అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం
posted on Jan 22, 2014 @ 9:32AM
వెండితెర మీద మరో శకం ముగిసింది.. ఎన్నో అజరామర చిత్రాలు, అపురూప పాత్రలతో వెండితెర మీద తనదైన నటనను ప్రదర్శించిన సినీనట శిఖరం అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు.. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్న అక్కినేని మంగళవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు..
అక్కినేని ఈ నాలుగు అక్షరాలు వింటే చాలు తెలుగు ప్రేక్షకుడి హృదయంలో ఒక ఆనందపు పిల్లతెమ్మెర ప్రత్యక్షమవుతుంది. ఆపేరును తలుచుకుంటేనే చాటు ప్రపంచంలోని విషాదమంతా ప్రేక్షకుల గుండెల్ని పలకరించి వెలుతుంది.. ఆయన డైలాగులు. ప్రేక్షకుల మనోరంజనాలు. ఆయన డ్యాన్సులు తెలుగు సినిమాకు మేలిమలుపులు, ఆయన నటన తెలుగు సినిమాకు ఓ నిఘంటువు..
ఒక బాలరాజు, ఒ దేవదాసు, ఒక విప్రనారాయణ, ఒక దసరాబుల్లోడు. ఒక భక్తతుకారం, ఒక దొంగరాముడు, ఒక డాక్టర్ చక్రవర్తి, ఒర మహాకవి క్షేత్రయ్య.. ఇలా ఆ మహానటుని నట ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు.. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలకు జీవం పోసిన మహానటుడు అక్కినేని
తెలుగు సినీ జగత్తుకు చిరపరిచితమైన పేరు అక్కినేని తెలుగు సినిమా నటనకు ఆయన అభినయం ఓ అలంకారం, తెలుగు సినిమా పాత్ర పోషణకు ఆయన కదలిక ఓ సంచలనం.. తెలుగు సినిమా నృత్యాలకు ఆయన స్టెప్పులు ఓ ఉత్తేజం. ఆయన గొంతు భావోద్వేగాల సంచలనం.. మొత్తం తెలుగు సినిమా గమనానికి ఆయన జీవితం ఓ సాక్ష్యం
కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో ఉన్న ఓ చిన్న గ్రామం రామాపురం.. 80 ఏళ్ల క్రితం ఆ పక్కగ్రామానికి కూడా సరిగా తెలియని ఈ ఊరు ఇప్పుడు మాత్రం ప్రపంచ పటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగు సినిమా భవిష్యత్తును శాసించగలిగే ఓ మహానటున్ని వెండితెరకు అందించిన ఆ గ్రామం తెలుగు కళామతల్లికి తన వంతు సేవ చేసింది..
వెండితెర మీద మహానటునిగా ఎదగాల్సిన అక్కినేనిని బడిలో పుస్తకాల మధ్య కూర్చోటానికి విధి కూడా ఒప్పుకోలేదు అందుకే చిన్న వయసులోనే నటన మీద ఉన్న ఆసక్తితో నాటకాలు వేయడం ప్రారంభించారు అక్కినేని.. ఆ అనుభవమే ఆయన్ను వెండితెర వైపు నడిపించింది..
1940లో 17 ఏళ్ల వయసులోనే ధర్మపత్ని సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు అక్కినేని నాగేశ్వరరావు.. తరువాత పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆయన 1944లో సీతారామ జననం సినిమాతో హీరోగా మారారు.. హీరోగా నటించిన తొలి చిత్రంలోనే శ్రీ రామునిగా నటించి మెప్పించారు అక్కినేని..
తొలి సినిమాతోనే అపూర్వ విజయం అందుకున్న అక్కినేని తరువాత వరుసగా బాలరాజు, కీలుగుర్రం లాంటి సినిమాలతో తిరుగులేని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.. రెండు వందలకు పైగా చిత్రాల్లో ఎన్నో అపురూప పాత్రలతో తెలుగు సినిమా కళామ తల్లికి నటనా సత్కారం చేశారు అక్కినేని..
సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు సినిమా తెరపై నటనకు నవ్యభాష్యాన్ని తెలిపాయి.. ముఖ్య భగ్న ప్రేమికుడిగా ఆయన పొషించిన పాత్రలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. లైలా మజ్ను, దేవదాసు లాంటి సినిమాల్లొ ఆయన నటకు ప్రేక్షకులు కనక వర్షమే కురిపించారు..
ముఖ్యంగా 1953లో రిలీజ్ అయిన దేవదాసు సినిమా అక్కినేని నట ప్రస్థానంలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు.. శరత్‌చంద్ర ఛటర్జీ రాసిన దేవదాసు పాత్రను ఎంతో అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన అక్కినేని ఆ పాత్రను తరువాత ఎవరు పోషించిన ఆయన పరభాషా నటులతో కూడా భేష్ అనిపించుకున్నారు,...
కేవలం ప్రేమికుడిగానే కాదు.. వెండితెర మీద మహా భక్తునిగా కూడా ఆయన అద్భుత నటనను ప్రదర్శించారు.. స్వతహాగా నాస్తికుడు అయిన అక్కినేని తెర మీద మాత్రం మహాభక్తునిగా ఎన్నో పాత్రలకు తన అద్భుత నటనతో జీవం పోశారు..
వెండితెరకు బంగారు మెరుగులు దిద్దిన మహానటుడు ఏయన్‌ఆర్. ఆయన ఒక నటవిశ్వరూపం. ప్రతీ పాత్ర పోషణలో ఆయన తీసుకునే జాగ్రత్తలు ..ఇన్నాళ్ల నట ప్రస్థానంలో ఆయన ప్రతీ నిమిషం పాటించిన క్రమ శిక్షణ ..వృత్తిపరమైన ప్రేమ...ఆయన్ను మహోన్నత సినీ శిఖరంలా నిలబెట్టాయి.
అక్కినేని సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో గెలుపు ఓటములు చూశారు. ఓడిన ప్రతీసారీ కొత్త పాఠం నేర్చుకుని...గెలిచిన ప్రతీసారి తనను తాను కొత్తగా మలుచుకుని ..నిత్యవిద్యార్ధిలా జీవితంలో ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నటుడిగా...నిర్మాతగా ఆయన ప్రదర్శించే నియమ నిబద్ధతలు సినీ ఇండస్ట్రీకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.
ఒక నటుడిగా ఎదిగి..ఒక మనిషిగా ఒదిగి...ఎదిగే కొద్ది ఒదగమనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా అనిపిస్తారు...అక్కినేని. రొమాంటిక్ కింగ్...ట్రాజెడీ కింగ్ ..నట సమ్రాట్ ..ఇలా ఎన్నో బిరుదులు ఆయన్ని వరించాయి. 1980లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న అక్కినేని...దానికి ముందే పద్మశ్రీ...ఆ తర్వాత పద్మభూషణ్ ..అటు తర్వాత దాదా ఫాల్కే... పద్మవిభూషణ్ ..ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతీ అవార్డును అందుకున్నారు...మన అక్కినేని,
నటన మీద ఉన్న మక్కువ తో 90 ఏళ్ల వయసులో కూడా మనం సినిమాలో నటించటానికి అంగీకరించారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన ఆరోగ్యం సహకరించకపోవటం ఆ షూటింగ్‌కు విరామం ప్రకటించారు..
అయితే వెండితెర మీద తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న అక్కినేని తెలుగు ప్రజలను, సినీ అభిమానులను దిగ్‌బ్రాంతికి గురి చూస్తూ తిరిగిరాని లోకాలకు తరళిపోయారు.. పసివయసులోనే నటినిగా మారిన ఆయన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు..