పూజ కోసం పువ్వులు కోసి కొన్ని మాలలుగా అల్లుతోంది కాత్యాయని. మాధవ వచ్చి దగ్గరగా కూచున్నాడు. ఆవిడ తలెత్తి వాత్సల్యంతో నవ్వింది.
ఈవిడకసలు కోపం లేదా? వాత్సల్యానికి తప్ప ఆమె మనసులో మరి దేనికీ స్థానం లేదా?
'అత్తయ్యా! నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను. ముహూర్తం నిశ్చయం చెయ్యి" నెమ్మదిగా అన్నాడు.
కడుతూ కడుతున్న మాలను అలాగే వదిలేసి దిగ్గున తలెత్తి చూసింది కాత్యాయని.
"నా సంతృప్తి కోసం అంటున్నావా మాధవా! వద్దు. నిన్ను ఏ విషయంలోనూ బలవంతం చెయ్యను."
"నీ సంతృప్తి కోసం కాదత్తయ్యా!" నిజంగానే చేసుకుంటాను"
కాత్యాయని కళ్ళు తళుక్కున మెరిశాయి. ముగ్ధుడై చూశాడు మాధవ.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ కళ్ళలో ఇలాంటి మెరుపూ ఎప్పుడూ చూడలేదు. ఆ కళ్ళు ఎంతో అందంగా, సంతోషంగా మెరిసినప్పుడు మాధవ హృదయం సంతృప్తితో నిండిపోయింది.
అత్తయ్యకింత అనందం కలిగించిన తర్వాత తను మానసికంగా ఎంత బాధపడితేనేం?
మాధవతో జానకి పెళ్ళి నిశ్చయమైనందుకు శ్రీనివాసు తర్వాత ఎక్కువ ఆనందించింది శ్రీనివాసు పెద్ద కూతురు కుసుమ.
"జానకీ" అంటూ జానకిని కౌగలించుకుంది.
జానకికీ కుసుమకి వయసులో నాలుగేళ్ళ కంటే వ్యత్యాసం లేదు. ఆ కారణం చేత కుసుమ జానకిని 'అత్తయ్య" అని పిలవకుండా పేరుపెట్టి పిలుస్తుంది.
"జానకీ! అదృష్టమంటే ఇలా వుండాలి. ఇదివరకు పెళ్ళి కొడుకులంతా కట్నానికాశపడి నిన్ను చేసుకోననటం మంచికే అయింది. లేకపోతే ఈ మాధవ గారికి భార్యవి కాగలిగేదానివి కాదు. అయన ఎంతో బాగున్నారు! ఆస్తి కూడా వుందిట. లెక్చరర్ ఉద్యోగం. కట్నం లేకుండా నిన్ను చేసుకుంటాననటంలోనే అయన మంచితనం అర్ధమవుతుంది. గొప్పదానివై పోతున్నావు" ఇంక నన్ను మరిచిపోతావా?"
జానకి నవ్వింది.
"నిన్ను మరిచిపోయెంత గొప్పదాన్ని కావటం లేదు. నన్ను నువ్వు మరిచిపోవాలే కాని, నేను నిన్ను మరిచిపోలేను."
"అలా ఏడుపు నవ్వు నవ్వకు. ఇలా నీరసంగా మాట్లాడకు. సిగ్గుపడుతూ నవ్వాలి. కులుకుతూ మాట్లాడాలి. ఛీ! ఛీ! మొద్దవతారం . ఏం తెలీదు ."
పకపక నవ్వింది కుసుమ.
కుసుమ అందమైంది. తాను అందమైనదాన్ననే విషయం ఏ క్షణమూ మరిచిపోదు. కుసుమ నుంచోటంలో, కుర్చోటంలో , నవ్వటంలో, మాట్లాడటంలో తను అందమైన దానినన్న భావం ప్రతిఫలింపచేస్తూనే ఉంటుంది. దానికి తోడు ఏ సమయంలో ఎలా అలంకరించుకోవాలో, ఎప్పుడెలా మాట్లాడాలో, ముఖ్యంగా మగవాళ్ళని ఎలా కవ్వించి తన చుట్టూ తిప్పుకోవాలో బాగా తెలుసు కుసుమకి. ఆ పల్లెటూరికి దగ్గిర్లో ఉన్న వరంగల్ కాలేజిలో చదువుతోంది. కాలేజీ విద్యార్ధులలో ఇంచుమించు అందరూ ఆమె కడగంటి చూపు కోసం , చిరునవ్వు కోసం ప్రాకులాడుతూ వెర్రివాళ్ళలా తిరిగెవాళ్ళే! అందరినీ అలా తన చుట్టూ తిప్పుకోవటం ఏంతో సరదా కుసుమకి.
పాపం, శ్రీనివాసుకి ఈ సంగతులేవీ తెలియవు. తన కూతురు ఇంకా అభమూ శుభమూ తెలియని పసిపిల్లా అనే అనుకుంటున్నాడు ఆ అమాయకుడు. జానకికి మాత్రం అన్నీ తెలుసు. కుసుమే అన్నీ చెప్పేది. తనకోసం ఎవరెవరు ఎన్నెన్ని ప్రేజేంట్లు కొన్నారో, తన్ను కాఫీ హోటళ్ళకాహ్వనించడానికి ఎలా పోటీలు పడ్డారో , ఒక్కోసారి తమతో సినిమాకు వస్తే చాలని ఎంత తపస్సు చేసేవారో వర్ణించి చెప్పి విరగబడి నవ్వేది కుసుమ.
"కాస్త ముందు వెనుకలు ఆలోచించు కుసుమా! ఇలా ప్రవర్తించటం ప్రమాదం కదూ!" అనేది జానకి భయపడుతూ.
"యఏం ప్రమాదం! వాళ్ళందరినీ పిచ్చికుక్కల్లా నా చుట్టూ తిప్పుకుంటానంతే! వాళ్ళ చేత కావలసిన పనులన్నీ చేయించుకుంటాను. ఏ ఒక్కడిని గిరిదాటి రానియ్యను." గర్వంగా అనేది కుసుమ. జానకికి ఇక మాటలు దొరికేవి కావు. ఒకవేళ తను ఏమైనా చెప్పినా కుసుమ వినిపించుకోదని జానకికి బాగా తెలుసు. అలమేలుకు చెప్తే కుసుమ ను మందలించక పోగా ఎదురు జానకికే చివాట్లు తగులుతాయి. శ్రీనివాసుకి చెప్పే సాహసం లేదు.
కుసుమ ప్రవర్తనను ఆమోదించగలిగినా,ఆమోదించగలిగినా , ఆమోదించలేకపోయినా, కుసుమ అంటే పంచ ప్రాణాలు జానకికి , అలమేలు జానకిని అనవసరంగా సతాయించినప్పుడల్లా తల్లి అని కూడా ఆలోచించకుండా అలమేలు మీదకు ఖస్సుమని లేచేది కుసుమ.
ఎవ్వరికీ భయపడని అలమేలు కుసుమ ముందు ముడుచుకుపోయేది.
అలమేలు అతి రహస్యంగా కుసుమకు ప్రత్యేకంగా ఏదయినా చిరుతిండి పెట్టేది. అది అందరిలోనూ జానకితో పంచుకుని పకపక నవ్వేది కుసుమ. ఈ చర్యలన్నీ జానకికి సంతోష కారణాలయ్యాయని కాదు, నిజానికి ఇలా తనకోసం కుసుమ తల్లిని కవ్వించటం జానకికి కటకటగానే ఉండేది.
కుసుమకి జడిసి ప్రస్తుతానికి నోరు మూసుకున్నా తరువాత వదిన తనమీద కసి తీర్చుకోక మానదని జానకికి బాగా తెలుసు. అయినా కుసుమకు తనమీద ఉన్న ప్రేమ తలుచుకునే సరికల్లా జానకి మనసు ఆర్ద్రమైపోయేది.
శ్రీనివాసుతో కలిసి తను కూడా బజారుకెళ్ళి పెళ్ళికి కావలసిన చీరలు కొంది కుసుమ.
"అయ్య బాబోయ్! వంద రూపాయల చీరలు రెండా?" గుండె బాదుకుంది అలమేలు.
"కట్నం ఇయ్యటం లేదుగా అమ్మా! ఈ మాత్రం చీరలు కొనకపోతే ఎలా?" నిర్లక్ష్యంగా విదిలించేసింది కుసుమ.
స్వయంగా దగ్గరుండి జానకిని అలంకరించింది.
మంగళసూత్రధారణకు తనే జడ ఎత్తి పట్టుకుంది. తలంబ్రాలు త్వరగా పొయ్యమని హెచ్చరించింది. తలుపు దగ్గర నిల్చుని పేర్లు చెప్పించింది.
"ఇవన్నీ పెద్ద ముత్తైదులు చేయించాలి. పెళ్ళి కాని పిల్ల నువ్విలా అన్నింట్లోకి తయారవటం ఏమిటి?' అని అలమేలు విసుకున్నా ఫకాలున నవ్వేసింది . ఆ నవ్వుకు సమాధానం లేదు .ఏవరూ చెప్పలేరు.
తంతు పూర్తయ్యాక బుగ్గన కాటుక చుక్కతో,కొద్దిగా వదిలిన ముఖంతో అలసటగా కూర్చున్న జానకి దగ్గరగా వచ్చి గడ్డం పుచ్చుకుని ఆ ముఖాన్ని పైకెత్తి ఏదో అపూర్వ దృశ్యం చూస్తున్నట్లు కొన్ని క్షణాలు ఆ ముఖంలోకి చూస్తూ కూర్చుంది కుసుమ.
"నువ్వు కాదు అదృష్టవంతురాలివి. మాధవ! ఆతను అదృష్టవంతుడు. ఇలాంటి దేవీమూర్తిని పొందగలగటం సామాన్య విషయం కాదు."
ప్రగాడమైన అభిమానం పొంగి పొరలగా కుసుమను గాడంగా కౌగలించుకుంది జానకి. ఆ క్షణంలో జానకి కళ్ళలో లీలగా కదిలిన నీటి బిందువులు కుసుమకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. కారణం అడగబోయింది. అంతలో ఎవరో పిలిచారు. ఆ సందట్లో ఆ విషయమే మరిచిపోయింది.
జరిగినదంతా కలలా అనిపిస్తోంది మాధవకు. కాని, పూలతో అలంకరించబడిన మంచమూ, మధురమైన వాసనలు, వ్యాపింపజేస్తున్న ఊదవత్తులూ , స్టూలు మీద అమర్చబడిన రకరకాల ఫలహరాలూ, ఇవన్నీ జరిగింది కలకాదని చెప్తున్నాయి. చిత్రమేమిటంటే , అతని మనసుకిది బాధగా తోచడం లేదు. పీటల మీద కూచున్నప్పుడు తగిలీ తగలనట్లుగా తగిలిన జానకి శరీరం అతనికింకా గిలిగింతలు పెడుతోంది. తలంబ్రాలు దోసిట్లో నింపుకుని జానకి బలవంతాన ఎత్తిన ఆ చేతుల పసిడికాంతులు ఇప్పటికీ కళ్ళకు మిరుమిట్లు గొలుపుతున్నాయి. తలుపు దగ్గర తన పేరు ఉచ్చరిస్తున్నప్పుడు జానకి బుగ్గలలో చిందిన అరుణిమ అతని స్మృతి పధాన్ని వదలటం లేదు. అతనికి అందుబాటులో లేని ఏదో విచిత్ర శక్తికి పశుడై పోయిన వ్యక్తిలా ఉన్నాడు మాధవ. తలుపు కొట్టుకున్న చప్పుడుకు ఉలికిపడి అంతలో నవ్వుకున్నాడు. గాలికి కిటికీ తలుపులు కొట్టుకున్నాయి. ఇంక కొంతసేపట్లో జానకి వస్తుంది. అతిదీనంగా తనను చూస్తుంది.