బైట పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తోంది. తెల్లని ఆశ్వయుజ మేఘాల జలతారు పరదాల్ని తప్పించుకుంటూ మణులు చెక్కిన నీలిమ రంగ స్థలం మీద హడావిడిగా పరిగెడుతున్న చందమామని కిటికీ లోంచి వింతగా చూస్తూ పడుకొని వుంది విజయ. అంతకో గంట క్రితం కురిసిన వాన కారణంగా, పెరట్లో ని చెట్ల ఆకులపై నిలచిన చిన్న చిన్న నీటి బిందువులు, చంద్ర కిరణాలు పడి జిగేల్ మని మెరుస్తూ ముత్యాల వెన్నెల ముంగిట్లో జల్లిన రాత్నాల్లా కళ్ళకి మిరుమిట్లు గొలుపు తున్నాయి. ఇందాకటి వానలో జలక మాడి, వెన్నెల అనే చీరను ధరించి పచ్చని పర్వతం మీద ప్రియుని కోసం అభిసారిక అయి వేచి ఉన్న దేవకన్య లా కనిపిస్తోంది. పచ్చని కొమ్మల చివర తల ఊపుతున్న ఒకే ఒక నందివర్ధనం పువ్వు.
తను కూడా ఆ పుష్పం లాగే..........?
ఆ వుపమానంతో విజయ కి నవ్వు వచ్చింది.
ఆ పుష్పం ప్రియుని కోసం వేచి ఉంది.
మరి తను....?
గోపాలం కోసమా?....
మంచీ చెడ్డా లేకుండా, కొంచెమైనా భయం భక్తీ లేకుండా , అంత చట్టున సమాధాన్ని అందించిన మనస్సు మీద విజయకి భలే కోపం వచ్చింది.
"నేను గోపాలం కోసం ఏం వేచి ఉండలేదు తెలియకపోతే ఊరుకో...." అని గట్టిగా మనస్సుని కసురుకుంది విజయ--
"ఓ యబ్బో!....మరయితే రోజూ పోస్టు మేన్ కోసం ఎదురు చూడటం ఎందుకో!...అంది మనస్సు కొంటెగా.
"ఉత్తరం నాకు వస్తుందని ఏమిటి?...మావయ్య కి ఏమైనా వస్తుందేమో నని గోపాలం దగ్గర్నుంచీ........."
"అందులో నిన్ను ఉద్దేశించి, నీకు సంబంధించిన వాక్యాలు నాలుగు ఉంటాయని" అంటూ వాక్యాన్ని పూర్తీ చేసింది మనస్సు.
'అదేం కాదు....అసలు గోపాలం , మావయ్య కి ఏం రాస్తే నాకేం ?...అయినా గోపాలం సంగతి నాకేం పట్టింది?"
"పాపం ఏం పట్టిందని అతని కంత సహాయం చేశావు. మావయ్య కు కూడా తెలియకుండా ? ఏవైనా సరే "లా" యే చదువు తానని వాళ్ళ అన్నయ్య తో దెబ్బలాడి ఇక్కడికి వచ్చేసి ఒకటి రోజులు దీర్ఘాలోచనలో మౌనంగా కూర్చుంటే "ఎందుకలా ఉన్నారు? నాకు చెప్పరా?....చెప్పరా?....అంటూ పదేపదే ప్రార్ధించి అతను చెప్పకపోతే "చెప్పండి లేకపోతె నా మీద ఒట్టు" అని బలవంతం చేసి ఎందుకు తెలుసుకోవలసి వచ్చింది. తెలుసుకున్నావు -- బాగానే ఉంది. "ఆహా" అని ఊరుకోక, గోపాలాన్ని "లా" కి ఎలాగైనా వెళ్ళే లాగా చేసి ఆయనలో బయలుదేరిన ఈ మానసికమైన అశాంతిని పోగొట్టాలని నువ్వెందుకు ఆందోళన చెందావు ?.......... మావయ్యని సహాయం అడగడానికి అతను మొహమాట పడి ఊరుకుంటే అతని తరపున నువ్వెందుకు వకాల్తా నామా పుచ్చుకొని మావయ్య తో మాట్లాడావు?....సరే ...."ప్రస్తుతం నా దగ్గరేం లేదు. ఒక్క నెల ఆగితే నేను తప్పకుండా సాయం చెయ్యగలను. అంతకీ కావలిస్తే ప్రస్తుతానికి ఏ స్నేహితుడి దగ్గరో వందో రెండు వందలో చేబదులు తీసుకుని వెళ్ళమను. ఆ తర్వాత చూద్దాం" అని మావయ్య అన్నప్పుడు నువ్వు వూరు కోవచ్చు కదా?.... ఎప్పటి నుంచో నువ్వే అతి రహస్యంగా అమ్మ జ్ఞాపకార్ధం దాచుకొన్న జిగినీ గొలుసుని అతని చేతిలో పెట్టి "అందాకా మీ అవసరాలకి దీన్ని వాడుకోండి ఎవ్వరికీ ఆఖరికి మాయవ్వ కి కూడా చెప్పొద్దు" ఇది మనిద్దరి మధ్యనే ఉండి పోవలసిన రహస్యం" అంటే అతను ససేమీరా ఆ గొలుసుని తీసుకోడానికి అంగీకరించక పొతే బతిమాలి, ప్రార్ధించి, ఏడ్చి "పోనీ తరువాత తీరుడురు గాని లెండి బాకీ! ప్రస్తుతానికి అప్పుగా తీసుకోండి" అని చెప్పి బలవంతం మీద ఎందుకు ఒప్పించి యిచ్చావు?.....రెండు మూడు నెలల నుంచీ ప్రతి నెలా మావయ్య ఎక్కడ మరచిపోతాడో అని ప్రత్యేకం జ్ఞాపకం చేసి మరీ గోపాలానికి మని ఆర్డర్ చేయించడం ఎందుకు? వారం అయేసరికి పోస్టు మాన్ కోసం వీధి గేటు దగ్గర కాసుక్కూచుని "ఎప్పుడూ ఈ పోస్టు మెన్ ఆలస్యంగా నే వస్తాడు" అని వాడి మీద విసుక్కోవడం ఎందుకు?......ఇదంతా ఎందుకోసం?....గోపాలం సంగతి ఏం పట్టకేనా?"
తన మనస్సే యిలా అతి క్రూరంగా తన హృదయం అట్టడుగు పొరల్లో దాగుకున్న రహస్యాన్ని బైటకి లాగి నిర్దాక్షిణ్యంగా మైక్రో స్కోపు క్రింద పెట్టి నిశితంగా పరిశీలిస్తుంటే భరించలేక పోయింది విజయ.
నిస్సహాయంగా "నీకో నమస్కారం పెడతాను. ఇంక వూరుకో బాబూ!" అంది కళ్ళల్లో నీళ్ళు నింపుకుంటూ.
మనస్సు విజయ గర్వంతో నవ్వింది.
మనస్సు నవ్విన ఆ తెల్లని నవ్వు లాగే ప్రకాశిస్తోంది వెన్నెల. అందుకే అది భరించరానంత బాధగా ఉంది విజయకి. ఇందాకటి వానలో తడిసిన ఈ చల్లని వెన్నెట్లో విహరించి మెల్లగా కిటికీ లోంచి దూరుతున్న గాలి, శరీరాన్ని కొద్దిగా వణికిస్తూ ఉంది. అందుకే ఎప్పుడూ వరండా లోనే పడుకొనే మావయ్య గదిలో చేరాడు. చలికి భయపడి ముసుగు పెట్టుకొని చంటి పిల్లాడిలా ముడుచు కొని ఎలా పడుకున్నాడో!
రామనాధాన్ని చూస్తె జాలేసింది విజయకి!
పాపం మావయ్య కి అమ్మ లేదు. తోబుట్టిన వాళ్ళు లేరు. భార్య లేదు. నా అన్న వాళ్ళెవరూ లేరు తను తప్ప. ఈ ఆలోచనతో విజయకి నవ్వు వచ్చింది మావయ్య ని చూసి జాలి పడుతోంది కదా తనకి ఉన్నాదేవిటి తోడబుట్టిన వాళ్ళూ తల్లీ తండ్రిని?....మావయ్యే అన్నీను. నయం తనకీ మావయ్యేనా ఉన్నాడన్న సంగతి అమ్మ పోయేముందు తెలిపింది. అప్పటి దాకా "నాకో అన్నయ్య ఉండేవాడు . వాడు బ్రహ్మ సమాజ మతంలో కలిసి చచ్చాడు అని అమ్మ అంటుంటే అమ్మకి ఆ మతం మీద ఉన్న కోపం అని తెలియక నిజంగా తనకి మావయ్య లేడు చనిపోయాడు. కాబోలు అనుకొనేది అంత క్రితం దాకా రాకపోయినా, అమ్మ పోయే సమయానికేనా వచ్చి ఆదుకొని ఆదరంగా తనని ఇక్కడికి తీసుకు వచ్చాడు. కనక కాని లేకపోతె తన గతి ఏమై ఉండును....
మావయ్య ఎంత మంచివాడు.
కిటికీలు ఓరగా వేసి ఉన్న గది మూల, మడత మంచం మీద పడుకున్న రామనాధం కేసి చూచింది విజయ. అక్కడి కిటికీ సందులోంచి సన్నగా వచ్చి రామనాధం ముఖం మీద పడుతోంది వెన్నెల. ఆ వెన్నెట్లో యాభై ఏళ్ళ రామనాధం ముఖం అయిదేళ్ళ పసిపాప ముఖం కంటే అమాయకంగా వెలుగుతోంది.
మావయ్య ఎంత అందంగా ఉంటాడు ఈ వయస్సు లో కూడా.... ఇప్పుడే ఇలా వుంటే చిన్నప్పుడు ఇంకెంత బావుండే వాడో? అయితే అమ్మ అప్పుడప్పుడు అనేది నిజమే అన్నమాట? "విజయ! నువ్వు అచ్చు మావయ్య పోలికేనే?.... మా అన్నయ్య ఎంత అందంగా ఉంటాడని. వాడు మెడ్రాసు లో లా చదివే రోజుల్లో ఓ అయ్యం గార్ల అమ్మాయి వాడిని తప్ప ఇంకేవారిని చేసుకోనని , తండ్రి తీరా భాషా భేదమే కాకుండా శాఖా భేదం కూడా ఉందని మా అన్నయ్య ని కాదని వేరే సంబంధం చూసేసరికి పెళ్లి రేపనగా సముద్రంలో పడి చచ్చిపోయింది. అప్పటి నుంచి ఆ పిల్ల మీద మనస్సు పెట్టుకుని మా అన్నయ్య పెళ్లి చేసుకోవడం మానేశాడు కాని లేకపోతె వాడికి పుట్టే కూతురు అచ్చు నీలాగే ఉండి ఉండును ఆ దిక్కు మాలిన మతం తో జేరి చచ్చాడు కనక కాని లేకపోతె మీ నాన్నగారు పోయి నాకీ అవస్థ వచ్చినందుకు నేనీ పాటికి వాడి పంచకి చేరి ఉండక పోదునా?"-- ఇలా అనేది అమ్మ అప్పుడప్పుడు -
శేఖా భేదం వల్ల ఆ అయ్యగార్ల అమ్మాయితో వివాహం జరగలేదు కనుక కాని లేకపోతె మావయ్య జీవితం ఎంతో బాగుండేది. ఈ దిక్కు మాలిన శాఖా భేదాలు మావయ్య బ్రతుకుని ఎలా బలిగొన్నాయి ?.....ఇవి అంత బలం అయినవన్న మాట!....శాఖా భేదం ఉంటె పెళ్లి చేసుకో కూడదా!... గోపాలానిది ఏ శాఖో ....తనూ ఆయనా ఒక శాఖ కాకపొతే ?..... ఆయనకా పట్టింపులు లేవు....ఆయనకి లేకపోవచ్చు ....వాళ్ళన్నయ్య మాటో!.... అమ్మో వాళ్ళన్నయ్య చాలా సనాతన పరుడట...గోపాలం చెబుతూ ఉంటాడు.
బయట చల్లగా వెన్నెల కాస్తున్న కిటికీ లోంచి వచ్చి శరీరాన్ని తాకుతున్న గాలి చిరు చలిగా వున్నా, ఈ ఆలోచనతో విజయ కి ఒళ్ళంతా చెమట పట్టింది. ఉక్క బోతతో ఉక్కిరిబిక్కిరి గా ఉంది. ఇంకొక్క క్షణం గదిలో ఉండలేక పోయింది. తలుపును చేరేసి మంచం పట్టికెళ్ళి ముందరి పెరట్లో వీధి గేటు కి దగ్గరగా మల్లె పందిరి కింద పక్క వేసుకుంది విజయ.
పైన చందమామ నవ్వుతున్నాడు. చుట్టూ ఉన్న ప్రకృతి ఆప్యాయంగా పలకరిస్తోంది. మంచం మీద వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తూ ఉన్న విజయ కి ఆలోచనతో నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు వచ్చి నిద్ర పట్టకపోవడం అనేది ఇది మొదటిసారి కాదు, ఈ మధ్య తరచు ఇలాగే జరుగుతోంది. అన్నం కూడా సరిగ్గా సయించకపోవడం మనస్సంతా ఏదో చిరాకు గానూ, విసుగ్గా నూ వుండడం . తరచు పరాకు పరధ్యానంతో పూర్వపు ఉత్సాహం చైతన్యం పూర్తిగా తగ్గిపోవడం. ఏదో భయం మరేదో బాధా వీటితో ఉండుండి జీవితం మీద విరక్తి కలుగు తుండడం మళ్లా ఏదో మహాదానందకరమైన సమయం కోసం ఆశగా ఉత్కంట తో వెయ్యి కళ్ళతో వేచి ఉండడం. ఇలా పిచ్చి పిచ్చి గా గడుస్తున్నాయి రోజులు.
తనకి పద్నాలుగు పదిహేనేళ్ళు వచ్చే దాకా ఆలోచన అంటే ఏవిటో తెలియదు. బాధ వస్తే కాస్సేపు విచారించడం , ఆనందం కలిగితే సంతోషించడం అంతే . అమ్మ పోయినప్పుడు కూడా, ఇంక అమ్మ కనిపించదే అనే బాధ వల్ల ఏడిచింది కాని, అంతకు మిక్కిలి ఏమీ తెలియదు అనకి అప్పట్లో. మావయ్య కూడా తను ఆలోచించ వలిసినంత పరిస్థితి నేమీ కల్పించలేదు. తను వచ్చి మావయ్య చేత పూటకూళ్ళ ఇంట్లో భోజనం మాన్పించి, తన సరదాలకి తగ్గట్టు గా ఇంట్లో మార్పులన్నీ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడే కాని ఇదేమిటని అడగడం కాని, పల్లెత్తు మాట అనడం కాని ఏమీ చెయ్యలేదు. అందుకే తను నవ్వుతూ తుళ్ళుతూ చిన్నపిల్లలా ఉండిపోయింది పదిహేనేళ్ళు వచ్చేదాకా ఏ ఆలోచనలూ లేకుండా.
గతాన్ని ఒక్కమారు సమీక్షించుకుంటే హృదయం మెదిలి మెదడు కదిలి తనకి మొదటి సారిగా ఆలోచనలు రావడం మొదలెట్టింది గోపాలం తన జీవితంలో ప్రవెశించాకనే?....కొత్తలో పల్లెటూరి వేషంతో బెదురూ చూపులతో కనిపించిన గోపాలాన్ని చూసి వేళాకోళం గా నవ్వుకొంది. ఓ అట పట్టించాలని కూడా అనుకుంది. కాని తీరా అతని మార్కులు వినేసరికి అతని మీద ఓ గౌరవ భావం ఏర్పడింది. పదిహేడు పద్దెనిమిదేళ్ళ పడుచుధనపు మిసమిసతో దృడంగా వున్న అతని రూపాన్ని , తన పదిహేనేళ్ళ సౌకమార్యంతో పోల్చుకుంటే అతని ఆధిక్యత ఏమిటో అర్ధం అయింది. విస్తారం మాట్లాడక పోయినా, తనంతటి చలాకీ తనం, చురుకుదనం మాటలో కాని మనిషి లో కాని కనిపించక పోయినా అతనితో కలిసి చాలాసేపు కబుర్లు చెప్పాలని, గంబీరంగా ఉండే ఆ ముఖాన్ని మరీం మరీ చూడాలని అనిపించేది తనకి. అందుకే గోపాలం వస్తాడన్న రోజున ఇంట్లో పనులన్నీ గబగబా తెముల్చు కుని, సావుకశంగా హల్లో అతని కోసం ఎదురుచూస్తూ కూర్చునేది.