"ఇది నిండుగా వుంది సర్" అన్నా తలుపు తీసి ట్రక్కుదిగుతూ. "రేషన్ స్టాండంతా మోసుకొచ్చినట్టుందే..." ఓసి.
మేవంతా రెండువందలకి కొంచెం ఎక్కువగా వున్నాం. నేను వెయ్యిమందికి సరిపడ్డరేషను మోసుకొచ్చా. మా రేషను స్టోరుదగ్గిర తెల్లవాళ్ళూ రంగువాళ్ళూ చాలామంది గుమికూడేరు. సరుకు ట్రక్కులోంచి స్టోరులోకి తీసుకెళుతూంటే అంతా సిగరెట్లుకాలుస్తూ "F N" లు జోరుగా ఒదుల్తూ తమాషా చూస్తున్నారు. ఓసీ, నా రెండు భుజాలమీదా చేతులువేసి మొహంలో మొహంపెట్టి నవ్వేడు.
"హవల్దార్! చెప్పు ఇదెలా చేసేవు?"
"నేననుకోలేదు. వెళ్ళిచూస్తే అక్కడ "గరిటవాడు" నా స్నేహితుడు, "సిక్స్తిండియన్" ఎప్పుడొచ్చినా రేషన్లిలాగే యిమ్మని అక్కడి వాళ్ళతో చెప్పేడు.
"అద్భుతం! నిజంగా అద్భుతం" ఓసీ నవ్వుతూ అన్నాడు.
నేను తిన్నగా నా భాషాకి వెళ్ళిపోయి కుర్చీలో కూలబడి నిట్టూర్చా.
* * *
దేశంలో, ముఖ్యం తూర్పుబెంగాల్లో,లక్షలాది ప్రజలు-ఆడ, మగ, పసివాళ్ళు, అన్న మో రామచంద్రా అని అలమటించిపోతూంటే వాళ్ళ ఆకలి నోళ్ళని వూరిస్తూ అన్నపుకొండలు నడిచి వెళ్ళిపోతున్నాయి. నేలపాలవుతున్నాయి. ఈ పరిస్థితి మారుతుందా అనుకున్నా. నాటికీ నేటికీ మారలేదు, రంగం మారింది కాని అదే నాటకం పాత్రదారులు మారేరుగాని అవే పాత్రలు, కాళ్ళు మారేయిగాని అవే జోళ్ళు,
7
నెలరోజులు గడిచేయి. ఈ నెల్లాళ్ళలో నేను మళ్ళీ రాయ్ ని. అంటే కమల్ ని కలియలేదు. పద్మని కలియడానిక్కూడా అవకాశం చిక్కలేదు.
పదిరోజులు క్రితమే అక్కడికొక వెస్టా ఫ్రికన్ ఆర్టిలరీ రెజి మెంటొచ్చింది. తెల్లవాళ్ళూ, నీగ్రోలు మొత్తం ఏడెనిమిది వందలమంది వుంటారు.
నీగ్రోలు చాలామంది క్రైస్తవులు, కొందరు మహమ్మదీయులుకూడా వున్నారు. కారు నలుపునించి మట్టిరంగువరకూ వాళ్ళ శరీర వర్ణం. పొడూగ్గా, రాతి విగ్రహాల్లా వుంటారు. చక్కని యింగ్లీషు కొంచెం యాసగా మాట్లాడతారు. వాళ్ళని చూస్తే భయమేస్తుంది, అడవి ఆ నీగ్రో సోల్జర్ని చూస్తే జడుసుకుంటుంది. కాని వాళ్ళు సాధారణంగా నమ్మదస్తులు, మర్యాద తెలిసిన వాళ్ళు.
తెల్లవాళ్ళు నీగ్రోల్ని భారతీయుల్ని చూసినట్టే చూస్తారు. క్యాంపులో భారతీయుల విడిదెల్ని దూరంగా వుంచినట్టే నీగ్రో విడిదెల్ని కూడా దూరంగా వుంచారు. హోదాల పేర్లు యిద్ధరివీ వొకటే. నీగ్రోలలో కమిషన్డు ఆఫీసర్లు లేరు. నీగ్రో సార్జంటు తెల్ల ప్రైవేటుకి కూడా లోకువ. విడిదెలు వేరు, మెప్పులు వేరు. జీతాల్లో తేడా సరేసరి. జాతి భేదం కొట్టొచ్చినట్టుంటుంది.
వెస్టాఫ్రికను రెజిమెంటు మా పొరుగున వుండడం చేత మాకూ వాళ్ళకీ కత్తు కలిసింది. నా కిద్దరు ముగ్గురు నీగ్రోలు స్నేహితులయేరు, వాళ్ళకి ఈ యుద్ధం యిష్టం లేదు. అదంతా తెల్లవాడి మాయ అని నాతో రహస్యంగా అనేవాళ్ళు.
కొత్త యూనిటు రాకతో దాసు కాంటీను పెరిగింది. ఇతర వ్యాపారం కూడా పెరిగింది, దాసు కొత్త క్యాంపులో తెల్లవాళ్ళ భాగంలోకి రాత్రిళ్ళు పులుల్ని ప్రవేశపెట్టడం ఆరంభించేడు. క్యాంపులో ఆకలి నిప్పు దాసు ప్రోత్సాహపు గాలిచేత భగభగమండింది. ఆ మంటలకు పులులు ఆహుతి అవుతున్నాయంటే ఆశ్చర్యంలేదు. తినడానికి వొక్క చపాతీ యిస్తే రాత్రల్లా కలిసి పడుకోడానికి సిద్ధంగా వున్న వాళ్ళ పరిస్థితి అలాంటిది.
ఒక అర్ధరాత్రి నేను గాఢ నిద్రలో వున్నా. హఠాత్తుగా పెద్దపెద్ద కేకలు వినిపించేయి. నేను గాభరాపడి లేచా. షిరాజ్ పూరు వేపునించి మంట లవుపించేయి. సిపాయిలు లేచి అటు బల బలా పరిగెడుతున్నారు. నేనూ వెళ్ళా.
షిరాజ్ పూర్ కాలిపోతోంది, ఐదారు కొంప లొకేసారి దమ దమ కాలిపోతున్నాయి, పిల్లా పిచికని చేరదీసుకుని ఆ గ్రామీణులు గుంపులుగా వొకళ్ళలొ వొకరు దూరి మంటలు చూస్తూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అక్కడ మా యూనిటు వాళ్ళు, వెస్టాఫ్రికన్ రెజిమెంటు వాళ్ళు కొన్ని వందలమంది గుమిగూడేరు. మంటలార్పడానికి తగిన సాధనాలు లేవు. అంతా ఆ మంటల్ని వింతగా చూస్తున్నారు. కొందరు వినోదం పొందుతున్నారు. ఇళ్ళు కాల్తుంటే చూడ ముచ్చటగా వుంటుంది. కాని ఆ యిళ్ళు మనవి కాకూడదు.
అక్కడ యిళ్ళు కాలడం ఒక్కటే చూడదగింది కాదు, మూడు శవాలు పడివున్నాయి. అవి అగ్ని ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళవి కావు. పిస్తోలు గుళ్ళకి ఆహుతైనవాళ్ళవి. నేను దగ్గరికెళ్ళి చూశా, రెండు మగ శవాలు - ఒక ఆడశవం. మగ శవాలు అబ్దుల్, అతని పెద్ద భార్య కొడుకు యిరవై ఏళ్ళ రజాక్, ఆడ శవం అబ్దుల్ రెండో భార్య చిన్న కూతురు ఐదేళ్ళ మున్నా, నేను అదిరిపడ్డా. "అబ్దుల్! ఏం జరిగింది 'ఎలా వుంది? నేను నిశ్శబ్దంగా ప్రశ్నించా. జవాబు కోసం కాదు. గుండె మండి.
ఆ రాత్రి సుమారు పదిగంటలకి వెస్టాఫ్రికన్ రెజి మెంటుకి చెందిన గన్నరు "డ్రైవరు షిరాజ్ పూర్లో ప్రవేశించాడు. అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. డ్రైవరు చిత్తుగా తాగేడు. అబ్దుల్ యింటి తలుపు తట్టేడు. అబ్దుల్ తలుపు తెరిచాడు. ఆ గదిలో అబ్ధులు. అతని రెండో భార్య. ఆమె పెద్దకూతురు పదహారేళ్ళ రజియా, చిన్న కూతురు నిద్రపోతున్నారు.
రజియా, తల్లిలా పొడుగ్గా అందంగా వుంటుంది. డ్రైవరు పిల్లమీద కన్నేసివున్నాడు. చాలాసార్లు పిల్లని తరిమేడు. ఆమె అతనికి చిక్కలేదు. ఎలాగైనా ఆమెని అనుభవించాలని పట్టుపట్టేడు, అబ్దుల్ నాతో ఈ విషయం రెండుమూడు సార్లు చెప్పేడు.
తాగివచ్చి గుమ్మం ముందు నిలబడ్డ సోల్జర్ని చూసి అబ్దుల్ గాభరా పడ్డాడు. ఏం కావాలని భయపడుతూ అడిగేడు తన భాషలో. డ్రైవరు మొహం దుమ ధుమ లాడుతూ "బైటికిరా- బైటికి రా" అని గదమాయించేడు. ఈ ఘర్షనతో గదిలోవున్న అందరికీ తెలివొచ్చింది. వాళ్ళు హడలి పోయేరు. ఒక్కొక్కరూ బైట కొచ్చేరు. రడియాకూడా రాబోయింది. డ్రైవరాపిల్లని లోపలకు నెట్టి, తనూ గదిలో ప్రవేశించి, తలుపు లోపల గడియ వేశాడు.
రజియా లోపల మొర్రో అని యేడుస్తూంది. బైట అబ్దులూ, భార్యా కేకలేస్తూ తలుపు బాదుతున్నారు. ఊరందరూ లేచిపోయి అబ్దుల్ యింటి ముందు గుమిగూడి కేకలేస్తున్నారు. కాని గదిలో డ్రైవరు చలించలేదు.
అబ్దుల్ వూరికి పెద్ద. రెండో భార్య మీద అతనికి ప్రేమ ఎక్కువ, అంచేత పక్కాగది కట్టి లోపల వీలైనంత నీటుగా, చక్కగా అన్నీ అమిర్చేడు.
రజియా డ్రైవరుకి వో పట్టాన లొంగలేదు. మీద కొస్తూంటే తోసింది. రక్కిందీ. కాని వాడన్నిటికీ తెగించాడు. ఆమె మెడమీద చేత్తో కొట్టేడు. మొహం ఝుమాలు మని పడి పోయింది. బైట అంత గోలవుతున్నా. తాగుడు, కామంవల్ల, స్పృహలేని రజియాని వాడు పశువులా బలాత్కరించేడు.
లేచి, బట్టలు వేసుకుని, జేబులోంచి పిస్తోలు తీసి ముందుకి గురిపెట్టి పట్టుకుని తలుపులు తెరిచేడు. బైటవాళ్ళలో చాలామంది కర్రలు పట్టుకు సిద్ధంగా వున్నారు.
తలుపు తియ్యగానే అబ్దుల్ డ్రైవరు మీదికి దూకేడు. ఢాం మని గుండు పేలింది. అబ్దుల్ పక్షిలా రాలిపోయేడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. అంతా దిస్సపోయేరు. వెంటనే అబ్దుల్ రెండో భార్య హోరని యేడుస్తూ భర్తవేపు పరిగెత్తింది. అబ్దుల్ కొడుకు ఆమె ను వారించి. తను డ్రైవరు మీదికి ఎత్తిన కర్రతో దూకేడు. ఢాం మని మళ్ళీ గుండు పేలింది. యువకుడు పిట్టలా రాలిపోయేడు. పిస్తోలు మీట నొక్కడంలో ఆనందం అనుభవించే ఆ కసాయివాడు ఈ సారి గురీ గిరీ లేకుండా "ఢాం" మని పించేడు. పాపం ఐదేళ్ళ మున్నీ రాలిపోయింది.
జనం బెగిలిపోయేరు. వెనక వెనక్కి తగ్గి పారిపోయేరు. అమాయకులు. అంతకన్న ఏం జేస్తారు?
డ్రైవరు వెళ్ళిపోయేడు. కాని అతనికసి తీరలేదు. పది నిమిషాలలో మరైదుగురు తెల్లవాళ్ళతో తిరిగి వచ్చేడు. అంతా తప్పతాగి వున్నారు! పెట్రోలు పోసి యిళ్ళకి నిప్పంటించేరు. చర్రున మంట లాకాశంలోకి లేచేయి. గ్రామంలో ఒకటే గోల. రౌడీ మూక తనపని ముగించుకు పారిపోయింది.
తరవాత చాలామంది అక్కడ చేరేరు నాలాగే.
తెల్లవారే సరికి షిరాజ్ పూరులో ఒక్క కొంప మిగల్లేదు. మూడు శవాలు, కాలిపోయిన యిళ్ళు, శవాలా మిగిలిన వాళ్ళూ వున్నారు.
మాయూనిటు అధికారు, వెస్టాఫ్రికను యూనిటు అధికార్లు యీ ఘోర నేరం గూర్చి దర్యాప్తు చేసేరు. తెల్లవారంతా కలిసి ఈ నేరం యిద్దరు నీగ్రోల మీద పెట్టేరు.
ఈ దర్యాప్తు మా కమాండెంటు కల్నల్ సిల్వర్ టన్, ఆఫ్రికను రెజిమెంటు కమాండెంటు కల్నలు ఓ కోసరు ఆరంభించేరు. ముద్దాయిలు మాకేం తెలీదన్నారు. గ్రామీణుల్లో సాక్షులు ఈ పని తెల్లవాళ్ళే చేసేరని కచ్చితంగా చెప్పేరు. జరిగినదంతా మొదటినించీ తెలిసిన అబ్ధులు లేడు అతని రెండో భార్య కొంత చెప్పగలదు.
మధ్యాహ్నం మూడు గంటలకి రెండు యూనిట్లు తెలుపు నలుపు సిబ్బందినీ వరుసగా నిలబెట్టేరు అబ్దుల్ భార్యని రప్పించి దోషిని పోల్చుకోమన్నారు. ఆమె భర్త, కూతురు పోయె రన్న బెంగతో, రాత్రి జరిగిన మారణ హోమానికి కుంగిపోయివుంది. పైగా తెల్లవాళ్ళంతా ఒకలాగే వుంటారు. బాగా పరిచయ ముంటేగాని చదూతున్న వాళ్ళే పోల్చుకోలేరు. ఆమె అందర్ని దాటి వెళ్ళిపోయినట్టు. దోషినికూడా దాటి వెళ్ళిపోయింది. హంతకుడు దొరకలేదు.
ఈపని యెవరో చేసుంటారన్నాడు కల్నల్ ఓ కొసరు. కాని మా ఓ. సి. కి అది తృప్తిగా లేదు. మానభంగమైన పిల్లని రప్పించమన్నాడు. రజియా కాలి పోయిన వూరు దగ్గిరే వుంది. రానని మొండి పట్టుపట్టింది. కల్నలు, ఉన్న గ్రామీణులో ఒక పెద్దని పిల్చి గట్టిగా చెప్పేడు.
ఆమెకేమీ భయంలేదు. ఆమె స్వయంగా వచ్చి దోషిని పోల్చాలి. ఇప్పుడు న్యాయం ఆమె చేతుల్లో వుంది. మీరంతా వెళ్ళి ఆమెకి నచ్చచెప్పండి." ఓ.సీ
చివర కెలాగో జంకుతూ వచ్చింది రజియా. కల్నలామెకి ధైర్యం చెప్పి దోషిని పోల్చుకోమన్నాడు.
రజియా రంగు వాళ్ళవేపు వెళ్ళనే లేదు. తెల్లవాళ్ళ వరసల దగ్గిరకెళ్ళి, ఓమా రందర్నీ చూసి తలవూపి అక్కణ్ణించి పారిపోబోయింది. కల్నల్ ఆమెని వరించి 'కమాన్' అని ఆమెని స్వయంగా తీసుకెళ్ళాడు- ఒక్కొక్కడి ముందు నిలబెట్టి "ఇతనా" అని ప్రశ్నించేడు. ఆమె కాదని తల వూపుతూంది. డ్రైవరు ముందుకి రాగానే రజియా కొయ్యబొమ్మలా నిలబడి పోయింది. అతని మొహంలోకి తేరిచూసింది. ఆమెకి తలతిరిగింది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. డ్రైవరు వేపు కల్నలు వేపు గబగబ చూపులు మార్చి, వణికి పోతూ బావురుమంది. ఒకమారు చూపుడు వేలు డ్రైవరు గుండెమీద పొడిచికుప్పలా కూలిపోయింది.
డ్రైవరు హంతకుడు, మానభంగం చేసిన వాడని తెలిసిపోయింది. పెద్ద కేసైంది. కాని పర్యవసానం తెలీదు.
8
ఈ శూరులు, గృహదహనాలకి సంబంధించిన కేసు వెస్టాఫ్రికన్ రెజిమెంటుకి దఖలు పడిన మూడోనాడు సాయంత్రమే మా ఆర్. హెచ్. క్యూకి కొమిల్లాకి పురోగమించమని తాఖీదొచ్చింది. మర్నాడుదయమే వాళ్ళు బయల్దేరు తున్నారు. అంటే మాకూ వాళ్ళకీ యెడబాటొచ్చిందన్నమాట. కాని అది తాత్కాలికమే. రెజిమెంటు. బ్యాటరీలు ఎక్కడుంటే మేమూ అక్కడే వుండాలి.