోయింది. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. తెలుగువారు రాజధాని కోసం ఒక్క ఇటుక అయినా పంపించాల్సిన అవసరం వుంది. చందాలు ఇవ్వాల్సిన అవసరం వుంది. ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు ఎంతో సహకరించారు. సమైక్య పోరాటం సందర్భంగా పెట్టిన కేసులు మొత్తం రద్దు చేస్తానని హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పాలన సందర్భంగా దేశం ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. ఇచ్చిన హామీలను నెరవేర్చానికి కృషి చేస్తాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. ఆంధ్రప్రదేశ్‌ని పునాదుల నుంచి అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం తప్పకుండా సమహరిస్తుంది. ఆ సహకారంతో మన కాళ్ళమీద మనం నిలబడి ఆంధ్రప్రదేశ్‌ని నంబర్‌వన్ చేస్తామని నమ్మకం వుంది. మనకు తీరప్రాంతం వుంది, పోర్టులు వున్నాయి. తెలివైన వారున్నారు. అన్నదాతలున్నారు. విద్యావంతులున్నారు. మనకి చాలా వసతులు కూడా వున్నాయి. రాబోయే రోజుల్లో మనం మరింత ముందుకు వెళ్తామన్న నమ్మకం వుంది. రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్ర చేయడానికి నిద్రపోకుండా కృషి చేస్తాను’’ అని చంద్రబాబు అన్నారు.