Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 9

                                 

 

                                       11

            

    శంకరం పరీక్ష తప్పాడని తెలిశాక విశాఖపట్నం నించి రేవతి ఉత్తరం వ్రాసింది. భగవతిని విశాఖ పంపమనీ, తమదగ్గిర పెట్టుకుని చదివించుతామనీ రాసింది. తమ డబ్బు ఇబ్బందులు తెలుసుకుని పెద్ద కూతురు భగవతిని పంపమని రాసిందని గ్రహించింది శాంతమ్మ. నిజంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సిగ్గు పడితే ప్రయోజనం లేదు. ఇప్పుడు పంపకపోతే అనవసరంగా భగవతి చదువు పాడవుతుంది. భగవతి ఆ ఏడు ఫిప్తు ఫారంలోకి వచ్చింది. అందరిలోకీ చిన్నది. ఆఖరి కూతురు, తండ్రికి ముద్దుల కూతురు అయిన భగవతిని దూరం చేసుకోడానికి మనస్సులో ఎంతో బాధపడింది శాంతమ్మ.
    శంకరం వెళ్ళి సామర్లకోటలో భగవతిని రైలు ఎక్కించాడు. రేవతి, భర్త వచ్చి విశాఖపట్నంలో దింపుకున్నారు.
    భగవతి ఒక్కర్తీ వెళ్ళిపోడంవల్ల ఇంట్లో డబ్బు ఇబ్బందులు ఏమీ తగ్గలేదు. ఆ ఏడు మూడు నెలలు విపరీతమైన ఎండలు కాయడంవల్లేమో ముసలమ్మకి సుస్తీ చేసింది. మందులకి, డాక్టరు ఫీజుకి చాలా ఖర్చుఅయింది. ఇంటి పరిస్థితులే ఆలోచిస్తూ డాబామీద కూర్చున్న చారుమతికి, "అక్కా, నీకు ఉత్తరం వచ్చింది" అంటూ ఒక కార్డు తెచ్చి ఇచ్చింది మాలతి. విజయనగరం నించి గోపాల్ రాశాడు.
    "చారుమతి వదినకు,
    నమస్కారములు. మా ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షా ఫలితాలు తెలిశాయి. నేను పాసయ్యానని రాయడానికి సంతోషిస్తున్నాను. ఇదంతా మామయ్య చలవ, మీ చలవ. దీనికి నేనూ, అమ్మా కృతజ్ఞులం. నాకు ఇక్కడే ఒక వేరుసెనగమిల్లులో గుమాస్తా ఉద్యోగం దొరికింది. రేపు ఉద్యోగంలో చేరుతున్నాను. అమ్మ అత్తకు, అమ్మమ్మకి నమస్కారాలు రాయమంది.
                                                                                   ఇట్లు,
                                                                                  గోపాల్."
    'పోనీలే. ఏదో ఉద్యోగం దొరికింది. ఇతనూ డబ్బు పంపమంటే ఎక్కడినించి తేవడం?' అనుకుంది చారుమతి.
    "ఏమి టంత దీర్ఘాలోచన?" అంటూ డాబా మీదికి వచ్చాడు శ్రీదేవి, పద్మ.
    "ఏమీలేదు. రండి, రండి" అంటూ ఆహ్వానించింది చారుమతి.
    ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. ఏం మాట్లాడాలో, ఎవరు ప్రారంభించాలో తెలియక ముగ్గురూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. పూర్వమైతే "ఆ పుస్తకం చదివావా?", "ఆ కథ ఎలా ఉంది?", "ఈ గేయం బాగుంది కదూ?" అంటూ ముగ్గురూ ఒక్కసారే సాహిత్య చర్చ మొదలుపెట్టేవారు. చారుమతి సంసార బాధ్యతలూ, పద్మ మౌనం శ్రీదేవినికూడా తికమక పెడుతున్నాయి ఇప్పుడు.
    "ఏమిటి విశేషాలు?" చారుమతే మొదలుపెట్టింది సంభాషణ.
    "నువ్వు చెప్పాలి. మాకు విశేషాలు ఏముంటాయి. నేను, పద్మ రోజూ కాలేజీకి వెళ్ళివస్తున్నాం మామూలుగా" అంది శ్రీదేవి.    
    "పద్మా, నువ్వు వేసంగిసెలవులలో మద్రాసు వెళ్ళలేదా? ఏం?" అంది చారుమతి.
    "వెళ్ళలేదు. తను ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్ళారుట" అంది పద్మ. అబద్ధం కావాలనే చెప్పింది అత్తగారుకాని, భర్తకాని తనని మద్రాసు రమ్మంటూ ఒక్క ఉత్తరంకూడా రాయలేదని చెప్పలేక.
    శ్రీదేవి మళ్ళీ చారుమతిని అడిగింది ఇంటి విషయాలు చెప్పమంటూ. 'స్నేహితులకి కాకపోతే ఎవరికి చెబుతాను?' అనుకుంది చారుమతి. ఇంటి విషయాలు ఒకటొకటిగా అన్నీ చెప్పింది శంకరం పరీక్ష తప్పడం, భగవతిని విశాఖపట్నం పంపడం, ముసలమ్మ వైద్యానికైన అప్పు.        
    "ఇప్పుడు మాలతి చదువు పెద్ద సమస్య అయిపోయింది, దేవీ! ఎస్. ఎస్. ఎల్. సి. లోకి వచ్చింది. స్కూలుఫీజుకి హెడ్ మిస్ట్రెస్ కన్సెషన్ ఇస్తానన్నా, పుస్తకాలన్నీ కొనవద్దా? ఈ ఏడు మానిపించేద్దామనుకుంటున్నాను. వచ్చే ఏడాది శంకరం ఉద్యోగంలో చేరితే, మాలతిని చదివించవచ్చును" అంది చివరికి.
    "మాలతిని మానిపించవద్దు. ఈ ఏడాది పూర్తి చేసెయ్యనియ్యి" అంది శ్రీదేవి.
    "ఆలోచిస్తాను. చదువు మానెయ్యమంటే మాలతి చిన్నబుచ్చుకుంటుందేమో!" అంది చారుమతి.
    చారుమతి ఇంటి సమస్యలనే ఆలోచిస్తూ ముగ్గురూ మౌనంగా కూర్చున్నారు.
    "డబ్బు ఎక్కువ ఎలా సంపాదించడం అన్నదే నాకు రాత్రీ, పగలూ ఆలోచన." నవ్వుతూ అంది చారుమతి. అది ఏడవలేక నవ్వినట్టుంది.
    "చారూ! నువ్వు ఏమీ అనుకోనంటే నేనొక సలహా చెబుతాను. మీ ముందరి గది ఎవరికేనా అద్దెకి ఇవ్వకూడదూ? పదిహేను ఇరవై రూపాయలు వస్తాయి" అంది పద్మ.
    "ఆ ఆలోచన బాగానే ఉంది, పద్మా. ఇన్నాళ్ళూ నాకు తట్టనేలేదు"అంది చారుమతి.
    ఆ రాత్రి భోజనాల దగ్గిర చారుమతి ముందు గది అద్దెకి ఇవ్వడం విషయం మిగతావాళ్ళతో చర్చించింది.
    "ముందుగది అద్దెకి ఇస్తే ఎలా? మనందరికీ ఒక్క గది ఎలా సరిపోతుంది?" అన్నాడు శంకరం.
    "నిజమే కష్టమే" అంది చారుమతి, గది అద్దెకి ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ,
    వాళ్ళ ఇంట్లో ఉన్నవి రెండు గదులు. ముందర వీథి గది, దాని వెనక దానికంటే కొంచెం పెద్దగది, వెనక వరండా వరండానీ, వంటిల్లునీ వేరుచేస్తూ చిన్న పెరడు. వంటింటిని ఆనుకుని ఒకపక్క స్నానాల గది. వెనక పాయిఖానాదొడ్డి, ముందరిగదిలో అద్దెకి ఉన్నవాళ్ళు స్నానాల గదికి వెళ్ళాలంటే ఇంటిపక్కనున్న సన్నటి సందుగుండా వెనక పెరడులోకి వెళ్ళాలి. పోతే, ముందు గది అద్దెకి ఇస్తే ఇంటివాళ్ళు ఇంట్లో ప్రవేశించాలన్నా పక్కసందుగుండా లోపలి పెరడువైపు వెళ్ళి, ప్రవేశించాలి. అద్దెకున్నవాళ్ళూ, ఇంటివాళ్ళూ ఇబ్బంది పడాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, అద్దెకి ఇవ్వాలి.
    "మనం కొన్నాళ్ళు కష్టపడాలి. తప్పదు. డబ్బు మనకి అవసరం. నీకు ఉద్యోగం వచ్చేదాకా ఇబ్బంది పడాలి" అంది చారుమతి, శంకరాన్ని చూస్తూ.
    తన ఉద్యోగప్రసక్తి రాగానే మౌనం వహించాడు శంకరం.
    "అద్దెకి ఎవరి కిస్తాం?" అంది భానుమతి.
    "ఎవరికేమిటి? స్టూడెంట్సుకు."
    "స్టూడెంట్సుకీ, బ్రహ్మచారులకీ ఇస్తే మనకి తాటాకులు కడతారు అంతా. వయస్సులో ఉన్న పెళ్ళి కాని అమ్మాయిలని ఇంట్లో పెట్టుకుని, బ్రహ్మచారు లని అద్దెకి పెట్టుకుంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు" అంది శాంతమ్మ.
    "మరి ఎవరి కిస్తాం? ఉదోగస్థులైన, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి ఇవ్వవచ్చును. కాని వాళ్ళు భోజనానికి హోటళ్ళకి వెళ్ళరు. వంటిల్లు కావాలి" అంది చారుమతి ఆలోచిస్తూ.
    అద్దెకి ఎవరిని పెట్టుకోవడం అన్నది సమస్యగానే ఉన్నా, 'ఎవరికేనా గది అద్దెకి ఇస్తే బాగుండును. డబ్బు వస్తుంది' అన్న అభిప్రాయం అందరి మనస్సులలోను ఉండిపోయింది.
    అన్నీ సమస్యలుగానే ఉండిపోయాయి. 'మాలతి చదువు ఏం చెయ్యడం?' మధనపడింది చారుమతి.
    రెండు రోజుల తరవాత చారుమతి స్కూలునించి ఇంటికి వచ్చేసరికి, మాలతి కొత్తపుస్తకాల దొంతర ఒకటి తెచ్చి అక్కముందర పెట్టింది. స్కూలు ఫైనల్ క్లాసు పాఠ్యపుస్తకాలు, నోట్సులు రాసుకో డానికి బౌండు నోటు పుస్తకాలు ఉన్నాయి అందులో.
    "ఎక్కడివి?" అంది ఆశ్చర్యంగా చారుమతి.
    "శ్రీదేవి పంపించింది. ఇదిగో, ఈ ఉత్తరం కూడా పంపింది" అంటూ చిన్న కాయితం ఇచ్చింది. రెండే పంక్తులు రాసిఉన్నాయి.
    "ప్రియమైన చెల్లెలు మాలతికి,
        ప్రేమతో అక్క శ్రీదేవి."
    చారుమతికి కోపం వచ్చింది. తను లేమి తలుచుకుని దుఃఖం వచ్చింది. వెంటనే శ్రీదేవి ఇంటికి వెళ్ళింది. శ్రీదేవి జాజిపూలు మాల కడుతూ ఉంది.
    "ఇలాగేనా అవమానించడం?" అంది చారుమతి, లోపలికి వస్తూనే.
    "అవమానించడం ఏమిటి? అలా నుంచునే మాట్లాడతావా? ముందు కూర్చో" అంది శ్రీదేవి.
    "మాకు లేదని దానాలు చేస్తున్నావా? ఇంటి విషయాలు, ఇబ్బందులు మీతో చెప్పానంటే, సహాయం అర్ధించి కాదు. అన్నీ చెప్పడం నా బుద్ది తక్కువ" అంది రోషంగా చారుమతి.
    "ఇందులో అవమానాలు, బుద్ది తక్కువలు ఏమిటో తెలియటం లేదు, చారూ! ఒక స్నేహితురాలికి ఇంకో స్నేహితురాలు సహాయపడటం తప్పా?"
    "తప్పే, దేవీ! డబ్బు ఇవ్వటం, సహాయం పుచ్చు కోవడం స్నేహితులమద్య వస్తే ఆ స్నేహం ఎంతో కాలం నిలవదు. మా ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే. దానికోసం తియ్యటి మన స్నేహం పోగొట్టుకోవడం నా కిష్టంలేదు." చారుమతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    శ్రీదేవి మనస్సు చివుక్కుమంది.
    "చారూ! నీకు మాలతి చెల్లెలైతే, నాకూ చెల్లెలే. చెల్లెలికి అక్క ఇవ్వడంలో తప్పు లేదు. అయినా, పుస్తకాలు పుచ్చుకోవడానికి నీకు అభ్యంతరం అయితే, డబ్బు ఉన్నప్పుడు బదులు తీర్చెయ్యి" అంది శ్రీదేవి, అప్పటికి చారుమతిని ఒప్పించవచ్చునని.
    చారుమతి నిశ్శబ్ధంగా కూర్చుంది కాసేపు. లేమిలోకి దిగజారిపోతున్న మధ్యతరగతి కుటుంబీకుల మానసిక వ్యథ ఊహాతీతమైనది.
    
                                    12

    సెప్టెంబరు లో శంకరం పరీక్షకి కూర్చుని ఇంగ్లీషు మాత్రం పాసయ్యాడు. గ్రూపు మళ్ళీ తప్పాడు. "వీడి కింత బుద్ధి లేదేం! శ్రద్దగా చదివి పరీక్ష పాసవ్వాలని తెలీదా?" అని చిరాకుపడింది చారుమతి. శాంతమ్మ విచారించింది. భానుమతిమాత్రం శంకరానికి వెనక మద్ధతు. "దురదృష్టం, కష్టాలన్నీ ఒక్కసారే వస్తాయి" అంటుంది భానుమతి.

 Previous Page Next Page