అతనికి చలి వేయసాగింది. గత సాయంత్రం వానకు తడిసినందువల్ల కాబోలు కొంచెం దగ్గుకూడా వస్తోంది. "సరోజినీ లోపలకు పోదాం రా" అన్నాడు. అతని వెనుకనే వచ్చింది.
అతను కుర్చీలో కూలబడుతూ "అన్నట్టు యీ మధ్య ఓ చిత్రం చూశాను సరోజినీ" అని కొంచెం గట్టిగానే అరిచాడు.
"ఏమిటా అరుపు?" అని కాస్త ఆగి "ఏమిటా చిత్రం?"
"ఓ అమ్మాయిని చూశాను. అందమైన అమ్మాయి."
"అందమైన అమ్మాయిల్ని ఎవరు చూడరు?"
"ఈ ఒక్క ముక్కా తెలివిగా మాట్లాడావు సరోజినీ సాంతం విను ఆ అమ్మాయికి రెండు కళ్ళూ, రెండు చెవులూ, ఓ నాసికా...."
"రెండు కాళ్ళూ రెండు చేతులూ...."
"అచ్చం నీలాగే వున్నాయి."
"ఉంటే వున్నాయి."
"గొంతూ అలానే వుంది."
"ఉంటే నాకేం?"
"నీకు కాకపోతే మరెవరికి? ఈ లోకంలో నీకో పోటీ తయారయింది."
"దిగుల్లేదు."
ఆ ప్రసక్తి అలా కొనసాగించడం అతనికే భావ్యంగా కనబడక "తొమ్మిది అయ్యేసరికల్లా రెండోసారి కాఫీ త్రాగడం అలవాటు. గోవిందు ఆదుర్దాలో ఈ విషయం మరిచిపోయినట్లున్నాడు" అన్నాడు.
"నేను కలుపుకొస్తాను" అని సరోజిని అతను వారిస్తుండగానే క్రిందకు దిగి వెళ్ళిపోయింది.
సరోజిని యిప్పుడు రావడం చిత్రంగానే వుంది. ఏనాడో ఒకనాడు తనను వెదుక్కుంటూ వచ్చే ధైర్యం ఆమెకుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఈసారి ఆమెను చూసి ఆరునెలలు దాటింది. అదైనా ఓ బంధువుల యింట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు కాకతాళీయంగా జరిగింది. అసలప్పుడు స్వేచ్చగా మాట్లాడుకోవడం పడనేలేదు. 'సరోజినీ! మంచినీళ్ళు తెచ్చియ్యి' అనేవాడు. తెచ్చిచ్చేది. 'విసనకర్ర యిస్తావా?' అనేవాడు ఇచ్చేది.
ఓసారి విడిదింట్లో వేడుకలు జరుగుతున్నాయి. వెండిపుల్లా, వెండి నాలిక గీసుకునేది యిచ్చి పెళ్ళికూతురిచేత పెళ్ళికొడుక్కి ఉత్తుత్తి ముఖం కడిగిస్తున్నారు. ఆ వినోదం అట్టే నచ్చక తనకి యిచ్చిన గదికి వచ్చాడు. అంతలో సరోజిని ఆ దారిన పోతోంది.
"ఈసారి నిన్ను వదిలేది లేదు" అన్నాడు హఠాత్తుగా ఆమె భుజం మీద చేయివేసి అంతకుముందు ఆమెతో అల ఎప్పుడూ మాట్లాడలేదన్న విషయం మరిచిపోయి.
"ఏమిటి బాబూ ఇది?" అంది సరోజిని తెల్లబోయి.
తన పనికి తనే సిగ్గుపడి గదిలోకి వెళ్ళి దిండులో తల దాచుకుని కుమిలి పోయాడు.
ఆ రాత్రి వరుసకు పిన్ని అయిన ఒకామె ఒంటరిగా పట్టుకుని చివాట్లు పెట్టింది.
"ఒరేయి బాబూ! నీకింకా తెలీదు, చిన్నవాడివి పెద్దవాళ్ళకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు నీతో చనువుగా వుంటాను కాబట్టి చెబుతున్నాను. ఈ విషయం మీ అమ్మకుగానీ, నాన్నకుగానీ తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు మనుషులు చెడిపోబోయే వయస్సు యిదే. ఇప్పుడే శీలాన్ని కాపాడుకోవాలి. ఈ విషయం మీ అమ్మకుగానీ, నాన్నకుగానీ తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు మనుషులు చెడిపోబోయే వయస్సు యిదే. ఇప్పుడే శీలాన్ని కాపాడుకోవాలి. ఈ విషయం నలుగుర్లోనూ పొక్కితే యింకేమైనా వుందా?"
చప్పున వెళ్ళి కృష్ణలో మునుగుదామనుకున్నాడు. ఆవిడకి కళ్ళజోడు పెట్టిన డాక్టర్ని ఒక్క గుద్దుతో హతమార్చాలి. చేసేదిలేక తల దించుకుని యివతలకి వచ్చాడు. అప్పటికి అనుమానంతోచి "పంకజమ్మగారికి చెబుతావా చచ్చు మొహమా?" అని తర్వాత సరోజినికి ఉత్తరం రాస్తే-
"నీమీద ప్రమాణము చేసి చెప్పుచున్నాను. అటువంటి పని నేనెన్నడూ చేయలేదు" అని జవాబు రాసింది.
ఇదంతా గుర్తుకువచ్చి తన్మయతతో కూడిన చిరునవ్వు పెదాలమీద మెదుల్తుండగా, సరోజిని కాఫీ కప్పుతో పైకి వచ్చింది.
"ఎందుకు నవ్వుతున్నావు?" అంది.
"ఏదో గుర్తుకొచ్చింది."
"ఊఁ నాగురించే నవ్వుతున్నావు" అంది ముఖం ముకుళించి, కాఫీ అందించి.
"పోనీ ఏం నవ్వితే?"
"నా గురించి నవ్వితే నాకు కోపం రాధా ఏమిటి?"
"పో, ఊరికినే వాదన పెంచకు పెంకిపిల్లా."
వాదన పెరిగేదే, ఇంతలో క్రిందనుంచీ 'ఒరేయ్ శివాయ్' అనే పిలుపు గట్టిగా వినిపించింది.
"ఎవరో వచ్చారు నీకోసం" అంది సరోజిని సన్నని కంఠంతో.
"ఫ్రెండ్స్" అన్నాడు కాఫీ కప్పు బల్లమీద పెట్టి క్రిందకు వెళ్ళాడు. చంద్రం, మోహన్, కృష్ణ వచ్చారు, ముగ్గురూ సిగరెట్లు కాలుస్తున్నారు. శుభ్రంగా బట్టలు వేసుకుని వచ్చారు.
శివనాథరావు కూడా ఓ కుర్చీలోకూర్చుంటూ 'ఏమిటి నామీద దయ?'
"నిన్నటి పెనుతుఫాన్ కు నీకేమైనా ప్రాణహానిగానీ, దేముడు మేలుచేస్తే గుండె మందగించడం, రక్తం ఘనీభవించడం యిత్యాది వికారాలేమైనా జరిగినయ్యేమోనని చూడవచ్చాం" అన్నాడు కృష్ణ.
"దుర్భలుడివి" అన్నాడు చంద్రం గంభీరంగా.
మోహన్ ప్రస్తుతానికి ఏమీ పలకలేదు.
చంద్రం మంచి క్రికెట్ ఆటగాడు. ఫస్టు బౌలరు. ఈమధ్య స్టేట్ కి కూడా రిప్రజెంట్ చేశాడు. హఠాత్తుగా ఇలా అన్నాడు. "నన్నడిగితే యీ గాలివానలూ అవి ఆవశ్యం ఉందాలంటాను. జీవితమంతా సాఫీగా గడిచిపోతే అందులో సొగసులేదు. ఎప్పుడూ ఆనందమే వుండకూడదు, ఎప్పుడూ కష్టాలే వుండకూడదు. పేదరికంతో అలమటించిన వ్యక్తి అమాంతంగా కోటికి పడగలెత్తాలి. తరువాత మళ్ళీ ఆరిపోయిన ఫర్వాలేదు. కరిగిపోయిన కొవ్వొత్తిలా. అట్లాగే స్వర్గసీమలో విహరిస్తూన్న వ్యక్తి కష్టాల కడలిలో పడి యీదులాడాలి. జీవితంలో గాలివానలివే."
"నేనొప్పుకోను" అన్నాడు క్రిష్ణ.
"ఏమిటి నీ పాయింటు?"
"గాలివాన అంటే ఓ పెద్ద ఘతంలాంటిది అన్నమాట. దీనికి అనేక అర్ధాలు తీయవచ్చు. కరువుకాటకాలు, యువకుల ఆకస్మిక చావులు, కుటుంబ కలహాలు సైకలాజికల్ గా గాలివానలే. నీవు చెప్పినప్రకారం దేశం వీటిని వాంఛిస్తున్నదంటావా?"
"వైనాట్? వాంఛించి తీరాలి."
"అయితే దేశం సుభిక్షంగా వుండడం నీ అభిలాష కాదన్న మాట."
"నువ్వు నా మాటల్లోని అంతరార్ధం గ్రహించాలి. ఏమిటి సుభిక్షమంటే? అందరికీ డబ్బుంటుందనుకో. పొట్టలు పగిలేలా తింటారు. వీళ్ళంతా అజీర్తి చేసి మంచంపడో, చచ్చో యిలాంటివేవో జరుగుతాయంటావా? వారానికోసారి శుక్రవారమో, శనివారమో ఉపవాసముండడంలో అర్ధమేమిటి? సరే, సుఖాలను మరిగి, కర్తవ్యాలను మరిచి భోగలాలసులై కూర్చుంటే యిహ అనుభూతి అంటే ఏమిటి?"
"నువ్వు తప్పతడుగు తొక్కుతున్నావు. అనుభూతి మనస్సుకు సంబంధించింది. భోగలాలసత్వం భౌతికం."
"ఈ రెంటికీ సంబంధం వుందని రుజువుచేస్తాను. ముందు బాగా ధనంవుంటే ఏం జరుగుతుందో చెప్పనియ్యి. మన శివాయి వున్నాడు.. వాడికి బాగా డబ్బుంది. బలహీనుడు చపాతీలు తింటేగాని బలం పట్టదు. తింటే అజీర్తి చేస్తుంది. ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం కావటం?"
"అవును ఎట్లా?" అన్నాడు మోహనరావు.
"నేను చెబుతాను. దీనికి మార్గం వుంది. వాడికి ఏ టైఫాయిడో రావాలి. టైఫాయిడ్ వచ్చి, తగ్గి గుమ్మాలు పట్టకుండా తయారైన వారిని నేను చాలామందిని చూశాను ఆ టైఫాయిడే గాలివాన."
మిగతా వాళ్ళిద్దరూ నవ్వటం మొదలుపెట్టారు. శివనాథరావు కష్టంమీద నవ్వు దాచుకున్నాడు.
చంద్రం కొంచెం కళ్ళు ఎర్రచేసి "చాతనైతే అడ్డుపడండి. అంతేగానీ నవ్వడం సభ్యత అనిపించుకోదు..... లేకపోతే వారు ఇంకో పని చేయవచ్చు. పాతిక రోజులకి తక్కువకాకుండా నిరాహారదీక్షకు ఉపక్రమించాలి. దాంతో జీర్ణశక్తి కుదుటబడి, తిన్నది వంటబడుతుంది."