నన్ను చంపేయాలనుకుంటున్నారా..?
posted on Nov 29, 2016 @ 9:54AM
ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవరు ఎంత కవ్వించినా సహనం కోల్పోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని చెప్పవచ్చు. ఎప్పుడూ శాంతంగా చిరునవ్వుతో కనిపిస్తారు ఆయన. అలాంటి నితీశ్ ఇవాళ ఉగ్రరూపం దాల్చారు. అది కూడా జర్నలిస్టుల మీద. నోట్ల రద్దుపై ప్రధాని మోడీకి మద్ధతిచ్చిన అతికొద్ది మందిలో బీహార్ సీఎం ఒకరు. ప్రధాని నిర్ణయం చాలా గొప్పదని మంచి ఫలితాలు వస్తాయని నితీశ్ బహిరంగంగా చెప్పారు. ఈ క్రమంలో బీహార్ ప్రభుత్వ భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం నోట్ల రద్దుని వ్యతిరేకించారు.
నితీశ్ నోట్ల రద్దుకు మద్ధతు ఇవ్వడంతో బీజేపీ నేతలు ఆయన్ను ఆకాశానికేత్తేస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ అసెంబ్లీ ఆవరణలో కొందరు జర్నలిస్టులు సీఎం నితీశ్‌ను నోట్లరద్దుపై కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ మధ్య మోడీకి బాగా దగ్గరవుతున్నారు..ఎన్డీఏకు బాహాటంగానే మద్దతిస్తున్నట్లున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన నితీశ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నన్ను పనిగట్టుకొని రాజకీయంగా నన్ను హత్య చేసే కుట్ర. దీని వల్ల మీకొచ్చేదేంటి.. ఇది జర్నలిజం కాదు..ఎల్లో జర్నలిజం. అదే బీహార్ కాకుండా మరో రాష్ట్రంలో అయితే అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టి జైలుకు పంపేవాడిని. అయితే తాను ప్రజాస్వామ్యవాదినని అలాంటి పనులు చేయను అని చెప్పారు.