వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్

 

అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోంది.  పెదకూరపాటు సెగ్మెంట్ అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మూడు గ్రామాల్లో 25 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తైందని చెప్పుకొచ్చారు. అమరావతి మండలం కర్లపూడిలో మంగళవారం (13-1-26) రోడ్డు పనులకు మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు.  

ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు కోరారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి.. కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. కర్లపూడి నుంచి అనంతవరం వరకు.. 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూములిచ్చిన రైతులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. 

ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోగా 80 శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రవీణ్ చెప్పారని అన్నారు. 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి, టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.

తిరుమలలో ఘనంగా భోగి వేడుకలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

తిరుమలలో   భోగి పండుగ సందర్భంగా బుధవారం ( జనవరి 14)   వేకువజామునే ఆలయం ముందు అర్చకులు, సిబ్బంది భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు.   ఉత్తరాయణంలో మొదటిగా వచ్చే పండుగ భోగి.  ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఆలయం ముందు భోగి మంటలు వేసి  భోగి వేడుకల్లో భక్తులను   భాగస్వాములు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే బుధవారం (జనవరి 14) భోగి సందర్భం  మహా ద్వారానికి ముందు భోగి మంటలు వేసి వేడుక నిర్వహించారు. అలాగే  టీటీడీ చైర్మన్  బి.ఆర్. నాయుడు  తిరుమలలో భోగి పండుగ జరుపుకున్నారు.  తిరుమలలోని తన  క్యాంపు కార్యాలయంలో సిబ్బందితో కలిసి చైర్మన్ భోగి పండుగను జరుపుకున్నారు. భోగి వేడుకలు నిర్వహించారు. ీ సందర్భంగా ఆయన భోగి పండుగ అందరికీ  భోగ భాగ్యాలు అందించాలని  ఆకాంక్షించారు. 

ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్ర.. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాశుళంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మన తరువాతి తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే భాద్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని పిలుపునిస్తూ ప్రజలకు   భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.   కూటమి సర్కారు ప్రజారంజక పాలనలో ప్రతీ పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని, ప్రతీ ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్న ఆయన  పుట్టిన ఊరికి పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బందులు లేని వ్యవసాయాన్ని అన్నదాతలు చేస్తున్నారని, ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ఎలాంటి జాప్యం, ఇతరుల ప్రమేయం లేకుండా సక్రమంగా చెల్లింపులు సత్వరం జరుగుతున్నాయనీ, ప్రధాని మోదీ తోడ్పాటుతో ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చే కీలక ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.   భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ కన్నా ముందే ప్రారంభిస్తామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. దానికి అనుసంధానంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి సరికొత్త ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.  

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా భోగి వేడుకలు

ఉభయ తెలుగు రాష్ట్రాలలో  భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి సంబరాలకు నాందిగా భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బుధవారం (జనవరి 14) తెల్లవారు జామునే ఇళ్ల ముందు భోగి మంటలు వేసి, భోగి పాటలు పాడుతూ సందడి చేశారు.  గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో మునిగిపోయారు.  ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.   అలాగే ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొంటుండటంతో తెలుగు రాష్ట్రాలలో  ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భోగి వేడుకలు సందడిగా జరిగాయి. పలు ప్రాంతాల్లో భోగి వేడుకల్లో ఏపీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో  జరిగిన భోగి సంబరాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని సందడి చేశారు.   

రేపే మేడారం మహా జాతర... భారీగా ఏర్పాట్లు

  మేడారం మహా జాతరకు తొలి ఘట్టం రేపు జరగనుంది. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి సంకేతంగా గుడిమెలిగే (శుద్ది పండుగ) క్రతువును పూజారులు నిర్వహించనున్నారు. పూజారులు తమ ఇళ్లతో పాటు మేడారంలోని వనదేవతల గద్దెలను శుద్ది చేస్తారు. అనంతరం అడవికి వెళ్లి గుట్ట,పుట్ట మట్టిని సేకరించి, గద్దెలకు చేరుకోని అలుకుపూతలు నిర్వహిస్తారు. దీంతో జాతర మొదలైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. మేడరం భక్తుల కోసం "MyMedaram" పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు.  7658912300 నంబర్‌కు మేసేజ్ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చును. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనంగా వసూలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. మరోవైపు  జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్  రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు.  తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు.     ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని సీతక్క వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.  

తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

  సంక్రాంతి సందర్బంగా గ్రామ పంచాయితీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్దిక శాఖ విడుదల చేసింది. ఈ సందర్బంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా రిలీజ్ చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానా : సుప్రీం కోర్టు

  వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. వీధి కుక్కల అంశంపై  సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  తాజాగా దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.  కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.  ఈ సందర్భంగా వీధికుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే.. అప్పుడు ఎవన్ని దానికి బాధ్యుల్ని చేయాలని ప్రశ్నించింది.  వీధికుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని, లేదంటే కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలపై తాము నిర్ధేశించే భారీ పరిహారాలను చెల్లించాని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  

మ్యాచ్‌ల వేదికలపై బీసీబీ వినతులకు ఐసీసీ నో

  బంగ్లాదేశ్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్‌ నుంచి తరలించాలనే బంగ్లా క్రికెట్‌ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ అంగీకరించే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని ఐసీసీ సూచన ప్రాయంగా వెల్లడించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భద్రతా నిపుణులతో ఐసీసీ రిస్క్‌ అంచనా విభాగం సర్వే చేయించింది. భారత్‌లో బంగ్లా మ్యాచ్‌లకు ముప్పు వాటిల్లే పరిస్థితి లేదని ఆ నిపుణులు తేల్చారని ఐసీసీ సోమవారం ప్రకటించింది. మొత్తంగా టీ20 వరల్డ్‌ కప్‌నకు భారత్‌లో రిస్క్‌ తక్కువగా, పరిమితంగా ఉందని నిపుణులు తేల్చారని, ప్రపంచ స్థాయి టోర్నీల భద్రత ప్రొఫైల్‌ ఇలాగే ఉంటుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.  భారత్‌లోని ఏ వేదిక వద్దా బంగ్లాదేశ్‌ అధికారులకు సైతం ఎలాంటి ముప్పు లేదని నిపుణులు నిర్ధారించినట్టు సమాచారం. ఐపీఎల్‌లో కేకే‌ఆర్ నుంచి  స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు తొలగించడం బంగ్లాదేశ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. భారత్‌లో బంగ్లాదేశ్ వ్యతిరేక భావనలు ఉన్నాయని, కాబట్టి తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరుతుంది

అగ్నిప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించండి : సీఎం చంద్రబాబు

  కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 26 గిరిజన గుడిసెలు పూర్తిగా కాలి బూడిద కాగా, 33 కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు ఒక్కసారిగా సర్వం కోల్పోయి తీవ్ర ఆందోళనలో మిగిలిపోయాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.25,000 చొప్పున నగదు అందించడంతో పాటు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం, అవసరమైన సాయాన్ని కల్పించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వపు పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ ఎస్.వి. నరేశ్ మాట్లాడుతూ, 33 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు సహాయం పంపిణీ చేసినట్టు తెలిపారు. బాధితులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఆహారం, నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

గ్రీన్‌లాండ్ విలీనానికి అమెరికా సెనెట్‌లో బిల్లు

  డెన్మార్క్ దేశంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లు ప్రవేశపెట్డాడు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకోవడానికి ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ అభిప్రాయపడ్డాడు.  అమెరికా విరోధులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అలా జరగనివ్వబోమ్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాలను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వ్యాఖ్యానించారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరకా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్ నుంచి దూరం చేయడానికి అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయడానికి ప్రయత్నించారని ప్రచారం జరిగింది.   అయితే యూఎస్ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్  స్పష్టం చేశారు. నాటో దేశాలు సైతం యూఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా వెనకడుగు వేయని ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనానికి పావులు కదుపుతూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.