Previous Page Next Page 
ముద్ద మందార పేజి 7

                                 

 

                                      4

    
    శరీరం పులకించింది. ఎక్కడపుడితేనేం సింహాచలం మాణిక్యం-- నేనో.... పనికి మాలిన దౌర్భాగ్యుణ్ణి. వోనామాలు చదువు కొనిదైనా ఎంత నీతిగా నిండుగా, చక్కగా నిష్కల్మషంగా నన్ను క్షమించింది. అదే మరోకరయితే -- వాళ్ళ వాళ్లతో చెప్పి , నా జీవితానికి స్వస్తి వాక్యం పలికించేదే-- అలాటిది తన కంఠం లో ప్రాణం పోయినా నా పేరు బయటికి రానివ్వనంది. పెళ్ళి చేసుకుని రమ్మంది. నాకు ఇంగ్లీషు చదివిన పిల్ల రావాలండి. ఎంత ఇంగ్లీషు చదివినా పిల్లయినా సరే, సింహాచలం కాలి గోటికి సరిపోతుందీ!
    చదువుకూ, సంస్కారానికి సంబంధం ఏవిటీ?
    పదకొండింటికల్లా యింటికి తాళం వేసి తోలు పెట్టిలో పెట్టుకున్న బట్టలతో రామనాధం గారి యింటికి చేరి, "మా స్నేహితుడి పెళ్లట. అర్జంటుగా వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళొస్తాను." అని బొంకి శలవు తీసుకొని, బెజవాడ చేరాను.
    "అదేం -- చెప్పా చేయక వచ్చేశావ్" అన్నారు నాన్నగారు నన్ను చూసి ఆశ్చర్యంతో. వంట్లో బాగుండలేదని, ఆ వూరు పడలేదని, శలవు పెట్టి, వచ్చేశానని బొంకాను. నాన్నగారు నా మాటలు నమ్మారు. "వో నెల్లాళ్ళు శెలవు పెడితే సరి. మరో వూరుకు వాళ్ళే ట్రాన్స్ ఫర్ చేస్తారు" అన్నారు.
    'అలాగేనండి" అన్నాను. అదీ మంచి వూహే! ఆమర్నాడే దిపార్టుమెంటు హెడ్ కి నా శెలవు విషయం రాసి, డాక్టరు సర్టిఫికేట్ జతచేసి పంపాను.

                            *    *    *    *
    పనిలేని వాతావరణం లో పదిహేను రోజులు చచ్చీ చెడీ గడిపాను. ఒకరోజు నాన్నగారు నన్ను తన ఆఫీసు గదిలోకి పిల్చారు. ఆఫీసు గదిలోకి పిల్చారంటే ఏదో గొప్ప వ్యవహారం ఉండి వుండాలి. చదువుతున్న పుస్తకం టేబుల్ మీద పడేసి, అయన గదికి వెళ్లాను.
    "కూర్చో" అన్నారు.
    కూర్చున్నాను.
    నాన్నగారు ఒక్కసారి నాకేసి చూసి, అనక టేబులు మీది అద్దం లో తన ప్రతిబింబం వైపు చూసుకుంటూ, "నీకు సంబంధం ఒకటి వచ్చింది. ఆ పిల్ల తండ్రి నాకు స్నేహితుడు. అమ్మాయి బియస్సీ ప్యాసయ్యింది. పిల్ల చాలా నెమ్మదస్తురాలు. నువ్వూ చూసే ఉంటావు .....అమ్మాయి పేరు రాధ...." నాన్నగారు చెప్పుకు పోతున్నారు. రాదని నేను ఎరుగుదును. పచ్చని బంగారుచ్చాయలో చక్కని అవయవ సౌష్టవంతో మూర్తిభవించిన స్త్రీలా ఉంటుంది. కానీ రాధకు కొంచెం అహంకారం ఎక్కువని నాకో అభిప్రాయం ఉండేది. ఆమె బియస్సీ చదివే రోజుల్లో కాలేజీ వేళకి నేను తూము మీద వంటరిగా కూర్చుని ఆమెను చూసేవాణ్ణి. రెండు మూడు సార్లు మాట్లాడాలని ప్రయత్నించాను కూడా. కానీ, రాధకి నా మీద మంచి అభిప్రాయం ఉన్నట్టు కనిపించేది కాదు. తల పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయేది. అప్పటికీ వోసారి ఆమెకు ఎదురెళ్ళి "టయిమెంతయింది మేడమ్ " అనడిగాను కనీసం ఆమె గొంతు వినాలన్న ఉద్దేశ్యంతో.
    "నిన్నీపాటికయినంతే" అంది.
    గొంతు బావుందీ కానీ ఆ రకం సమాధానం ఎదురుచూడక పోవడం వల్ల ఉలిక్కి పడి, తేరుకునేలోగా ఆమె విజయగర్వంతో వెళ్ళిపోయింది.
    "ఏవిటాలోఛిస్తున్నావ్" అన్నారు నాన్నగారు నా వాలకం చూసి. "ఏం లేదు" అన్నాను పేపరు వెయిట్ ని గిరగిర తిప్పుతూ. "నువ్వేవర్నాయినా ప్రేమించావా ఒకవేళ, అలాంటిదేవైనా ఉంటె చెప్పు. నాకేమీ అభ్యంతరం లేదు" అన్నారు.
    "లేదండి" అన్నాను పూడిన గొంతుతో.
    "అయితే వాళ్ళింటికి సాయంత్రం వెళ్దామా" అన్నారు. "అలాగేనండి' అని నేను లేచి బయటపడ్డాను.

                            *    *    *    *
    సింహాచలానికి నచ్చిన బట్టలు తోడుక్కున్నాను.
    నాన్నగారూ, నేనూ బయల్దేరి వెళ్లేసరికి , రాధ తండ్రి పరంధామయ్య గారు వాళ్ళ గడపలో సిద్దంగా నిలబడి ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే "రండి,రండి" అని ఆహ్వానించారు. లోపలకు వెళ్ళాము.
    "ఈవిడ మా ఆవిడ" అంటూ వాళ్ళావిడను పరిచయం చేసి, అనక రాదని కూడా పరిచయం చేశారు. రాధ చేతులు జోడించి "నమస్కారం'అంది. నేను తలెత్తకుండా "నమస్కారం" అన్నాను. అంతా కూర్చున్నాము.
    రాధ నా కెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. బహుశా నన్నానమాలు కట్టి ఉంటుంది. నాకు తలెత్తి ఆమె కేసి చూడ్డానికి భయం వేసింది. వచ్చేది నేనేనని ఆమెకు ముందు తెలిస్తే అసలు పెళ్ళి చూపులకు కూడా వప్పుకునేది కాదేమో!
    నౌకర్లు, కాఫీ, టిఫిన్లు పెట్టారు. పరంధామయ్య గారు ఉన్నట్టుండి పెద్దగా నవ్వుతూ "పదార్ధాలన్నీ హోటల్నుంచీ తెప్పించాము. కొంపతీసి మా ఆవిడకు వంట రాదనుకునేరు. అదేం లేదు. కతికితే అతకదని సామేతుందట. అందుకని హోటలు పదార్ధాలు తెప్పించాల్సి వచ్చింది" అన్నారు. అంతా ఆ నవ్వులో సమభాగాలు ఇచ్చాము.
    లాంచనం మార్కు ప్రశ్న లయ్యాక పరంధామయ్యగారి భార్య వెళ్ళిపోయింది. అనక నాన్నగారూ ఆయన కూడా ఏదో మాట్లాడుకుంటున్నట్టు వెళ్ళిపోయారు. గదిలో నేనూ, రాధ మిగిలాము. నాకు ముచ్చెమటలు పోశాయి. నేను నెమ్మదిగా తలెత్తి ఆమెకేసి చూశాను. ఆమె కొంటెగా నాకేసి చూస్తున్నదల్లా చిరునవ్వుని పెదిమల మధ్య దాచుకుంటూ తల దించుకుంది. నా  గుండె ఝల్లుమంది. రాధకు నేనంటే యిష్టమే!
    మరొక్కసారి రాధ కేసి చూశాను.
    నీలం పట్టు చీర అదే రంగు రవిక , ఎడమ చేతికి రెండు నీలం గాజులు , కుడి చేతికి మేల్ వాచీ.
    "రెడీ అని బిరుదిచ్చారు నీకు గుర్తుందా" అన్నాను.
    "ఇప్పుడు మాత్రం కాదన్నానా! లేదే" అంది.
    "నేను నచ్చలేదని మీ నాన్నగారితో చెప్పి నన్ను అవమానం చైడానికి పూనుకున్నారనుకుంటాను.
    "మీరే వనుకున్నారు."
    "నాకు పెన్నిధి దొరికింది."
    "మీకే కాదు నాకూ దొరికింది. వచ్చేది మీరే అని నాకు ముందే తెలుసు" అంది పైట చెంగు సరిచేసుకుంటూ నాకేసి చూసి. నేనామె కేసి ఆశ్చర్యంగా చూశాను. నిజంగా వాడెవడో అన్నట్టు మాగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు రెట్టింపు తెలివి కలవారు. ఆనందంతో "థాంక్యూ" అన్నాను. పాశ్చాత్య విధానంగా కరచాలనం చెయ్యాలని పించినా ఆరోగ్యమయిన కోర్కె కాదని వూర్కున్నాను. ఆమె సిగ్గుతో తల వంచుకుంది.
    "టయి మెంతయ్యింది మేడమ్" అన్నాను. ఆమె కుడి చేతిని చాపి "చూసుకోండి మీరే" అంది.
    "థాంక్యూ" అన్నాను.

                           *    *    *    *
    రాత్రి భోజనాలయ్యాక, నాన్నగారు నాతొ, "వారికీ మన సంబంధం యిష్టమే నట. అమ్మాయి నీకు నచ్చితే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను." అన్నారు. నేను మహదానందంతో 'అలాగే" అన్నాను.
    నాకు మదరాసు ట్రాన్స్ ఫర్ అయ్యింది. ఆనందం పాలు మరీ పట్టలేనంతయ్యింది. నాన్నగారికి యీ విషయం చెప్పేసరికి, "బాగుంది. అయితే గోపాలపూర్ వెళ్ళి సామాను తెచ్చేసుకో" అన్నారు. నావీపు మీద ఆముక్క చరిచింది. ఇన్నాళ్ళు గా గోపాల్ పూర్ విషయం మర్చిపోయాను.
    "అలాగేనండి" అని రూముకు చేరాను.
    వళ్ళంతా చమట పోసింది. ఏ కారణం చేతయినా సింహాచలం నా పేరు బయట పెట్టి ఉంటె.... నా శరీరం భయంతో ముడుచుకుపోయింది. ఆనాడు అనుకున్న చావు ఈనాడు రాసి పెట్టిందేమో అనుకున్నాను. ఆవూరు వెళ్ళడం తప్పించుకుంటే బాగుణ్ణుననుకున్నాను కానీ, అది అయ్యేపని కాదు. నాన్నగారు వో రెండ్రోజులాగి మళ్ళీ హెచ్చరిక చేయడం వల్ల తప్పనిసరిగా బయల్దేరాను. గోపాలపురం వూళ్ళో అడుగు పెట్టేసరికి నా గుండె దడదడ లాడింది. ఇంటికి వెళ్ళే ధైర్యం లేక, పోస్టు మేష్టారింటికి వెళ్ళాను. అయన నన్ను చూసి ఆశ్చర్యపోయి, "హర్రే , ఇదేవిటోయ్ వెళ్ళిన వాడివి అదే పోత పోయావు?' అని అంతలోనే తప్పు సవరించుకుని, "మీ ఆరోగ్యము ఎలా ఉందిప్పుడు" అన్నారు. నా చర్యకి వో పూత పూసి కట్టుకదగా ఆయనతో చెప్పి, నమ్మించి అనక నాకు బదిలీ అయినట్టు చెప్పి, "మన వూరు విశేషాలేమిటి?' అన్నాను-- "ఆ సంగతి' ఒకవేళ పోక్కిందేమో అన్న అనుమానంతో.
    "విశేషాలేవున్నాయ్ బూడిద ....ఆ ! ఒకే ఒక్క విశేషం ఉంది. మీ పనిమనిషి కూతురు లేదూ -- మీ యింటికి అప్పుడప్పుడు వొచ్చేది ..... సింహాచలం .....అదేవడితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది. వాళ్ళు పెద్ద పంచాయితీ పెట్టారు. నన్నూ, రామనాధం గారినీ పెద్ద మనుష్యులుగా పెట్టారు.  వాళ్ళు నాలికలు పీక్కుని చచ్చారే గానీ అది వాడి పేరు బయటై లేదు. ఆ! నా మొహం. చెప్పడానికి మాత్రం తెలిచ్చస్తేగా! అసలే యిది టూరిస్టు సెంటరు-- పైగా వాళ్ళకి నీతెవిటి? జాతెవిటి?....." అంటూ గలగల నవ్వాడు.

 Previous Page Next Page