Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 8

 

      ఈ లోపులో డైరెక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చారు.
   
    అమ్మకాలు ఎప్పటికప్పుడు తమకి తెలియజేసేలా, ఆర్నెల్ల పాటు ధరలు పెంచేటట్టు!!
   
    సో.....
   
    హి ఎచీవ్డ్ ఇట్.
   
    ధర పెంచి, ప్రోత్సహకరమైన బహుమతులు ఇవ్వాలనే చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఆ విధంగా తీసుకున్న దేశపు మొట్టమొదటి బట్టల కంపెనీ - రవితేజా టెక్స్ టైల్స్ అయింది. ఏ చీర కొన్నా ఏదో విధంగా ఒక బహుమతి ఖాయం!.....మీటింగ్ పూర్తయింది. డైరెక్టర్లు- పార్టీకోసం లేస్తూ వుండగా రవితేజ అన్నాడు.
   
    "సర్స్! ఇప్పటివరకూ కస్టమర్లకు ఇచ్చే రాయితీలని కొన్ని మీముందుంచాం. మీరు వాటి నన్నిటినీ వప్పుకున్నందుకు నా తరపునా, నా రిసెర్చి డిపార్ట్ మెంట్ తరఫునా కృతజ్ఞతలు. నేను మీటింగ్ లో చెప్పటానికి సిగ్గుపడ్డ, ఐ మీన్ - మొహమాటపడ్డ ఆఖరి అంశాన్ని ఇప్పుడు వెల్లడి చేస్తున్నాను ఇది చెప్పగానే మీరు నవ్వుతారు. కానీ నేనూ మా డిపార్ట్ మెంటు మా స్వంత బాధ్యత మీద ఈ బహుమతి కస్టమర్లకి ఇవ్వబోతున్నాం-"
   
    "ఇంతకీ ఏమిటది?"
   
    "మన షాపులో చీర కొనటానికి వచ్చే స్త్రీ తనతోపాటు ఎంతమంది స్నేహితురాండ్రని తీసుకువస్తే - నూటికి అన్ని రూపాయలు కన్షెషన్ ఇస్తాం" అని వూరుకున్నాడు. ఇరుగుపొరుగు వారిని ఇంటర్ - డిపెండెంట్ చేసే ఆ పథకం వెనుకర్ధం - ఒక్క క్షణం అక్కడున్న వారికి ఎవరికీ వెంటనే అర్ధంకాలేదు. షాపింగ్ కి, అందులోనూ బట్టల కొట్టుకొచ్చి ఆడవాళ్ళు వూరుకోరు అని అర్ధం కాగానే ముందర ఎవరో సన్నగా విజిల్ వేసేరు. తరువాత అందరి ఆమోదాన్ని తెలుపుతున్నట్టు వెంటనే నవ్వులు వినపడ్డాయి. ఎప్పుడూ ఎగ్జయిట్ అవని చైర్మన్ కూడా రవితేజ భుజం తడ్తూ "గుడ్, వెరీగుడ్...." అన్నాడు అని, పార్టీవైపు నడుస్తూ వుండగా "నీ చివరి పథకం బాగానే వుంది. పదిమంది స్నేహితురాండ్ర వరకే పరిమితం అని పెట్టు. లేకపోతే మరీ కక్కుర్తిపడే ఆడవాళ్ళెవరైనా వుంటే వందమందిని తీసుకొచ్చి మొత్తం షాపంతా పట్టుకుపోతారు" అంటూ నవ్వేడు.
   
    ఆ రోజు పార్టీ చాలా బాగా జరిగింది. ముఖ్యంగా రవితేజ బాగా ఉల్లాసంగా వున్నాడు. అతడి నిర్ణయాలు తొందర్లోనే అమలు జరపబడి అవి సఫలీకృతమైతే, రవితేజ టెక్స్ టైల్స్ భారతదేశపు నెం. 1 కంపెనీ అవుతుంది. అతడికి నమ్మకం వుంది. కొత్త డిజైన్స్ విషయంలో తన నెవరూ కొట్టలేరని అతడికి తెలుసు.
   
    రవితేజ టెక్స్ టైల్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ! కానీ నలభై శాతం షేర్లు శర్మవే! ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఇవిగాక మరి నాలుగు డిపార్ట్ మెంట్ లున్నాయి. రవితేజ ఉత్పత్తి, మార్కెటింగ్, డిజైన్, రిసెర్చి విభాగాలు చూసుకుంటాడు. ఇంకో ముగ్గురు డైరెక్టర్లు మిగతా మూడు డిపార్ట్ మెంట్ లూ చూసుకుంటారు. ఒకరి విషయాల్లో మరొకరు కల్పించుకోరు. అందుకే ఆ రోజు రవితేజ అంత ఆనందంగా వున్నాడు. అతడి పథకాలన్నీ ఆమోదించబడ్డాయి.
   
    .....అతడింటికి వెళ్ళేసరికి పదకొండున్నరయింది. వంటవాడు తలుపు తీశాడు. బట్టలు మార్చుకుని పక్కమీద పడుకుని భార్యమీద చెయ్యి వేశాడు. ఆమె నిద్రపోవటంలేదు. ఒక్కసారిగా అతడి చేతిని విదిలించికొడుతూ, "వచ్చారా? ఇప్పుడెందుకు రావటం? తెల్లారేక రావల్సింది" అంది విసురుగా.
   
    అతడిమీద చన్నీళ్ళు జల్లినట్టయింది. అతడి ఉత్సాహమూ, ఆ రోజు గెలుపూ అంత ఒక దెబ్బతో పోయాయి. అతడి మనసు ఎప్పుడోగాని అంత ఆనందంగా వుండదు. అదంతా ఎగిరిపోయింది. తమాయించుకుంటూ "అదికాదు మాధవీ-" అంటూ ఏదో చెప్పబోయాడు.
   
    ఆమె కళ్ళు చిట్లించి అతడివైపు చూస్తూ "ఈ రోజు కూడా తాగి వచ్చాడు కదూ-" అంది అసహ్యం ధ్వనించేలా! వినేవాళ్ళకి అతడో పెద్ద తాగుబోతూ, రోజూ అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకునేవాడిలా కనిపిస్తాడు ఆ మాటలు వింటే. నిజానికి అతడు ఎప్పుడూ కంపెనీ కోసమే తాగుతాడు. అందులోనూ ఆ 'స్థానం' లో వుంటూ అసలు గ్లాసు పట్టుకోకపోతే బాగోదు. కొత్తలో ఆమెని వప్పించటానికి ప్రయత్నించాడు- "తాగినవాళ్ళు అసలు ఇలా వుండరు మాధవీ. నువ్వు చెప్పేది తాగుబోతుల గురించి! ఒక పెగ్గు తాగినా పది పెగ్గులు తాగినా ఒకేతా వాసన రావటం మొగవైడ్కి దేవుడిచ్చిన శాపం" నవ్వించటానికి అతడు చేసిన ప్రయత్నాన్ని అర్ధం చేసుకునేటంత సెన్సాఫ్ హోమర్ లేదు ఆమెకి.
   
    ఆ రోజు కూడా కార్లో వస్తూ అనుకున్నాడు- ఆమె అలా అడుగుతుందని, ఆమెకు చాలా చెప్పాలనుకున్నాడు. ఈ రోజు సాధించింది తక్కువ విజయమేమీ కాదు. కానీ మొగవాడు సాధించే విజయాల్ని అందరికన్నా ముందు భార్య గుర్తించాలి. లేకపోతే ఇంత కష్టపడటంలో అర్ధంలేదు. ఎందుకింత కష్టపడటం?
   
    తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమెకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. "చూడు మాధవీ, మీటింగ్ అయ్యేసరికి పది అయింది. తరువాత డిన్నర్ అన్నారు. ఈ రోజు అటెన్షన్ అంతా నా మీదనే అలాటిది వదిలేసి నేనెలా రాగలను?"
   
    "నన్నెందుకు కట్టుకున్నారు? ఆ ఫ్యాక్టరీనే కట్టుకోలేకపోయారా?"
   
    అతడు నవ్వేడు. "రెంటినీ ఒకేసారి కట్టుకున్నాను. మన పాతరోజులు మర్చిపోయావా మాధవీ? రాత్రింబవళ్ళు నేతమగ్గాల మీద బ్రతుకులు గడిపిన రోజులు అవి. కష్టపడకపోతే పైకి రావటం కష్టం. ఇప్పుడు మనం ఇంత సుఖం అనుభవిస్తున్నా మంటే- కష్టపడటం వల్లే కదా!"
   
    "చాల్లెండి. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని-ఎన్నైనా చెపుతారు." నిశ్చేష్టుడయ్యాడు. సున్నితమైన తీగ ఏదో తెగి గుండె గీరుకున్న బాధ. అతడికి జీవితంలో మొదటిసారి కోపం వచ్చింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "అంటే....నేనబద్దం చెపుతున్నా నంటావా?"
   
    "అబద్దమే చెపుతున్నారో- నిజమే చెపుతున్నారో-ఏం చెపుతే ఏం లాభం? భార్యని సుఖపెట్టలేకపోయాక."
   
    "ఏం? ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది?"
   
    "ఏం? సుఖముందే అనండీ?"
   
    "ఏం లేదు? మహిళామండలి మీటింగుల కెళ్ళటానికి కారుంది. రాత్రి నిద్రపోవటానికి ఎయిర్ కండిషన్డ్ బెడ్ రూమ్ వుంది. పనిచేయటానికి నలుగురు మనుష్యులున్నారు. ఇంకేం సుఖం కావాలి?"
   
    "ఇంతేనా? ఇదేనా సుఖమంటే?"
   
    "మరింకేమిటి?"
   
    "ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు."
   
    అతడు తెల్లబోయి "నెలకు నాలుగుసార్లు డిన్నర్ కి తీసుకెళ్తున్నాను. ఫ్యామిలీ పార్టీలకెళ్తున్నాం. ఇంకా ఏమిటి ముచ్చట?"
   
    "డిన్నర్లకీ, పార్టీలకీ వెళ్ళటమేనా ముచ్చటంటే? ప్రొద్దున్న వెళ్ళి అర్ధరాత్రెప్పుడో వస్తారు. ఇంట్లో వంట చెయ్యటానికే పెళ్ళామున్నది. ఏదో రాత్రి పడుకోవాలి కాబట్టి ఇంటికి రావటం-"
   
    అతడికి విసుగేసింది. తమాయించుకుని అన్నాడు - "చూడు మాధవీ! కొంతమంది జీవిస్తారు. మరికొందరు జీవితాన్ని ఛాలెంజిగా తీసుకుని కష్టపడతారు."
   
    "కష్టం! కష్టం! కష్టం! మీరొక్కరేనా కష్టపడుతూంది. ఇంకెవరూ లేరా?"
   
    "లేరు. చూడు! నిజంగా కష్టపడేవాళ్ళు చాలా తక్కువమంది వుంటారు. లేకపోతే ఇన్ని సినిమాహాళ్ళు, రేసులూ, బార్లూ ఇంతఫుల్ గా వుండవు. దురదృష్టం ఏమిటంటే ఈ కష్టాన్ని కూడా అర్ధం చేసుకోవలసిన వాళ్ళు అర్ధం చేసుకోరు వాళ్ళని కూడా అందరితో కలిపేస్తారు."
   
    "మిమ్మల్ని మీరు సమర్ధించుకోవటానికి ఎన్నైనా చెపుతారు?"
   
    "ఛీ- నీతో వాదించటం, నీకు అర్ధమయ్యేలా చెప్పటం- నాదే బుద్ది తక్కువ."
   
    "ఆ మాట నేనూ అనగలను. అసలీ తప్పంతా నాన్నది. మీకు మాటివ్వటం ఏమిటి? మీకు బదులు ఏ గుమాస్తాని కట్టుకున్నా అంతకన్నా సుఖంగా వుండేది ప్రాణం-"
   
    మొహంమీద అగ్నిపర్వతం బ్రద్దలైనట్టు కదిలిపోయాడు అతడు. మనం పడే కష్టానికీ, దాన్ని మనవాళ్ళు అనుకున్నవాళ్ళు అర్ధం చేసుకునే విధానానికీ, ఇంత వ్యత్యాసం వుంటుందనుకోలేదు అతడు.
   
                           *    *    *
   
    రవితేజ కారొచ్చి L.I.C. క్వార్టర్ల ముందు ఆగింది. అందులోంచి అతడూ, మాధవీ దిగారు. ఈ లోపులో లోపల్నుంచి మాధవరావు బయటకు వచ్చాడు. అతడు రెవెన్యూ డిపార్టుమెంట్ లో గుమాస్తా.
   
    ఇంటిముందు కారు ఆగటంతో తల్లీ, అతడి ముగ్గురు చెల్లెళ్ళూ కిటికీల్లోంచి చూస్తున్నారు. రవితేజ కార్లోంచి రెండు పెద్ద పెద్ద దండలు తీసి చేత్తో పట్టుకుని, లోపలికి నడిచేడు. హాల్లో నిలబడి ఇద్దరివైపూ చూశాడు. ఇద్దరికీ చెరో దండ ఇచ్చాడు. ఈ లోపులో చెల్లెళ్ళు, తల్లి ఆ గదిలోకి వచ్చారు.
   
    మాధవరావు, మాధవి దండలు మార్చుకున్నారు. తల్లి హారతి ఇచ్చింది. రవితేజ పళ్ళెంలో పదివేలు వేశాడు. తరువాత మాధవరావుకి షేక్ హాండిస్తూ, "నిండు మనసుతో నా భార్యని పునర్వివాహం చేసుకున్నందుకు అభినందనలు" అన్నాడు. తరువాత మాధవివైపు తిరిగి, "నీ కోర్కె కూడా నెరవేరింది కదూ మాధవి. ఇక హాయిగా వుండు-" అన్నాడు.

 Previous Page Next Page