రైల్వే ట్రాక్ మీద నిలిచిన బస్సు.. వామ్మో...
posted on Sep 17, 2014 @ 2:04PM
అది విజయనగరం జిల్లా బొబ్బిలి. ప్రయాణికులతో క్రిక్కిరిసి వున్న ఆర్టీసీ బస్సు నిండు గర్భిణిలా మెల్లగా ప్రయాణిస్తోంది. ఇంతలో బస్సు సడెన్‌గా ఆగిపోయింది. డ్రైవర్ ఆగిపోయిన బస్సుని తిరిగి స్టార్ట్ చేయడానికి ఇగ్నిషన్ కీ తిప్పుతున్నాడు. కీ తిప్పుతుంటే బస్సు బుర్రు బుర్రుమంటోంది తప్ప ఎంతకీ స్టార్ట్ కావడం లేదు. ఇంతలో కొంతమంది ప్రయాణికులు బస్సులోంచి బయటకి చూసి అదిరిపోయారు. కెవ్వుమని కేకలు వేశారు. అసలు విషయం ఏమిటంటే, ఆ బస్సు కచ్చితంగా కాపలా లేని లెవల్ క్రాసింగ్ దగ్గర కచ్చితంగా రైల్వే ట్రాక్ మధ్యలో నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులందరూ కంగారుపడిపోయి గబగబా బస్సు దిగే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బస్సులో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఎటువైపు నుంచి ఏ రైలు వచ్చి ఢీకొంటుందోనన్న భయంతో ప్రయాణికులందరూ టెన్షన్ పడిపోయారు. ఎవరికి తోచిన దారిలోంచి వాళ్ళు బస్సు దిగేశారు. కొంతమంది ప్రయాణికులైతే బస్సు అద్దాలు పగులగొట్టి మరీ బస్సులోంచి దూకేశారు. బస్సులోంచి దూకేసిన కాసేపటికిగానీ ప్రయాణికుల టెన్షన్ తగ్గలేదు. ఆ తర్వాత అందరూ కలసి అటూ ఇటూ చూసుకుంటూ బస్సును ట్రాక్ మీద నుంచి అవతలకి నెట్టేశారు.