Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 32

    "వాడిని అందుకే ఆపేశాను. కానీ మళ్ళీ ఎలా లోపలికొచ్చాడో తెలీటంలేదు సార్. ఏయ్! ఎలా వచ్చావ్ రా లోపలకి?" మీదకు లాఠీతో వస్తూ అడిగాడు.

    "ఎలాగోలా వచ్చాను-ఇప్పుడదంతా ఎందుకు?"

    అతను రాజశేఖరం మెడమీద చేయివేసి బయటకు ఒక్క తోపు తోశాడు.

    రాజశేఖరం స్ప్రింగ్ డోర్ కి కొట్టుకుని బయటపడ్డాడు.

    ఈలోగా మరో ఇద్దరు ముగ్గురు ప్యూన్లు వచ్చి రాజశేఖరాన్ని లేపి బయటకు తోసుకెళ్ళారు.

    రాజశేఖరం వాళ్ళమీద తిరగబడినా ప్రయోజనం లేకపోయింది.

    రోడ్డుమీదకు విసురుగా వచ్చి పడ్డాడు.

    అతనికంతా అయోమయంగా వుంది.

    అవతలి వ్యక్తులు అంత రఫ్ గా, క్రూయెల్ గా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావటం లేదు. ఈసారి పెద్ద పెద్ద ఫరమ్స్ లోకి వెళ్ళడానికి మనస్కరించలేదతనికి.

    ఆ పక్కనే వున్న హోటల్లోకి నడిచాడతను.

    కనీసం సప్లైర్ గా వుద్యోగం చేసినాముందు తను పొట్ట గడుపుకోవచ్చు.

    మేనేజర్ అతనివంక దొంగని చూసినట్లు చూస్తున్నాడు.

    "ఏయ్! ఏం కావాలి?"

    "ఇక్కడేదయినా వుద్యోగం...."

    "ఏంలేదు ఫో"

    "ఎక్కువ జీతం అఖ్ఖర్లేదు-అదీ మూడు నెలలు చాలు"

    "ముందు పోతావా, గెంటించమంటావా?"

    గెంటించుకోకుండానే బయటికొచ్చేశాడు.


    మరికొంత దూరం నడిచే సరికి ఓ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో చాలా మంది కూలీలు గోడౌన్ లో నుంచి లారీల్లోకి పెద్ద బస్తాలు లోడ్ చేస్తూ కనిపించారు.

    ఒకవేళ ఆ పని యిస్తారేమో?

    తనకు అలవాటులేని పనే అయినా ఎలాగోలా తంటాలు పడితే నాలుగు డబ్బులు రావచ్చు.

    ట్రాన్స్ పోర్ట్ కంపెనీ మేనేజరు దగ్గరకు నడిచాడతను.

    "మీ దగ్గర కూలీపని చేద్దామని డిసైడ్ చేశాను. ఇస్తారా?"

    "అనుభవముందా?"

    లేదంటే పనివ్వరని భయమేసింది.

    "ఉంది!"

    "అయితే చేసుకో ఫో"

    "కూలీ ఎంతిస్తారు?"

    "మామూలుగా అయితే రోజుకి నలభై. సగం రోజయిపోతోంది కాబట్టి నీకు ఇరవై యిస్తాను."

    రాజశేఖరానికి ఆనందం కలిగింది.

    కష్టపడేవాడికి తిండికెప్పుడూ లోటుండదన్న తన అభిప్రాయం కరక్టే. మరా స్లమ్ లో వాళ్ళందరూ ఇలా కష్టపడి ఎందుకు పని చేసుకోరు?

    బస్తాల దగ్గరకు నడిచాడతను.

    బస్తాల మీద నిలబడి వరుసగా కూలీల భుజం మీదకు బస్తాలు ఎత్తుతున్నాడో వ్యక్తి.

    రాజశేఖరం కూడా వెళ్ళి వెనక్కు తిరిగి నిలబడ్డాడు.

    అతను బస్తా తీసి రాజశేఖరం భుజంమీదకు నెట్టాడు.

    రాజశేఖరం ఆ బరువు మోయలేక అమాంతం దానితోపాటే నేల మీద పడిపోయాడు. బస్తా అతని వీపు మీద పడింది.

    చప్పున నలుగురు కూలీలు వచ్చి బస్తా తీసి అతనిని లేపి నిలబెట్టారు.

    "ఏయ్! మోయలేనోడివి నీకెందుకురా ఇలాంటి పనులు, తేలిక పనులు చేసుకో ఫో" మేస్త్రి అన్నాడు.

    రాజశేఖరం కుంటుతూ బయటకు నడిచాడు.

    బస్తాలు అంత బరువుంటాయనీ, వాటిని మోయటం అంత కష్టమనీ తెలీదు. కానీ తన ఫ్యాక్టరీలోనే వాటిని అందరూ మోయటం చూసి చూసి అది చాలా తేలికన్న అభిప్రాయం కలిగింది. అందుకే రిస్క్ తీసుకున్నాడు.

    కాళ్ళు ఆ బస్తా బరువుకి బెణికినట్లయిపోయింది.

    ఏదయినాగానీ అనుభవంమీదే తెలుస్తుంది.

    ఈ రోజు నుంచీ ప్రాక్టీస్ చేస్తే బహుశా ఓ నెల రోజుల్లో తను బస్తాలు మోయగలడు.

    తన చాంబర్ టేబుల్ మీద పెట్టిన ఓ వైల్డ్ లైఫ్ ఫోటోకున్న కాప్షన్ గుర్తుకొచ్చిందతనికి.

    "ALL THE THINGS ARE DIFFICULT BEFORE THEY ARE EASY" అని వుంది దానిమీద.

    అందులో ఓ పెద్దపులి నదిలో దిగటానికి ప్రయత్నిస్తోంది.

    అందులో ఎంత నిజం వుందో యిప్పుడు తెలుస్తోంది.

    ముందు ఏ పనయినా కష్టమనే అనిపిస్తుంది.

    అది మానవత్వం!

    ఏం చేయడానికీ తోచటం లేదతనికి. ఇలాగే ఇంకాసేపు తిరుగుతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం ఖాయం.

    గత్యంతరంలేక మళ్ళీ స్లమ్ వేపు నడవసాగాడతను.

    ఒకవేళ సోనీ ఏమయినా సహాయం చేస్తుందేమో! ఒకపూట భోజనం చేస్తే చాలు మిగతా రోజంతా ఏమీ తినకపోయినా పర్లేదు.

    స్లమ్ వేపు తిరగ్గానే అక్కడ కొంతమంది జనం మూగి కనిపించారు.

 Previous Page Next Page