రాత్రికి రాత్రే ఊరు మొత్తం కోటీశ్వరులు..
posted on Dec 1, 2016 @ 3:50PM
ఇప్పటి వరకూ ఊర్లని దత్తత తీసుకోవడం.. గ్రామాన్ని అభివృద్ది చేయడం వంటి పనులు చేస్తుండటం చూశాం. కానీ గ్రామాలకు తమ ఆస్తి మొత్తం రాసివ్వడం వంటివి చూడలేదు. కానీ ఇక్కడ ఓ పెద్ద మనిషి మాత్రం తన ఆస్తి మొత్తాన్ని గ్రామ వాసులకు రాసి ఓ గొప్ప పని చేశాడు. ఇంతకీ ఎవరా పెద్ద మనిషి... ఆ కథ ఏంటో చూద్దాం ఒకసారి. స్పెయిన్‌కు చెందిన ఆంటొనినో ఫెర్నాండెజ్ అనే వ్యాపార వేత్త ఊర్లో ఉన్న ప్రజలందరికి తన ఆస్తి మొత్తం పంచిపెట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. 1917లో స్పెయిన్‌లోని సెరెజల్స్ డెల్ కొండాడొ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆంటొనినో ఫెర్నాండెజ్ ది చాలా పేద కుటుంబం. అతనికి 13 మంది అక్కచెల్లెలు ఉన్నారు. అయితే అంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి సంపాదన చాలలేదు. దీంతో ఫెర్నాండెజ్ 14 ఏళ్ల వయస్సులో చదువుకు స్వస్తి చెప్పి కుటుంబ పోషణ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాను తన భార్యతో కలిసి మెక్సికో వలస వెళ్లి.. అక్కడ ఓ ప్రముఖ పానీయాల తయారీ సంస్థలో ఉద్యోగం సాధించాడు. అందులోనే కష్టపడి సీఈవో స్థాయికి ఎదిగాడు. అనంతరం బయటికి వచ్చి సొంతంగా బీర్లను తయారు చేసే కంపెనీ పెట్టాడు. దాని ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జించాడు. అయితే అంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా ఫెర్నాండెజ్ మాత్రం తన సొంత ఊరిని మరువలేదు. తాను సంపాదించిన రూ.14వేల కోట్ల ఆస్తిని తన ఊరి ప్రజలకు రాసిచ్చేశాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.17.50 కోట్ల దాకా వచ్చాయి. ఈ క్రమంలో ఆ ఊరివాసులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. మరి అంత కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఉచితంగా రాయాలంటే ఎంతో పెద్ద మనసు కావాల్సిందే మరి. కాగా ఇటీవలే ఆయన చనిపోయాడు. ఇంత చేసిన ఆయనకు గ్రామస్థులు మర్చిపోతారా.. ఆయనకు ఆలయాన్ని కట్టించి అందులో ఫెర్నాండెజ్‌ను దేవుడిగా కొలుస్తున్నారు. నిత్యం ఆయనకు ప్రార్థనలు చేస్తున్నారు.