'వేడతానే --' అంది సుందరి లేస్తూ -
'కూచో కాసేపు, ఇపుడే ఇంటి కెళ్లి ఏం చేయాలి?-'
'ఏం చేయ్యనక్కరలేదనుకో --కానీ.......'
'మరయితే కూచోవే-' ఇందిర బలవంతపెట్టటంతో సుందరి ఇంకేమీ అనకుండా కూర్చుంది.
చాలాసేపు ఇద్దరికీ మాట్లాడటానికి విషయాలే లేకపోయాయి.
ఇంతవరకు జరిగిన సంగతి సుందరికి చెబుదామని ఉంది.
ఈ పరిస్థితిలో - అంటే సుందరి అన్నదే నిజమైతే - రాంబాబు పరిపోయాడన్నది నిజమే అయితే -- ఎలా?
ఏం చేయాలి?-
పైగా వెంకు పంతులు తన తండ్రికి చెప్పినదాన్ని బట్టి చూస్తె, తన తండ్రి ఇక తనకు వివాహం చేసేయ్యాలనుకొని,ఆ ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపడాల్సిన ఆవశ్యకత ఏం లేదు. ఒకవేళ అదే జరిగితే -- ఎలా చెప్పాలి తన తండ్రికి?
రాంబాబు కు తన శరీరం -- మనసుతో బాటుగానే - అంకితం చేసేసిందనీ, ఈ పరిస్థితి లో మరొకరిని వివాహం చేసుకోవాలనుకోవటం అపచారమే గాదు. అది అవతలి వ్యక్తికీ తీరని అన్యాయం చేసినట్టవుతుందని, అంత ఘోరమైన పాపం చేయడానికి తనకు మనస్కరించడం లేదనీ.... ఎలా చెప్పాలి?
కానీ, చెప్పకపోతే -- తండ్రి తను ప్రయత్నం చేసి, ఏదైనా సంబంధం తెస్తే, అపుడు ఈ సంగతి చెప్పడం....
అందుకే అంత్యనిష్టూరం కన్న అది నిష్టూరమే మేలు అనిపించింది ఇందిరకు.
కానీ -- ఈ విషయాన్ని తను స్వయంగా చెప్పటం ఎంత భావ్యంగ ఉంటుంది? తను చెప్పేదాని కన్న ఈ విషయం సుందరి చెపితే , వాళ్ళు బాగా అర్ధం చేసుకొనే సావకాశం ఉంటుంది. సుందరికి ఈ విషయం తన తల్లి దండ్రులకు చెప్పే ధైర్యం , ఆ చనువు ఉండనే ఉన్నాయి. కానీ ఈ విషయం చెప్పడానికి సుందరి పూనుకోవాలి --
కానీ --
సుందరి లో ఈ క్షణం లో రాంబాబు అంటే పగె ఉంటుంది కానీ -- అతన్ని అతను చేసిన దాన్ని....
ఇది కేవలం అతనోక్కడివల్ల జరిగిందనుకోవటం ఆత్మ వంచనే!
చేతులు రెండూ కలిస్తేనే చప్పట్లు అవుతాయనటం నిజం.
ఈ తప్పులో తన పాలు తనకూ ఉంది--
అందుకే --
ఇద్దరు సమిష్టిగా ఈ తప్పును చేశారు. కానీ సుందరి ఈ విషయాన్నీ తన తండ్రికి, తన తల్లికి చెపుతుందా అనేది సందేహం.
సుందరి కేసి చూసింది ఇందిర.
దిగులుగా కూర్చుంది సుందరి ఏదో ఆలోచిస్తూ -- ఏం అలోచిస్తుంటుంది - బాబ్జీ ఇలా ఎలా చేశాడు అని, అంతే!
'సుందరీ--'
సుందరి ఉలికిపడింది.
'పిలిచావా?-'
'మరే--'
'ఏమిటే?-'
ఇందిరకు భయం వేసింది - చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా చెప్పాలో అర్ధం కాలేదు తనకు. అందుకే మౌనంగా ఊరుకొంది.
'చెప్పవే-' అంది సుందరి.
'ఏం లేదు, ఎమిటాలోచిస్తున్నావ్?- ' అంది ఇందిర తనకు చెప్పటానికేమీ లేనట్లు.
సుందరి ఏమీ మాట్లాడలేదు- క్షణం ఆగాక లేచి నిలబడింది . 'ఇక నేను వెడతా' అంటూ.
ఇందిరా లేచి నిలనడింది -- సుందరి ఇంట్లోకి వెళ్లి సుమతి తో చెప్పింది వెడుతున్నానంటూ.
'అన్నట్లు సుందరీ, ఆ సంగతేమయిందీ ?- 'అంది సుమతి సుందరితో.
ఇందిరకు గుండె లోక్కసారిగా అలసిపోయాయి- సుందరి తన తల్లితో ఈ సంగతి చెప్పెసిందా?
'ఏం సంగతండీ?-'
"అదేనమ్మా-- నిన్న మీ యింటికి ......'
'అదా. తర్వాత తెలియజేస్తామన్నారు-- ' అంది సుందరి.
ఇందిరకు అంతా అర్ధమయింది.
'ఏమిటే అమ్మా అది?-' అంటూ అడిగింది తల్లిని.
'నీకు చెప్పలేదే ఆ సంగతి సుందరి?-'
'అసలేసంగతో నువ్వు చెబితే , సుందరి చెప్పిందో లేదో చెబుతాను నేను-'
సుందరి నవ్వింది.
'అదేనే - సుందరిని చూడడానికి నిన్న పెళ్లి వారు వచ్చారు-'
'ఛ- నా కసలు ఇది చెప్పనే లేదు చూశావమ్మా-- నేనెక్కడ అతన్ని చూసి దిష్టి కొడతానో అని భయం దీనికి!'
'ఇందిరా , నా భయం అది కాదె- అతన్ని నువ్వెక్కడ ఎగరేసుకు పోతావో అని!' అంటూ నవ్వింది సుందరి.
'నిజమేనమ్మా -- బాగ గుర్తు చేశావు , దీనికి చూడాలి ఇంక -' అంది సుమతి తనకు సుందరి ఈ విషయం గుర్తు చేసేదాకా గుర్తులేనట్లు.
'ఇంకేమే , చాలా?-' అంది సుందరి నవ్వుతూ.
'ఛ- ఊర్కోవే-'
'అది కాదండీ, మీరున్నారని ఇలా అంటోంది కానీ, రోజూ నాతో ఒకటే గొడవండి- నాకు పెళ్లి చేయమని మా ఇంట్లో వాళ్ళకు గుర్తు చెయ్యవే అని!' అంది సుందరి నవ్వుతూ.
'నీది మరీ చోద్యమే-' అంది సుమతి , తనూ నవ్వులో శృతి కలుపుతూ.
'నేను వెడతా నండీ మరి-' సుందరి కదిలింది.
వసారా దాటాక అంది సుందరే -- 'సారీ ఇందూ, నిన్నటి దాకా మాకే తెలీదు. అనుకోకుండా వారోస్తున్నట్లు తెలిసింది. నీ దగ్గర కొచ్చి చెప్పేంత టైం కూడా లేకపోయింది -'
'ఫర్వాలేదులే -- కనీసం పెళ్లి కైనా పిలిస్తే --' అంది ఇందిర నిష్టూరంగా.
'అపుడే అంతదూరం వెళ్ళకు- ఇందాక తమాషా కు అన్నానే మీ అమ్మగారి తోటి- అంతేగానీ అతన్ని నువ్వెక్కడ ఎత్తుకు పోతావో అనే భయం లేదు -- ' అంది గట్టి గానే సుందరి -- 'అయినా నీకు బాబ్జీ ఉన్నాడుగా ?-' అంది ఏదో రహస్యం చెబుతున్నట్లుగా.
ఇందిర నవ్వుకొంది.
'వెడతా మరి-'
'సుందరీ, మాట.'
'ఏమిటే మళ్లీ?-'
'సాయంత్రం గుడి కెడదాం రావే-'
'రాలేను ఇందూ -- ఇంట్లో పనుంటుంది-'
'ప్లీజ్ --నీకు అతి ముఖ్యమైన సంగతి చెప్పాలి -- రాకపోతే నా మీద ఒట్టు-' అంది ఇందిర బుంగ మూతి పెడుతూ.
'వీలైతే వస్తా-'
'అదేం కుదరదు . ముందే చెబుతున్నాను-'
'సర్లే- వస్తాను-' అంది సుందరి వెడుతూ.
సుందరి వెళ్ళిపోయాక గేటు వేసి నెమ్మదిగా ఇంట్లోకి అడుగు వేసింది.
5
సాయంత్రం అయిదు దాటింది. ఇందిర నీటుగా ముస్తాబయి సుందరి రాకకోసం ఎదురు చూడటం ప్రారంభించింది. మనిషి పై కెంత నిబ్బరంగా కనిపిస్తోందో, మానసికంగా అంత బెంగగా ఉంది. ఆ క్షణం లో ఇందిర.
నిజమే -
ఇలాటి విషయాన్ని ఎంతటి స్నేహితురాలికైనా ఎలా చెప్పుకోవాలో అర్ధం కాలేదు ఇందిరకు. యేమని చెప్పాలి?
చెప్పకుండా ఉంటె బాగుంటుంది.
'కానీ--
చెప్పకపోతే ....?
చెప్పకపోతే అనే ప్రశ్న ;లేదు. చెప్పక పొతే ఎలా? అన్న ప్రశ్నకు ఇక తావు లేదు, చెప్పాలి అంతే.
సుందరి ఈ విషయం పదిమందితో చెప్పేస్తే ?
సుందరి అలాటిది కాదు. ఇతరుల అంతరంగిక విషయాన్ని పదిమందికి చెప్పుకుని సంతృప్తి పడేటంతటి అల్ప మనస్కురాలు కాదు సుందరి.
ఒకవేళ అలాటిదే అయితే ....కానీ జరగవలసింది ఎలాగైనా జరిగి తీరుతుంది.
దొడ్లో అమ్మ చెట్లకు నీళ్లు పడుతోంది. ఇందిర మౌనంగా వెళ్లి సుమతి పక్కన నిలబడింది. సుమతి ఒకసారి తలెత్తి ఇందిర కేసి చూసింది. మళ్ళీ తల దించుకుంది.
అమ్మ ఏదైనా అడిగితె బాగుండుననుకొంది ఇందిర.
ఇందిర ఏదైనా చెబుతుందనుకుంది సుమతి.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కాస్తసేపు అటూ ఇటూ తిరిగి, ఇందిర మళ్ళీ వసారాలోకి వచ్చింది సుందరి వస్తుందేమో నన్న ఆశతో.
'ఇందిరా-'
సుమతి పిలుపు విని మళ్ళీ దొడ్లో కి వెళ్ళింది ఇందిర.
'ఎక్కడికి ప్రయాణం?'
ప్రశ్న అడగటం మామూలుగానే ఉన్నా, ప్రశ్నలోని భావం ఇందిర గ్రహించింది.
'గుడికి....'
క్షణం ఆగి అంది సుమతి....'రాంబాబు లేడు తెలుసా?'
ఇందిర గతుక్కుమంది. 'సుందరి వస్తానంది.'
సుమతి ఏం మాట్లాడలేదు ఇంక.
ఇందిర ఇంక అక్కడ నిలబడ కూడదనే ఉద్దేశ్యంతో నే వీధి లోకి వచ్చేసింది. దూరాన్నుండి వస్తున్న సుందరిని చూసి మనసు ఎంతో తేలికయింది ఇందిరకు.
సుందరి గేటు దగ్గరకు రాగానే ఆప్యాయంగా వెళ్ళింది ఇందిర. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వచ్చి, సుమతికి చెప్పి, బయలుదేరారు గుడికి.
మౌనంగా నడుస్తున్న వీళ్ళకు దారిలోనే వెంకటేశ్వర్లు ఎదురయ్యాడు . ఇద్దరూ అతన్ని చూసి ఆగి, నమస్కారించారు.
వెంకటేశ్వర్లను నిన్న చూసింది , ఈవేళ చూస్తోంది.
కానీ....
కానీ నిన్నటి వెంకటేశ్వర్లకు ఈ వెంకటేశ్వర్ల కు ఎంత తేడా?
పుత్యవాత్సల్యం అనేది ఇంత బలమైన వస్తువా?-'
'చూశావా ఇందిరా, రాంబాబు ఏం చేశాడో?-'
ఇందిర కేమనాలో తెలీదు.
'ఆ, ఇపుడెం జరిగిందని మీరంత బెంగ పడడం?' అంది సుందరి-
ఇందిర ఆశ్చర్య పోయింది సుందరి మాటలకు, ఇంతకన్నా ఏం జరగాలి ఇంక?
'సుందరి , ఇంకా ఏం జరగాలి తల్లీ?'
'మీరూరుకోండి, రాంబాబు ఈ వేళో, రేపో వచ్చి తీరుతాడు. నన్ను నమ్మండి-'
'అంతేనమ్మా, ఇంతకాలం వాడిని నమ్మి బతికాను. ఇక మిమ్మల్ని నమ్మి బతకాలి -' వెంకటేశ్వర్లు ఏ ఊహతో ఆ మాట అన్నారో కానీ, ఇందిరకు ఆ మాటలు సూటిగా తగిలాయి.
'ఎక్కడికో వేడుతున్నట్లున్నారు?'
'మరేనండి, గుడికి-'
'మంచిదమ్మా , వెళ్ళి రండి -' వెంకటేశ్వర్లు కదిలాడు.
ఇందిర, సుందరి ఇద్దరూ మౌనంగానే గుడికి చేరారు. దేవికి నమస్కరించి వచ్చి, నాపరాళ్ళ మీద కూర్చున్నారు.
ఇందిర అడిగింది ఉన్నట్టుండి సుందరిని 'ఏమీ చెప్పావుకావెం నాకో సంగతి?'
'ఏ సంగతి?'
'అదే, మీ శ్రీవారి గురించి -'
'అపుడే శ్రీవారసకు - కొన్నాళ్ళుగాలి -' అంది సుందరి నవ్వుతూ.
'పోనీ ఎవరో ఒకరు- చెప్పు, ఏం చేస్తారు? ? ఎలా ఉంటారు? ఎంత కట్నం?'
సుందరి క్షణం ఆగి అంది - పేరు చంద్ర మౌళి. టీచరు - మనిషి బాగానే ఉన్నట్లున్నారు మరి!'
'అంటే?-'
'అంటేనా - నేను సరీగా చూడలేదని అర్ధం!-'
'అదేం? అంతా ఆ తర్వాతే చూసుకోవచ్చనా?'
'అలాక్కాదే ! సిగ్గు పడాలంటారుగా మరి. ఇంకేం చేయను?' సుందరి నవ్వుతూ అంది.
'ఛ. ఇదేం బాగాలేదే- రేపొకవేళ ఇంకో వ్యక్తిని కూర్చో బెడితే పీటల మీద?'
సుందరి ఫకాలున నవ్వింది: 'రావాల్సిన సందేహమే వచ్చింది నీకు, రేపొక వేళ పీటల మీద వీరిని కూర్చో బెట్టక ఇంకొకర్ని కూచో బెట్టినా నేను రెడీయే-- అయినా అలాంటివన్నీ నీకు! మనసులో ఒకరి బొమ్మ ఉంటె ఇంకొకరు రావటం కష్టమేమో గానీ, ఎవరూ లేకపోతె, ఎంత హాయి.?... అయినా మనిషి అందాన్ని కొరుక్కుతింటాముటే?-'
'ఏమో బాబు, నువ్వు కొరుక్కునే తింటావో, మరేం చేస్తావో నాకేం తెలుసు?' అంది ఇందిర నవ్వుతూ.
'ఇంతకీ నువ్వేమి చేశావో చేబుదూ?-'
'నేనేం చేయలేదు-' అంది ఇందిర నవ్వుతూ.
'పోనీ రాంబాబే ఏం చేశాడు నిన్ను?'
'ఛీ -- పాడు పిల్లా....' అంది ఇందిర మనస్పూర్తి గా నవ్వుతూ.
సుందరి శృతి కలిపింది ఆ నవ్వులో.
ఇందిర కిదే సమయమనిపించింది చెప్పటానికి.
మనసులు ఉల్లాసంగా ఉన్నాయి. కావాల్సింది ఏముంది ఇంతకన్నా --
మెల్లిగా ఇందిర సుందరిని పిలిచింది 'సుందరి....'
'ఊ...' తలెత్తి చూసింది సుందరి. 'ఏదో చెబుతానని తీసుకొచ్చావు గదే?-'
'ఊ-' అని ఆగింది ఇందిర. ముందు నాకోమాట ఇవ్వాలే-'
'ఒకటెం వెయ్యి తీసుకో -- చాలా?' అంది సుందరి నవ్వుతూ.
'అంత లైట్ గా తీసుకోకు- చాలా సీరియస్ విషయం -- నువ్వంటే నాకు రెండో ప్రాణం కాబట్టి...'
'రాంబాబు మొదటి ప్రాణమా?-'
'ఇదిగో .....మళ్ళీ -'
'ఇంకేమీ అనను-- చెప్పు మరి' అంది సుందరి ఇందిరతో.
'నువ్వంటే నాకెంతో ఇష్టం, నమ్మకం ఉంది గాబట్టి చెబుతున్నానే...రాంబాబు అంటే నీ ఊహ ఏమిటే?'
'ఏవిధంగా ?'
'అంటే,...అసలు ఏ విధంగా నైనా సరే....'
'మొదట మంచివాడు. ఆ తర్వాత వుత్త ఫూల్-'
'అంటే?-' ఇందిర ఆశ్చర్యంగా అడిగింది.
'అంటేనా!- మనిషి స్వతహాగా మంచివాడే. కానీ ఆవేశం లో తనేపని చేస్తున్నదీ తనకే తెలీదు, ఆవేశం తన చేత ఎంతటి వెధవ పని చేయిస్తుందో కూడా గ్రహించలేడు- అంతే' అని ఆగింది సుందరి. 'ఇంతకీ ఎందుకే ఈ జనవాక్య సేకరణ? నీకంటూ ఒకభిప్రాయం లేదా ఏం ఖర్మ?'
ఇందిర నవ్వింది- ' అది కాడులేవే నేను చెప్పబోయేది , ఇప్పుదు నువ్వు చెప్పిన నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది.'