Lok Pal Bill: Sibal Meets Swamy Agnivesh

Union Human Resources Development Minister Kapil Sibal today met social activists Swamy Agnivesh and Arvind Kejriwal to find ways to bridge differences on the anti-corruption Lok Pal Bill. The talks between the Government and the activists came as Mr Hazare's fast entered the third day and support for his crusade gathered momentum across the country.

After the meeting, Sibal told reporters that the trio had a 'constructive dialogue' and are trying to find out solutions. "The broad parameters generally agreed upon, the formalities not yet. We want to deal with corruption. We want to get rid of corruption. We want civil society to participate in this effort. We do not have any problem with that," said the minister. Mr. Sibal also asserted "We want Anna Hazare to give up the fast, we believe that the object must be that civil society and government should sit together and deal with the problem of corruption through an effective legislation."

Swami Agnivesh and Kejriwal are part of the movement started by veteran Anna Hazare, who is on his third day of indefinite hunger strike demanding a role for civil society members in the drafting of the Lokpal Bill. Swamy Agnivesh said that the meeting is going on in a positive and constructive way.
 

కేటీఆర్ పై రేవంత్ విమర్శలు.. జగన్ కూ వర్తిస్తాయంటున్న నెటిజనులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. రేవంత్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ బుధవారం (డిసెంబర్ 24) కోస్గిలో నూతన సంర్పంచ్ ల అభినందన సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైనా, అలాగే కేటీఆర్ పైనా విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కేటీఆర్ గతంలో తనపై చేసిన విమర్శలకు ఓ రేంజ్ లో బదులిచ్చారు.  ఈ సందర్భంగా రేవంత్ కేటీఆర్ , ఆమె సోదరి కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలనూ ప్రస్తావించారు. సొంత చెల్లిని పండక్కి పిలిచి చీర కూడా పెట్టలేని వాళ్లు తనను విమర్శిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.  ఆస్తిలో   వాటాకు వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతుందనీ..సొంత చెల్లినే  బయటకు పంపించిన వారు నాకు రాజకీయ నీతులు చెపుతున్నారు,   తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆ విమర్శలపైనే ఇప్పుడు నెటిజనులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.  రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.  రేవంత్ విమర్శలు  అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా జగన్ తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతోందన్న ఉద్దేశంతోనే దూరంపెట్టారని గుర్తు చేస్తున్నారు.  రేవంత్ కేటీఆర్ పై సంధించిన విమర్శనాస్త్రాలను  ఇటు ఏపీ మాజీ సీఎం జగన్ కి కూడా ఆపాదిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అన్నా చెళ్లెళ్ల వివాదాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయ   ఇటు తెలంగాణలో కేటీఆర్, కవిత, అటు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల, జగన్ ల మధ్య విభేదాలు పొలిటికల్ గా బీఆర్ఎస్న, వైసీపీలకు నష్టం చేకూరుస్తున్నాయనడంలో సందేహం లేదు.  తెలంగాణలో కేటీఆర్ లక్ష్యంగా కవిత, ఏపీలో జగన్ లక్ష్యంగా షర్మిల చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు బీఆర్ఎస్, వైసీపీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా కేటీఆర్ ను, జగన్ ను సొంత చెల్లెలికి అన్యాయం చేసిన అన్నలుగా ప్రజల ముందు నిలబెడుతున్నాయంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. వీటికి బదులు చెప్పలేక కేటీఆర్, జగన్ లు సతమతమౌతున్నారు. 

చంద్రబాబు.. విజన్ ఎహెడ్.. 2047 అండ్ బియాండ్!

అందరూ రేపటి గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రెండు  దశాబ్దాల ముందు గురించి ఆలోచిస్తారు. అదీ ఆయన విజన్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రోజే ప్రణాళికలు రూపొందిస్తారు. అదీ ఆయన దూరదృష్టి. అందుకే రెండు దశాబ్దాలకు ముందు ఆయన విజన్ 2020 అన్నారు. ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులూ కూడా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను, దూరదృష్టినీ ప్రశంసిస్తారు. రాజకీయ విభేదాలతో మరుగుల పడేయాలని ప్రయత్నించిన నేతలూ ఉన్నారనుకోండి. వారి ప్రయత్నాలు విఫ లమై వారే మరుగుల పడే పరిస్థితికి రావడం మనం చూస్తున్నాం. సంక్షోభాల నుంచీ అవకాశాల అన్వేషించే అభివృద్ధికాముకుడు చంద్రబాబు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, సృజన, ఆలోచనలు, సంస్కరణలతో అందరినీ అబ్బుర పరుస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లు, బయోమెట్రిక్ అటెండన్స్ ఇవన్నీ చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనాలే.  వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రజలకు అరచేతిలో పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే.  ఇప్పుడు తాజాగా మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేందుకు   స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు చంద్రబాబు.   ఇందు కోసం కార్యాచరణ కార్యాచరణ రూపొందించాలని   ఉన్నతాధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై సచివాలయంలో  సిఎస్ విజయానంద్ పాటు ఆయా  శాఖల ఉన్నతాధికారులతో  బుధవారం (డిసెంబర్ 24) భేటీ అయిన చంద్రబాబు  స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంపై వారికి దిశా నిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం  ద్వారా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలన్న ఆయన ఆ మేరకు కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సుస్థిర అభివృద్ధి, అదే సమయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం తీసుకోవలసిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించిన చంద్రబాబు, ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని, తక్కువ ఖర్చుతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత వంటి సేవలను అందించడమే లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన తదితర అంశాలపై అధికారులకు స్పష్ట మైన లక్ష్యాలను నిర్దేశించారు.  జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ వంటి అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అట‌ల్, పీవీ.. పోలిక‌లు.. వ్యత్యాసాలు!

ఒకే నెలలో ఇద్ద‌రు దిగ్గ‌జాల జ‌యంతి, వ‌ర్ధంతి. తేడా ఏంటో చూస్తే డిసెంబ‌ర్ 25న వాజ్ పేయి జ‌యంతి. ఈ ఉత్స‌వాలు ఎలా జ‌రుగుతున్నాయి? అదే పీవీ వ‌ర్ధంతి ఎలా జ‌రిగింది? అన్న వ్య‌త్యాసం చూస్తే.. ముందుగా  ఈ ఇద్ద‌రి మధ్యా పోలికలను ఒక సారి గుర్తుచేసుకోవాలి.   అట‌ల్ బీహారీ  వాజ్ పేయి, పీవీన‌ర‌సింహ‌రావు  ఇద్ద‌రిదీ దాదాపు ఒక‌టే వ‌య‌సు అనే కంటే సమకాలీనులు అనడం బెటర్. 1924లో వాజ్ పేయి జన్మించారు.  1921లో పీవీ జన్మించారు. ఇక వీరి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. వాజ్ పేయి 1957లో బ‌ల‌రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి  ఎంపీగా పార్ల‌మెంటులో అడుగు పెట్టారు. అదే ఏడాది పీవీ మంథ‌ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా  గెలిచారు. అట‌ల్ మొద‌టి నుంచి జాతీయ రాజ‌కీయాల్లోనే రాణిస్తూ రాగా.. పీవీ  తొలుత రాష్ట్ర రాజ‌కీయాలలో రాణించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆ తరువాతే కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అట‌ల్, పీవీ ఇద్ద‌రూ  క‌వులే. మంచి వ‌క్త‌లే. అయితే వాజ్ పేయి ప్ర‌సంగాల‌కు వ‌చ్చిన గుర్తింపు పీవీకి రాలేద‌నే  చెప్పాలి. వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం క‌లిగి ఉండ‌టం, అది కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో .. ఆయ‌న వ‌క్తృత్వ ప్రతిభ ప్రజలను ఆకట్టుకుంది.   అట‌ల్ ప్ర‌సంగిస్తుంటే, అంద‌రూ శ్ర‌ద్ధ‌గా  వినేవారు. కోట్లాది  మంది అట‌ల్ ప్ర‌సంగాలకు అభిమానుల‌య్యారు. ఇక్క‌డ అధికార విప‌క్షాల‌న్న  తేడా  క‌నిపించేది కాదు. పీవీ కాంగ్రెస్ లో ఉన్నందు వ‌ల్లో ఏమో ఇందిర ముందు మ‌రే నాయ‌క‌త్వం ఎద‌గ‌డానికి వీలు లేని ప‌రిస్థితుల మ‌ధ్య 1991 త‌ర్వాత మాత్ర‌మే పీవీ ప్ర‌సంగాలు ఎక్కువ‌గా వెలుగులోకి వ‌చ్చాయి.   ఇక్క‌డ ఈ ఇద్ద‌రికీ  మ‌ధ్య గ‌ల మ‌రో పోలిక ఏంటంటే.. వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా  ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే..   పీవీ  నాన్ గాంధీ  కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి  ఏలి రికార్డు సృష్టించారు. ఈ విషయంలో  ఇద్దరూ కూడా చరిత్ర సృష్టించారు.  వాజ్ పేయిని ఆయ‌న పార్టీ  ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టికీ త‌మ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే పీవీ ప‌రిస్థితి అలా లేదు. ఆయ‌న‌కు పార్టీ ఇచ్చిన  గౌర‌వం అంతంత  మాత్ర‌మే. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజపేయి మరణించారు. ఆయనకు ఆయన పార్టీ అంతా ఒక్కటై ఘన నివాళులర్పించింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా  వాజ్ పేయి అంతిమ యాత్రలో పాల్గొని  4 కిలో మీటర్లు నడిచారు. ఆయన పాడె మోశారు.   ఇక పీవీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పీవీ నరసింహారావు మరణించారు.  డిశంబర్ 23, 2004న ఆయన మరణించిన సమయంలో  ఆయన అంతిమ సంస్కారానికి పార్టీ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో మరణించినా, పార్టీ కార్యాలయంలోనికి ఆయన పార్థీవదేహానికి ప్రవేశం లేకుండా పోయింది. ఇక అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించారు.   అట‌ల్ బిహారీ వాజ్ పేయి జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ అమ‌రావ‌తిలో ఆయ‌న స్మృతివ‌నం ఏర్పాటు చేయ‌డంతో పాటు.. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తున్నారు.. ఈ కార్య‌క్ర‌మానికి మాధ‌వ్ వంటి బీజేపీ నేత‌ల‌తో పాటు.. ఏపీ  సీఎం చంద్ర‌బాబు  స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా.. ఇప్ప‌టికే ధ‌ర్మ‌వ‌రం నుంచి ఏలూరు వ‌ర‌కూ ప‌లు ప్రాంతాల్లో అట‌ల్ జీ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లు చేశారు. అట‌ల్- మోడీ సుప‌రిపాల‌నా  యాత్ర సైతం నిర్వ‌హించి అట‌ల్    ప్రేమాభిమానాలు కురిపించారు. కానీ పీవీ విష‌యంలో   ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా  ఖ‌ర్గే చిన్న ట్వీట్ తో స‌రిపెట్టారు. ద‌టీజ్ డిఫ‌రెన్స్ బిట్వీన్ కాగ్రెస్ అండ్  బీజేపీ  అంటూ ప‌లువురు ఈ వ్యత్యాసాల‌ను ఎత్తి చూపుతున్నారు.  

అమరావతిలో వాజ్ పేయి విగ్రహం.. ఆవిష్కరించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్   రాజధాని అమరావతిలో   మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు గురువారం (డిసెంబర్ 25) ఆవిష్కరించారు.  డిసెంబర్ 25న వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని వెంకటపాలెంలో చంద్రబాబు ఆవిష్కరిం చారు. రాజకీయాలలో అజాతశత్రువుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి విగ్రహాన్ని అమరావతిలో తొలి విగ్రహంగా నెలకొల్పడం.. ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.   వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాలలొ భాగంగా ఆయన జయంతి రోజున  వెంకటపాలెంలో  వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. వాజ్ పేయితో తనకు ఉన్న అనుబంధాన్ని నమరువేసుకున్నారు. వాజ్ పేయి హయాంలో ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అందించిన సహాయ సహకారాలను గుర్తు చేసుకున్నారు.  14 అడుగుల ఎత్తులో  అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి  కేంద్ర మంత్రులు భూపతి శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్,  శివ రాజ్ సింగ్ చౌహాన్, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  

క‌ర్ణాటకం.. ఎండ్ లెస్!

కొండంత రాగం తీసి కూసింత పాట పడిన సామెతలా తయారైంది క‌ర్ణాట‌క అధికార  మార్పు వ్య‌వ‌హారం. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా డీకే శివ‌కుమార్  తనకు సీఎం పీఠం కోసం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేశారు. అధిష్టానం ఓకే అంటే  త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఏ విష‌యం త్వ‌ర‌గా తేల్చండ‌ని సీఎం సిద్ద‌రామ‌య్య సైతం అన్నారు.  ఈ నాన్చుడు ధోర‌ణి ప్రభావం పాల‌న‌పై ప‌డ‌కూడ‌ద‌ని సిద్దరామయ్య చెప్పారు.  కొంత కాలం పాటు బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి  స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు.  క‌ట్ చేస్తే ఏదో  అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా  క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.  అయితే దీనికి సంబంధించి ఢిల్లీ  క‌ర్ణాట‌క భ‌వ‌న్ లో జ‌రిగిన మీడియా సమావేశంలో డీకే విలేకరులు  సంక్రాంతి త‌ర్వాత చ‌ర్చ‌లు ఉంటాయట నిజమేనా అని అడిగారు. దీనికి డీకే ఒకింత అసహనం, మరింత ఘాటు కలగలిపిన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం మార్పునకు సంబంధించిన చర్చలు  మీడియాలో త‌ప్ప మా మ‌ధ్య జ‌ర‌గ‌డం లేద‌న్న డీకే.. అక్కడితో ఆగకుండా,   అన్ని విష‌యాలు  చెప్పుకునేవి కావ‌ని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కర్నా టక సీఎం మార్పు వ్యవహారం  ముగిసిపోయిందా? అన్నచర్చ జోరందుకుంది. దానికి తోడు డీకే మ‌రి కొన్ని కీల‌కమైన  కామెంట్లు కూడా చేశారు. త‌న‌కు అధికారం క‌న్నాకాంగ్రెస్  కార్య‌క‌ర్త‌గా ఉండట‌మే ఎక్కువ ఇంట్ర‌స్టన్నారు. 80వ దశకం నుంచీ  తానిలాగే హ్యాపీగా ఉన్నానన్నారు. తామంతా అంటే, డీకే, సిద్ధూ, ఇత‌ర కార్య‌క‌ర్త‌లంద‌రం క‌ల‌సి కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డానికి  కృషి చేశామ‌నీ.. అలాగ‌ని అధికారంలో భాగ‌స్వామ్యం కావాల‌ని తాను కోరుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి రాహుల్ రాగానే ఆయ‌న్ను వెళ్లి ఇబ్బంది పెట్ట‌లేన‌ని కూడా ముక్తాయించారు.  దీనంత‌టిని బ‌ట్టిచూస్తే డీకే త‌న త‌ర‌ఫు అటెంప్ట్ లు అన్నీచేసి ఫలితం కోసం వేచి చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ పార్టీ ప‌ర‌మైన ఆటంకాలేంట‌ని చూస్తే సిద్ధూని తొలగిస్తే ఒక స‌మ‌స్య‌. ఆయ‌న వ‌ర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా సామాజిక వ‌ర్గాలు పార్టీప‌ట్ల వ్య‌తిరేకత‌ను పెంచుకుంటాయి. ఇక డీకేని నిర్ల‌క్ష్యం చేస్తే.. క‌ష్ట‌ప‌డ్డ వారికి అంద‌లం ద‌క్క‌ద‌న్న సంకేతం వెళ్తుంది. దీంతో అధిష్టానం కూడా సందిగ్దావ‌స్థలో ఉన్నట్లు తెలుస్తోంది.

మాటకు కట్టుబడి.. పవన్ ఇప్పటం పర్యటన

మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.  విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు.  బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్  క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు.  నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు. 

మాజీ మావోల కొత్త పొలిటికల్ పార్టీ?

ఆయుధాలను విసర్జించి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఆరు వేలకు పైగానా ఉంటుంది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వారు ఆయుధాలు విడిచి లొంగిపోవడమే కాకుండా, ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ప్రకటించడమే కాకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శాంతియుత మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయంగా ముందుకు వెడతామని ఆయన అన్న మాటలు మాజీ మావోయిస్టులు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న చర్చకు దారి తీసింది.  లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ల పల్లి వాసుదేవరావు తదితరుల నేతృత్వంలో ఒక కొత్త రాజకీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని పరిశీలకులు సైతం వారి ప్రకటనలు ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే వీరు ఏర్పాటు చేసే కొత్త రాజకీయ పార్టీ పని చేసే అవకాశాలున్నాయంటున్నారు.  ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.   మరో సారి ఆయుధాలు చేపట్టే ప్రశ్నే లేదన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటామని విస్పష్టంగా చెప్పారు.  ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక అగ్రనేతలు సహా దాదాపు ఆరువేల మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగుబాటు తరువాత కూడా వీరంతా ఒకరితో ఒకరు టచ్ లోనే ఉణ్నారంటున్నారు. పైగా లొంగిపోయిన వారంతా ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో పోలీసు కేంద్రాలలోనే ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత వీరంతా జనజీనవ స్రవంతిలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల మాటలు మాజీ నక్సల్స్ కోత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగేలా చేశారు.  మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రారంభిస్తే.. వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? గతంలో తిరస్కరించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి అనుగుణంగా వీరు తమ సిద్ధాంతాలకు ప్రజలలో ఎలా ప్రాచుర్యం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిందే. 

దానం నాగేందర్ రాజీనామాకు రెడీ అయిపోయారా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  అనర్హత వేటుకు సిద్ధమైపోయారా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి.. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై  అనర్హత వేటు వేలాడుతోంది. మామూలుగా  పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆధారాల సేకరణకు సమయం పడుతుంది. అయితే దానం విషయంలో  మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే   కోర్టులో , అలాగే  స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో లేననీ, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టేశారు. అంతే కాంకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో 300 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అనర్హత వేటుకు సిద్ధమైపోయారా, లేక నేడో రేపో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్న చర్చ ప్రారంభమైంది.   ఇలా ఉండగా పరిశీలకులు మాత్రం దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే వరకూ ఆగకుండా అంతకు ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యం.  అప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎన్నికవ్వాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.  

ఫోన్ టాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కొత్త సిట్ చేపట్టిన తరువాత కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సిట్ చేతికి చిక్కిన ఒక పెన్ డ్రైవ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.  ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు బావిస్తున్నాయి.  మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు.   ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్   ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పదేపదే మాజీ డిజిపి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రస్తావిం చడంతో అప్పటికే సిట్ అధికారులు మాజీ డిజిపి ని విచారణ చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అలాగే  ఫోన్ టాపింగ్ రివ్యూ కమిటీ లో సభ్యులైన మాజీ  సిఎస్ లు సోమేష్ కుమార్, శాంత కుమారి ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రి లను కూడా  విచారించారు. ఇక  మంగళవారం  ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తున్నది.   ఇక బుధవారం(డిసెంబర్ 24) సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన  పెన్ డ్రైవ్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నది.  ఈ కేసుకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్  కీలక ఆధారంగా మారను న్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన పదవీకాలంలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన కీలక వివరాలను ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ఉంచినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా  రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్స్ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారిస్తున్నట్లు  తెలుస్తోంది.  సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ఫోన్ టాపింగ్ గురైన ఫోన్ నెంబర్ల ను ఇప్పటికే  గుర్తించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం కొనసా గుతున్న సమయంలో పోలీసుల చేతికి చిక్కకుండా ప్రభాకర్ రావు టీమ్ అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా కూడా ఈ పెన్ డ్రైవ్ ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి చిక్కడం దర్యాప్తులో కీలక మైలురాయిగా మారింది. ఈ కేసు ఛేదించడానికి  పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికా రులు చెబుతున్నారు.  ప్రభాకర్ రావు నుండి ఇంకా పూర్తి వివరాలు సేకరించేందుకు ఎల్లుండి వరకూ  విచారించడానికి సమయం ఉందని అధికారులు తెలిపారు.  

ప్రధాని పదవికి రాహుల్ అనర్హుడా?.. రాబర్ట్ వధేరా మాటల ఆంతర్యమేంటి?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సొంత కుటుంబం నుంచే వ్యతిరేక సెగ తగులుతోందా? ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత ఇండీ కూటమి నేతలు రాహుల్ నాయకత్వంపై ఒకింత ఆసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు నేతలు రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాహుల్ సొదరి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధేరా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేరుగా రాహుల్ పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి త‌న భార్య, వ‌య‌నాడ్‌  ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాల‌ంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెను చీలికకు దారి తీసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.    రాబర్ట్ వధేరా.. ప్రియాంక వధేరా లోక్ సభలో బలమైన గళం వినిపించారనీ,  ఆమెకు ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయనీ అన్నారు. అక్కడితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తేనే దేశంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని, అప్పుడే దేశంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగలుగుతుందనీ రాబర్ట్ వధేరా అన్నారు.  లోక్ సభ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే  కొందరు  ఎంపీల నంచి కూడా వచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రాబర్ట్ వధేరా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమనీ, వాటితో పార్టీకి సంబంధం లేదంటూ కొందరు సీనియర్లు వివాదం పెరగకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రియాంక వధేరా గాంధీ అయితే, తన భర్త వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనం వహించారు.  దీనిపై రాహుల్ ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.