"ఎందుకురా? ఆ స్కూటర్ తీశావ్? దొంగతనానికేనా?"
"దొంగతనమా? నా స్కూటర్ నేను దొంగతనం చేయటమేమిటి సార్?" షాకవుతూ అడిగాడతను.
"ఆ? ఇది నీ స్కూటరా?"
"అవున్సార్?"
"అయితే మరి పొద్దున్నుంచీ ఇక్కడెందుకొదిలావ్?"
"ఆ చివరి బ్లాక్ లో మా ఫ్రెండ్ ఉంటే వచ్చాను సార్! అక్కడ కొంచెం లేటయ్యింది"
హమీద్ మియా చప్పున ముందుకి దూసుకొచ్చాడు.
"చివరి బ్లాక్ లో ఎవరిల్లది?"
ఆ కుర్రాడు కొంచెం కంగారుపడ్డాడు.
"ఫ్లాట్ నెంబర్ గుర్తులేదు సార్- ఫోర్త్ ఫ్లోర్"
"అలాగా! మీ ఫ్రెండ్ పేరేంటి?"
"మా ఫ్రెండ్ పేరా? మా ఫ్రెండ్ పేరు. మా ఫ్రెండ్ పేరు. ఆ! రంజన్"
"రంజనా? అలాంటి స్టూడెంటెవరూ ఉన్నట్లు గుర్తులేదే! ఏం చదువుతున్నాడు?"
"ఎమ్ సిఏ-"
ఆ బ్లాక్ లో ఉన్న ఎంసిఎ స్టూడెంట్స్ ఇద్దరు ముందుకొచ్చారు.
"మా బ్లాక్ లో అసలు రంజన్ అనే పేరుగలాళ్ళెవరూ లేరే-"
అతను మళ్ళీ కంగారు పడ్డాడు.
"లేరా! సారీ- అయితే పేరు మర్చిపోయాను"
ఇన్ స్పెక్టర్ లాగి ఆ స్టూడెంట్ నెత్తిమీద కొట్టాడు.
"ఏంట్రా నకరాలు జేస్తున్నావ్? నిజం చెప్పు- ఎవళ్ళింట్లో ఉన్నావ్ ఇంతసేపూ"
"మా క్లాస్ మేట్ ఒకమ్మాయి ఉంది సార్! ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నాను-"
"వెళ్లి ఆ అమ్మాయి ఫాదర్ని తీసుకురా!"
"ఫాదర్, మదర్ ఇద్దరూ ఊళ్ళో లేరు సార్- మా ఫ్రెండ్ ఒక్కర్తే ఉంది-"
వెనుకనుంచి మా అపార్ట్ మెంట్ స్టూడెంట్స్ విజిల్స్ వేశారు.
"లవ్ ఎఫైర్- లవ్ ఎఫైర్" అంటూ అరిచారు కొంతమంది.
ఈలోగా ఆ చివరి బ్లాక్ లోనే ఉండే రామచంద్రం ముందుకొచ్చాడు.
"ఏదో ప్రేమ వ్యవహారం అయుంటుందిలే- పోనీండి" అన్నాడు ఇన్ స్పెక్టర్ తో.
"ఎలా పోనిస్తామండీ! వీడి లవ్ ఎఫైర్ వల్ల మాకు, ఆ బాంబ్ స్క్వాడ్ వాళ్ళకు ఎంత ఇబ్బంది అయింది"
"అయినా మా అపార్ట్ మెంట్స్ లో ఇలాంటి లవ్ అఫైర్స్ జరగటానికి వీల్లేదు. ఇంకోసారి ఇక్కడికి రాకుండా వీడిని నాలుగు తన్ని పంపాల్సిందే" అన్నాడు మా ప్రెసిడెంట్ హమీద్ మియా.
మా కల్చురల్ సెక్రటరీ శంకరమూర్తి మాత్రం జాలిపడ్డాడు.
"దానికి పరిష్కారం తన్నటం కాదండీ! వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసిపారేస్తే సరి! ఇంక లైఫ్ లాంగ్ లవ్ సంగతి మర్చిపోయి కొట్టుకు ఛస్తారు" అన్నాడు హాపీగా.
రామచంద్రం కూడా శంకరమూర్తిని సపోర్ట్ చేశాడు.
"మా కల్చరల్ సెక్రటరీగారు కరెక్ట్ గా చెప్పారు సార్- వాళ్ళిద్దరికీ మీ పోలీసుల చేతిమీదుగానే పెళ్ళి చేసేస్తే సరిపోతుంది. ఎలాగూ మీ పోలీసులు ఈ మధ్య చేస్తున్న మెయిన్ బిజినెస్ అదే కదా!"
పోలీస్ అధికారి సంబరపడ్డాడు.
"అఫ్ కోర్స్- నాకేం అబ్జక్షన్ లేదు. ఏమోయ్ ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా?"
"నాకిష్టమేగానీ అమ్మాయి తరపువాళ్ళు వప్పుకోరు సార్-"
పోలీస్ అధికారి నవ్వాడు.
"మేముంది ఎందుకోయ్! ఎవరూ వప్పుకోకపోయినా ప్రేమికుల్ని కలిపేసి మూడు ముళ్ళూ వేయించేయడానికి మాకు అధికారం ఉంది-"
"అయితే ఇంక ఆలస్యం ఎందుకు? ఆ అమ్మాయిని తీసుకురండి" హమీద్ మియాకి చెప్పాడు రామచంద్రం.
హమీద్ మియా, శంకరమూర్తి, ఇంకా అక్కడున్న స్టూడెంట్ గ్యాంగ్ చివరి బ్లాక్ వేపు వెళ్ళారు షైనీని తీసుకుని.
ఈలోగా రామచంద్రం ఆ అపార్ట్ మెంట్స్ వాళ్ళందరికీ తను కాలేజ్ డేస్ లో ఎన్ని ప్రేమజంటలకు రహస్యంగా పెళ్ళిళ్ళు చేసి కాపురాలు పెట్టించిందీ చెప్తోంటే పోలీసులు కూడా చాలా ఆసక్తిగా వింటున్నారు.
మధ్యలో ఆ అమ్మాయిని తీసుకుని హమీద్ మియా గ్యాంగ్ వచ్చేశారు.
"సార్! ఈ అమ్మాయి నిజంగా అమ్మాయి లేదు సార్-"
అందరూ అదిరిపడ్డారు.
"అంటే ఆడవేషంలో ఉన్న మగ టెర్రరిస్టా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
"అహహ.... నా ఉద్దేశం అది కాద్సార్! ఈ అమ్మాయి అమ్మాయేగాని నిజంగా అమ్మాయి లేదు-"
అందరూ హమీద్ మియా మాటలు అర్ధంకాక తలలు పట్టుకున్నారు.
అంతవరకూ ఓ పక్క జనానికి తన ఎడ్వంచర్స్ చెప్తోన్న రామచంద్రం ముందుకొస్తూ ఆ అమ్మాయిని చూసి షాకయ్యాడు.
"నువ్వెందుకొచ్చావే ఇక్కడికి? అసలు బయటికెలా వచ్చావ్? బయట తాళంవేసి వచ్చానుగా-" అన్నాడు ఆమెతో దబాయింపుగా!
"అంటే ఈ అమ్మాయి....." అనుమానంగా ఏదో అడగబోయాడు శంకరమూర్తి.
"అవునయ్యా! నా వైఫ్-"
అందరూ ఆ డైలాగు వినటంతోనే హాహాకారాలు చేశారు.
"ఆ! మీ వైఫా?"
"అవును-"
"అంటే ఈ స్టూడెంట్ కి మీ వైఫ్ తో లవ్ ఎఫైర్ ఉందా?" ఆశ్చర్యంగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
ఆ స్టూడెంట్ కంగారుగా ఎక్స్ ప్లేనేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు.
"సార్- సంగతేంటంటే మేము ప్రేమించుకున్నప్పుడు ఆ అమ్మాయి ఆయన వైఫ్ కాదండీ! అంటే అప్పుడు ఇంకా ఆమెకు పెళ్ళి కాలేదన్నమాట! ఆ తరువాత నేను జాబ్ కి బాంబే వెళ్ళి వచ్చేలోపల ఆమె తల్లిదండ్రులు ఆమెకు రెండోపెళ్ళి సంబంధం చేసేసారండీ అందుకే ఇద్దరం సీక్రెట్ గా కలుసుకుంటున్నామండీ"
"ఒరేయి- నీకెంత ధైర్యంరా! నిన్ను- మర్డర్ చేస్తారా" అంటూ రామచంద్రం అతని మీదకు దూకేసరికి పోలీసులు అడ్డుపడ్డారు.
"పోనీలే ఇంతదూరం వచ్చినందుకు ఒక లాభసాటి కేసు దొరికింది! వెళ్ళు. ముగ్గురినీ స్టేషన్ కి తీసుకు పదండి!" అరిచాడు ఇన్ స్పెక్టర్.
వెంటనే రాజు కెమెరా ఆన్ చేశాడు.
"రాజూ! ఏం జరుగుతోందక్కడ? బాంబ్ స్క్వాడ్ వాళ్ళకు బాంబ్ దొరికిందా?" అడిగింది వెంగమాంబా.
"దొరకలేదు గానీ అంతకంటే పెద్ద ఆటమ్ బాంబ్ లాంటి లవ్ స్టోరీ దొరికింది వెంగమాంబా!"
"ఏమిటా లవ్ స్టోరీ?"
ఒక స్టూడెంట్ ఒకమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి వేరొకరితో పెళ్లి అయిపోయినా గానీ అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి భర్తేమో ఇద్దర్నీ మర్డరు చేయాలని ప్లాన్ లో ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ అమ్మాయితో మాట్లాడియా అన్ని వివరాలు తెలుసుకుందాం-"
"రంజనీగారూ! మీకు, ఈ స్టూడెంట్ కీ ఎప్పటినుంచీ పరిచయం...."
"మేమిద్దరం టెన్త్ క్లాస్ నుంచే లవర్స్ గా ఉంటున్నాం"
"అతన్ని ప్రేమించి మరి ఈ పెద్దమనిషిని ఎందుకు పెళ్ళి చేసుకున్నారు?"
"ఇతన్ని పెళ్ళి చేసుకుంటే బోలెడాస్తి వస్తుంది. ఇతను చావగానే నా లవర్తో హాపీగా ఎంజాయ్ చేయవచ్చని మా ఫాదర్ చెప్పాడు- అందుకని...."
అంతవరకు ఆవేశం అణచుకున్న రామచంద్రం ఇంకకోపం భరించలేక రజనిని జుట్టుపట్టుకుని చావబాదాడు.
"నీయవ్వ! నా ఛావు గావాలే నీకు-"
పోలీసులు అతికష్టం మీద అతనిని విడదీసి అందర్నీ వ్యాన్ ఎక్కించారు.
దాంతో టి.వి.లో కనబడాలని ఉవ్విళ్ళూరుతున్న మా అపార్టుమెంట్ లేడీస్ అందరూ మగాళ్ళందర్నీ వెనుకకు నెట్టి కెమెరా చుట్టూ నిండిపోయారు.